ఈ విదేశీ వంటకం 13వ, 14వ శతాబ్దాల కాలంలో సిల్క్ రోడ్ వర్తకులు, మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులు, వంటవాళ్ల ద్వారా భారత్ లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ సుల్తానుల పాలనలో రాజభవనాల్లో జరిగే విందులలో సమోసాను ఎంతో ప్రత్యేకమైన వంటకంగా వడ్డించేవారని ప్రసిద్ధ రచయిత అమీర్ ఖుస్రో, మొరాకో యాత్రికుడు ఇబ్న్ బతూతా తమ రచనల్లో చెప్పారు. అప్పట్లో ఇది మాంసంతో కూడిన రాజభోజనంగా మాత్రమే ఉండేది. అయితే 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు భారతదేశానికి బంగాళాదుంపలను (ఆలూ) పరిచయం చేయడంతో సమోసా రుచి మారింది. భారతీయ వంటగాళ్లు మాంసానికి బదులుగా ఉడకబెట్టిన ఆలూ, పచ్చి బఠానీలు, అల్లం, ధనియాలు, గరం మసాలాలను స్టఫింగ్‌గా ఉపయోగించడం ప్రారంభించారు.