
మంచుతో కప్పుకున్న కొండలు, పచ్చని లోయలు, సరస్సులు, పూల మైదానాలు, హిమనదాలు.. ప్రకృతి అందాలకు కశ్మీర్ పెట్టింది పేరు. అందుకే కశ్మీర్‌ను ‘భూతల స్వర్గం’గా పిలుస్తుంటారు… జీవితంలో ఒక్కసారైనా కశ్మీర్ అందాలను చూడాలని చాలామంది కోరుకుంటారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్నా ఎండలు మండిపోతున్నాయి... కాబట్టి కశ్మీర్ ను సందర్శించేందుకు ఇదే మంచి సమయం.
హైదరాబాద్ నుంచి కశ్మీర్ వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో గుల్మార్గ్, పహల్గామ్, సోన్‌మార్గ్, శ్రీనగర్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ టూర్ డిటెయిల్స్ ఇక్కడ తెలుసుకుందాం.
ఐఆర్సిటిసి అందిస్తున్న ఈ కశ్మీర్ టూర్ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు కొనసాగుతుంది. హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఈ టూర్ స్టార్ట్ అవుతుంది.. విమానంలో శ్రీనగర్‌కు వెళ్లి అక్కడి నుంచి వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ఈ టూర్‌ను రూపొందించారు. హోటల్ వసతి, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ప్రయాణ సౌకర్యాలతో పాటు టూర్ ఎస్కార్ట్ సేవలు కూడా ప్యాకేజీలో ఉన్నాయి.
ఈ టూర్ రెండు తేదీల్లో అందుబాటులో ఉంది.
2026 అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 17 వరకు
2026 నవంబర్ 21 నుంచి నవంబర్ 26 వరకు
కంఫర్ట్ క్లాస్‌లో ఈ ప్యాకేజీని అందిస్తున్నారు.
ఒక్కొక్కరికి ప్యాకేజీ ధర ఎంత?
ప్రయాణికుల వసతి విధానాన్ని బట్టి ప్యాకేజీ ధరల్లో మార్పు ఉంటుంది.
సింగిల్ ఆక్యుపెన్సీ : రూ.44,670
డబుల్ ఆక్యుపెన్సీ : రూ.39,070
ట్రిపుల్ ఆక్యుపెన్సీ : రూ.37,510
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో : రూ.30,230
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా : రూ.27,870
మొదటి రోజు.. హైదరాబాద్ నుంచి శ్రీనగర్
టూర్ మొదటి రోజు హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంతో ప్రారంభమవుతుంది. శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పర్యాటకులను పికప్ చేసి హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత సాయంత్రం సమయం పర్యాటకుల సొంత సమయంగా ఉంటుంది. రాత్రికి శ్రీనగర్‌లోనే హోటల్‌లో బస ఉంటుంది. డిన్నర్ కూడా అందిస్తారు.
రెండో రోజు.. సోన్‌మార్గ్ అందాలు
రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత శ్రీనగర్ నుంచి సోన్‌మార్గ్‌కు ప్రయాణం మొదలవుతుంది. సముద్ర మట్టానికి సుమారు 2,800 మీటర్ల ఎత్తులో ఉండే సోన్‌మార్గ్‌ను ‘మేడో ఆఫ్ గోల్డ్’ అంటే ‘బంగారు మైదానం’గా పిలుస్తారు. చుట్టూ మంచుతో కప్పుకున్న పర్వతాలు, నీలి ఆకాశం, పచ్చని ప్రకృతి ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
సింధ్ నది ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తుంది. ట్రౌట్, మహ్‌సీర్ వంటి చేపలు ఇక్కడ కనిపిస్తాయి. మంచుతో కప్పబడిన ప్రాంతాలను కూడా పర్యాటకులు ఆస్వాదించవచ్చు. వేసవి కాలంలో తజ్‌వాస్ గ్లేసియర్ ప్రాంతానికి వెళ్లేందుకు పోనీలు (చిన్న గుర్రాలు) అందుబాటులో ఉంటాయి.
అయితే IRCTC సోన్‌మార్గ్‌లోని టూరిస్ట్ బస్ పార్కింగ్ ప్రాంతం వరకు మాత్రమే తీసుకెళ్తుంది. అక్కడి నుంచి గ్లేసియర్ పాయింట్లు, సమీప ప్రాంతాలను సందర్శించాలంటే పోనీ వంటి స్థానిక రవాణాను పర్యాటకులు తమ సొంత ఖర్చుతో వినియోగించుకోవాలి. సాయంత్రం తిరిగి శ్రీనగర్ చేరుకుని హోటల్‌లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.
మూడో రోజు.. గుల్మార్గ్ ట్రిప్
మూడో రోజు ఉదయం అల్పాహారం తర్వాత శ్రీనగర్ నుంచి గుల్మార్గ్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు. పూల మైదానాలకు ప్రసిద్ధి చెందిన గుల్మార్గ్ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ఇక్కడి ప్రధాన ఆకర్షణల్లో గుల్మార్గ్ గోండోలా కేబుల్ కార్ కూడా ఒకటి. ఇది ప్రపంచంలోని ఎత్తైన కేబుల్ కార్ వ్యవస్థల్లో ఒకటిగా పేరుగాంచింది.
గోండోలా ప్రయాణం ఈ ప్యాకేజీలో చేర్చలేదు. దానికి సంబంధించిన ఖర్చును పర్యాటకులే నేరుగా చెల్లించాలి. అలాగే ఖిలన్‌మార్గ్ వైపు చిన్న ట్రెక్కింగ్ చేయాలనుకునేవారు కూడా సొంత ఖర్చుతో వెళ్లవచ్చు.
గుల్మార్గ్‌లో కూడా IRCTC టూరిస్ట్ బస్ పార్కింగ్ వరకు మాత్రమే వెళ్తుంది. అక్కడి నుంచి గోండోలా పాయింట్ లేదా ఇతర సమీప సందర్శనా ప్రాంతాలకు వెళ్లేందుకు జీప్, పోనీ వంటి స్థానిక రవాణాను పర్యాటకులు సొంత ఖర్చుతో ఉపయోగించుకోవాలి. అనంతరం శ్రీనగర్‌కు తిరిగి వచ్చి హోటల్‌లో రాత్రి బస చేస్తారు.
గుల్మార్గ్ గోండోలా కేబుల్ కార్ బుకింగ్: Jammu Kashmir Cable Car అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చు.
నాలుగో రోజు.. పహల్గామ్ ప్రకృతి అందాలు
నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత శ్రీనగర్ హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి పహల్గామ్‌కు బయలుదేరుతారు. సముద్ర మట్టానికి సుమారు 2,440 మీటర్ల ఎత్తులో ఉన్న పహల్గామ్‌ను ‘వ్యాలీ ఆఫ్ షెపర్డ్స్’గా పిలుస్తారు.
మార్గమధ్యలో కుంకుమ పువ్వు పంట పొలాలు, అవంతిపుర శిథిలాలను సందర్శించే అవకాశం ఉంటుంది. పహల్గామ్ ప్రకృతి అందాలతో పాటు భారతీయ సినిమా చిత్రీకరణలకు కూడా ప్రసిద్ధి చెందింది. లోయలోని అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
పర్యాటకులు ఆసక్తి ఉంటే బేటాబ్ వ్యాలీ, చందన్‌వారి, అరూ వ్యాలీ వంటి ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. అయితే వీటికి సంబంధించిన అదనపు ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. పర్యాటకులు స్వయంగా చెల్లించాలి.
పహల్గామ్‌లోనూ కోచ్ టూరిస్ట్ బస్ పార్కింగ్ ప్రాంతం వరకు మాత్రమే వెళ్తుంది. అక్కడి నుంచి మినీ స్విట్జర్లాండ్ లేదా ఇతర సమీప ప్రాంతాలను సందర్శించాలంటే జీప్ లేదా పోనీ వంటి స్థానిక రవాణాను సొంత ఖర్చుతో ఉపయోగించుకోవాలి. రాత్రికి పహల్గామ్‌లోనే హోటల్‌లో బస ఉంటుంది.
ఐదో రోజు.. శ్రీనగర్ పయనం
ఐదో రోజు ఉదయం అల్పాహారం తర్వాత పహల్గామ్ హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి శ్రీనగర్‌కు తిరుగు ప్రయాణం ఉంటుంది. శ్రీనగర్ చేరుకున్న తర్వాత శంకరాచార్య ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. సాయంత్రం ప్రసిద్ధ దాల్ లేక్‌లో శికారా రైడ్ ద్వారా సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు. చార్ చినార్, తేలియాడే తోటలను కూడా వీక్షించవచ్చు. అయితే శికారా రైడ్‌కు సంబంధించిన ఖర్చు ప్యాకేజీలో భాగం కాదు. పర్యాటకులు సొంతంగా చెల్లించాలి. అనంతరం శ్రీనగర్ హోటల్‌లో చెక్ ఇన్ చేసి డిన్నర్ చేసి అక్కడే రాత్రి బస చేస్తారు.
ఆరో రోజు.. శ్రీనగర్ నుంచి హైదరాబాద్‌కు
టూర్ చివరి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్‌అవుట్ చేస్తారు. అనంతరం శ్రీనగర్‌లోని మొఘల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్ లేదా షాలిమార్ గార్డెన్స్‌ను సందర్శిస్తారు. తర్వాత శ్రీనగర్ విమానాశ్రయానికి తీసుకెళ్లి హైదరాబాద్ తిరుగు విమానంలో ప్రయాణం చేయిస్తారు. దీంతో ఆరు రోజుల కశ్మీర్ టూర్ ముగుస్తుంది.
IRCTC కశ్మీర్ టూర్ ప్యాకేజీ ధరలో కొన్ని ముఖ్యమైన సేవలు చేర్చారు.
హైదరాబాద్-శ్రీనగర్-హైదరాబాద్ విమాన టికెట్లు
5 రాత్రుల హోటల్ వసతి, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్
దాల్ లేక్‌లో శికారా రైడ్ ప్యాకేజీలో భాగమే.
టూర్ షెడ్యూల్ ప్రకారం సీట్ ఇన్ కోచ్ ప్రాతిపదికన రవాణా
IRCTC టూర్ ఎస్కార్ట్ సేవలు
ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్, పార్కింగ్, పన్నులు కూడా ప్యాకేజీలో ఉన్నాయి.
సందర్శనా ప్రాంతాల్లో ప్రవేశ టికెట్లు
బయట భోజనం
నిర్దేశించిన కార్యక్రమం కాకుండా చేసే అదనపు ప్రయాణాలు ప్యాకేజీలో ఉండవు.
హైదరాబాద్‌లో స్థానిక రవాణా
విమానాశ్రయం పికప్ లేదా డ్రాప్ సౌకర్యం కూడా ఇందులో లేదు.
విమానంలో భోజనం అందించరు.
ఎయిర్‌పోర్ట్ ట్యాక్స్, ఫ్యూయల్ సర్‌చార్జ్ వంటి ఖర్చులు పెరిగితే ఆ అదనపు మొత్తాన్ని ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. డ్రైవర్లు, గైడ్లు, ప్రతినిధులకు ఇవ్వాల్సిన టిప్స్ కూడా ప్యాకేజీలో లేవు. లాండ్రీ, వైన్, మినరల్ వాటర్, సాధారణ మెనూలో లేని ఆహారం, పానీయాలు వంటి వ్యక్తిగత ఖర్చులు పర్యాటకులే భరించాలి. ముఖ్యంగా గుల్మార్గ్ గోండోలా రైడ్, టూర్ గైడ్ సర్వీస్‌కు అయ్యే ఖర్చులు ప్యాకేజీలో చేర్చలేదు.
పర్యటనకు సంబంధించిన షెడ్యూల్, విమాన సమయాలు కేవలం సూచనాత్మకమైనవని IRCTC పేర్కొంది. ఆపరేషనల్ సమస్యలు లేదా స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రయాణ ప్రణాళికలో మార్పులు చేసే హక్కు IRCTC, సంబంధిత హ్యాండ్లింగ్ ఏజెంట్‌కు ఉంటుంది.
కొన్ని ప్రాంతాలకు పెద్ద బస్సులు వెళ్లలేని పరిస్థితి ఉండవచ్చని సంస్థ తెలిపింది. అలాంటి సందర్భాల్లో నడవలేని లేదా ఇబ్బంది పడే పర్యాటకులు ఆటో రిక్షా వంటి స్థానిక రవాణాను సొంత ఖర్చుతో ఉపయోగించుకోవాల్సి రావచ్చు. స్థానిక మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను బట్టి సేవలు మారవచ్చని IRCTC స్పష్టం చేసింది.
ప్రయాణంలో బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్, వేరుశెనగలు వంటి ప్యాక్డ్ ఫుడ్, స్నాక్స్ వెంట తీసుకెళ్లవచ్చని సూచించింది.
IRCTCని ఎలా సంప్రదించాలి?
కశ్మీర్ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్, అందుబాటులో ఉన్న సీట్లు, తాజా ఛార్జీలు తదితర విషయాల కోసం IRCTC సౌత్ సెంటర్ జోన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
iRCTC South Central Zone
9-1-129/1/302, 3వ అంతస్తు, ఆక్స్‌ఫర్డ్ ప్లాజా,
ఎస్.డి. రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.
జోనల్ ఆఫీస్:
040-27702407 / 9701360701
పవన్: 8287932228
శశిధర్: 8287932229
నవీన్: 8287932230
భరద్వాజ్: 9281030733
చ. సతీష్: 9281030712
నరేష్: 9281030711
జయంత్: 9281495845
మల్లేష్: 9281495843
ఉద్గిర్ సంతోష్: 9281030734
IRCTC విజయవాడ
రైల్వే రిటైరింగ్ రూమ్ సమీపంలో, విజయవాడ
బాలాజీ: 9281030714
వై. ప్రవీణ్: 9281495848
లలిత: 8287932311
IRCTC తిరుపతి
ఫ్లాట్ పామ్ నెంబర్.1, ఫస్ట్ ప్లోర్, రిటైరింగ్ రూమ్ కాంప్లెక్స్,
తిరుపతి రైల్వే స్టేషన్.
కె. పవన్: 8287932313
హైదరాబాద్ నుంచి కశ్మీర్‌ను విమానంలో చేరుకుని, శ్రీనగర్‌తో పాటు సోన్‌మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రముఖ ప్రాంతాలను ఒకే టూర్‌లో చూసే అవకాశం ఈ ప్యాకేజీ ద్వారా లభిస్తుంది. అయితే బుకింగ్ చేసే ముందు ప్రయాణ తేదీలు, విమాన సమయాలు, హోటల్ వివరాలు, ధరలు, సౌకర్యాలు, అదనపు ఖర్చులు వంటి అంశాలను మరోసారి నిర్ధారించుకోవడం మంచిది.