ఈఫిల్ టవర్ చూసేందుకే ఎంతో మంది ప్రత్యేకంగా పారిస్ వెళతారు. అది ఒక్కరి సొత్తు కాదు.. ఫ్రాన్స్ దేశానికే గుర్తింపు తెచ్చిన కట్టడం అది. కానీ దాన్ని కూడా ఓ మోసగాడు తనదేనని చెప్పి రెండు సార్లు అమ్మేశాడు. అతడెవరో తెలుసా?
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కట్టడాల్లో ఈఫిల్ టవర్ ఒకటి. దీన్ని చూసేందుకు ఎంతో మంది పారిస్ వెళారు. కానీ ఈ భారీ టవర్‌ను ఓ మోసగాడు రెండు సార్లు అమ్మేశాడు. ఆ మోసగాడి పేరు విక్టర్ లస్టిగ్. 1925లో పారిస్‌లో ఉన్న సమయంలో ఈఫిల్ టవర్ గురించి వచ్చిన ఓ వార్త అతడికి మంచి అవకాశం ఇచ్చింది. టవర్ నిర్వహణకు చాలా ఖర్చు అవుతోందని, దాన్ని తొలగించి ఇనుమును స్క్రాప్‌గా అమ్మే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వచ్చిన సమాచారాన్ని లస్టిగ్ తన మోసానికి ఉపయోగించుకున్నాడు. తాను ప్రభుత్వ అధికారి అని చెప్పుకుని నకిలీ పత్రాలు తయారు చేశాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద స్క్రాప్ వ్యాపారులను రహస్యంగా కలవాలని పిలిచాడు. టవర్‌ను త్వరలో కూల్చబోతున్నామని, దాని ఇనుమును కొనుగోలు చేసే అవకాశం వారికి ఇస్తున్నామని చెప్పాడు. అతడి ఆకట్టుకునే మాటతీరు, నకిలీ పత్రాలు చూసి వ్యాపారులు అతడిని నిజంగానే ప్రభుత్వ అధికారి అని నమ్మారు.
23
నమ్మించడంలో దిట్ట
లస్టిగ్ తన ప్లాన్‌లో భాగంగా వ్యాపారులందరినీ ఒకేసారి కలవకుండా.. ఒక్కొక్కరితో విడిగా మాట్లాడాడు. వారిలో ఆండ్రే పొయిసన్ అనే స్క్రాప్ వ్యాపారి లస్టిగ్ మాటలను పూర్తిగా నమ్మాడు. ప్రభుత్వ కాంట్రాక్ట్ కావాలంటే తనకు ‘కమీషన్’ ఇవ్వాల్సి ఉంటుందని లస్టిగ్ అతడిని నమ్మించాడు. పొయిసన్ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాడు. డబ్బు తీసుకున్న వెంటనే లస్టిగ్ పారిస్ నుంచి వెళ్లిపోయాడు. కొంతకాలం తర్వాత మోసం బయటపడింది. కానీ తాను లంచం ఇచ్చిన విషయం బయటకు వస్తుందనే భయంతో పొయిసన్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో లస్టిగ్ మోసం చేసి మరీ సులభంగా తప్పించుకున్నాడు. మొదటి మోసం విజయవంతం కావడంతో అతడికి మరింత ధైర్యం వచ్చింది. అదే పద్ధతితో మరోసారి మోసం చేయాలనుకున్నాడు.చ మళ్లీ కొంతమంది స్క్రాప్ వ్యాపారులను సంప్రదించి, ఈఫిల్ టవర్‌ను తొలగించే పనిని అమ్మబోతున్నట్లు చెప్పాడు.
33
రెండోసారి ఫెయిలయ్యాడు
రెండోసారి మాత్రం పరిస్థితి లస్టిగ్ అనుకున్నట్లుగా సాగలేదు. అతడి వ్యవహారంపై కొంతమందికి అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం బయటపడుతుందని గ్రహించిన లస్టిగ్ వెంటనే పారిస్ నుంచి తప్పించుకుని అమెరికాకు వెళ్లిపోయాడు. మొదటిసారి అతడి మోసం విజయవంతమైంది. రెండోసారి మాత్రం టవర్‌ను అమ్మేలోపే అతడి ప్లాన్ బయటపడింది. అంటే రెండుసార్లు నిజంగా డబ్బు తీసుకుని టవర్‌ను అమ్మేశాడని చెప్పలేము కానీ రెండుసార్లు అమ్మేందుకు ప్రయత్నించాడని చెప్పొచ్చు. అయినా ఒక ప్రపంచ ప్రసిద్ధ కట్టడాన్ని తనదేనని నమ్మించి ఓ వ్యాపారి నుంచి డబ్బు తీసుకోవడం మామూలు విషయం కాదు. అతడి మోసం చరిత్రలో నిలిచిపోయింది.