మన కూరలు, బిర్యానీలు, పప్పుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ఊహించలేం. దాదాపు అన్ని రకాల కూరల్లో ఉల్లిపాయలే ముఖ్యమైనవి. ఉల్లిపాయ లేకపోతే కూర వండడం కూడా కష్టంగా మారిపోతుంది. అయితే, భారతదేశంలో ఉల్లిపాయ అస్సలు కనిపించని గ్రామం ఒకటుంది. అక్కడ ఉల్లిపాయలు తినడమే కాదు అసలు అమ్మరు కూడా. గ్రామంలోని ప్రజలు ఉల్లిపాయలు పండించరు. ఆ గ్రామం జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న కట్రా. ఈ గ్రామాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మాతా వైష్ణో దేవి యాత్రకు బేస్ క్యాంప్‌గా పిలుస్తారు. ఈ గ్రామంలో ఉల్లిపాయ, వెల్లుల్లిపై పూర్తి నిషేధం ఉంది. ఇక్కడ ఉల్లిపాయలను పండించడం కానీ, మార్కెట్లలో విక్రయించడం కానీ చట్టరీత్యా నేరం.
కట్రాలోని స్థానిక కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు లేదా హోటళ్లలో కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి ఎక్కడా లభించవు. రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న ధాబాల నుండి పెద్ద పెద్ద స్టార్ హోటళ్ల వరకు ఎక్కడా వీటిని వాడరు. ఇక్కడ దొరికే భోజనంలో ఎప్పుడు కూడా ఉల్లిపాయను అస్సలు ఉపయోగించరు. ఈ ప్రాంతంలో ఉల్లిపాయలు అమ్మే ధైర్యం ఏ వ్యాపారి చేయరు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు లేదా భక్తులు ఎవరైనా సరే ఈ నియమాన్ని పాటించాల్సిందే.