
బోనాలు అంటేనే తెలంగాణ కల్చర్, ఇక్కడి ప్రజల ఎమోషన్. బోనం అనే పదం సంస్కృత పదం భోజనం నుండి వచ్చింది. మన గ్రామ దేవతలైన మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ తల్లికి భక్తితో సమర్పించే పవిత్రమైన నైవేద్యమే ఈ బోనం. ఆడపడుచులు ఎంతో నిష్ఠగా కొత్త బియ్యం, పాలు, బెల్లం కలిపి పరమాన్నాన్ని వండుతారు. ఆ వండిన అన్నాన్ని మట్టి కుండలో లేదా రాగి, ఇత్తడి పాత్రల్లో ఉంచుతారు.
ఈ కుండను పసుపు, కుంకుమ, సున్నం లేదా బియ్యపుపిండి బొట్లతో, వేపాకులతో ఎంతో ముచ్చటగా అలంకరిస్తారు. దానిపై ఒక దీపాన్ని వెలిగించి, ఆ బోనాన్ని తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాల మోతల మధ్య భక్తులు అమ్మవారి గుడికి తరలివెళ్తారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకాలమ్మ వంటి వేర్వేరు ప్రాంతీయ రూపాల్లో ఉన్న దేవతలను భక్తులు ఈ పండుగలో పూజిస్తారు. ఇలా బోనాలు సమర్పిస్తే దేవతలు శాంతించి, ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఊరిని సల్లంగా కాపాడుతారని ప్రజల గట్టి నమ్మకం.
హైదరాబాద్‌లో జరిగే బోనాల ఉత్సవాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. చారిత్రకారుల ప్రకారం ఈ పండుగ కాకతీయుల కాలం నుంచే ఉందని తెలుస్తోంది. కాకతీయుల కాలం ప్రారంభంలోనే మొదటి బోనం హైదరాబాద్ లో ప్రాంతంలో ఎత్తినట్టు పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. భాగ్యనగరంలో నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు ఎప్పుడూ గోల్కొండ కోటలోనే ఎందుకు స్టార్ట్ అవుతాయనే దానికి మరో ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది.
1675లో కుతుబ్ షాహీ పాలకుల హయాంలో, చివరి చక్రవర్తి అబుల్ హసన్ తానీషా వద్ద మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు గోల్కొండ కోటపై ఎల్లమ్మ దేవత కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. అదే ప్రస్తుతం మనం కొలిచే ప్రసిద్ధ జగదాంబిక అమ్మవారి ఆలయం. వందల ఏళ్లుగా పూజలందుకుంటున్న ఈ జగదాంబిక అమ్మవారికే సబ్బండ కులాల ఉమ్మడి బోనంగా, పలు కులవృత్తుల వాళ్లంతా కలిసి పచ్చి కుండతో మొదటి బోనాన్ని సమర్పిస్తారు. కుతుబ్ షాహీలు కూడా ఈ పూజలకు పర్మిషన్ ఇవ్వడంతో, నాటి నుండి నేటి వరకు అదే ట్రెడిషన్ కంటిన్యూ అవుతోంది. ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం లేదా తొలి ఆదివారం నాడు ఇక్కడ బంగారు బోనంతో సంబురాలు మొదలైన తర్వాతే మిగతా నగరంలో బోనాల సందడి షురూ అవుతుంది.
బోనాల పండుగ నిర్వహణలో ఒక పక్కా సిస్టమ్ ఉంటుంది. జాతర సందోహం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయం వద్ద మొదలై, ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి (లష్కర్ బోనాలు), బల్కంపేట ఎల్లమ్మ గుడి మీదుగా ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి చేరుకుంటుంది. గోల్కొండ బోనాలు జరిగిన తర్వాత వచ్చే ఆదివారం లష్కర్ బోనాలు జరుగుతాయి.
1813లో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వచ్చి వేలాది మంది చనిపోతున్నప్పుడు, ఉజ్జయినిలో ఉన్న మిలటరీ బెటాలియన్ అక్కడి మహాకాళిని వేడుకుని, వ్యాధి తగ్గితే సికింద్రాబాద్‌లో గుడి కడతామని మొక్కుకున్నారు. అలా మొక్కు తీర్చుకుంటూ కట్టినదే ఉజ్జయిని మహంకాళి ఆలయం. ఇక లష్కర్ బోనాల తర్వాత పాతబస్తీలోని ఏడుగురు అక్కచెల్లెళ్ల ఆలయాల్లో లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఈ పండుగలో మెయిన్ అట్రాక్షన్ పోతురాజులు, శివసత్తుల పూనకాలు. అమ్మవారి సోదరుడైన పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి ఒంటిపై పసుపు, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు, కాలికి గజ్జెలు కట్టి, ఎర్రటి ధోతీ ధరించి కొరడాతో బాదుకుంటూ డప్పుల లయకు అనుగుణంగా వీర నాట్యం చేస్తాడు. అతడిని భక్త సమూహానికి రక్షకుడిగా భావిస్తారు.
అలాగే, బోనాలు మోసే మహిళలపై అమ్మవారు ఆవహిస్తారని భక్తుల నమ్మకం. ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపజేయడానికి భక్తులు వారి పాదాలపై నీళ్లు కుమ్మరిస్తారు. పండుగ రెండో రోజు ఉదయం 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుంది. పచ్చికుండపై నిలబడి మాతంగి రూపంలో అమ్మవారు భవిష్యత్తులో జరగబోయే విషయాలను భక్తులకు చెప్తుంది. ఆ తర్వాత కలశ రూపంలో ఉన్న ఘటం ఉత్సవం ఏనుగు అంబారీపై, డప్పుల మేళతాళాల నడుమ ఊరేగింపుగా సాగి నయాపుల్ వద్ద నిమజ్జనంతో ముగుస్తుంది. ఈ టైంలో భక్తులు అమ్మవారికి కోళ్లు, మేకలను బలి ఇచ్చి, ఆ ప్రసాదాన్ని బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేస్తారు.
బోనాల పండుగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దీని వెనుక స్ట్రాంగ్ సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. వానాకాలం స్టార్ట్ అయ్యే ఆషాఢ మాసంలో కలరా, మలేరియా, ప్లేగు వంటి భయంకరమైన అంటువ్యాధులు క్రిమికీటకాల ద్వారా వేగంగా వ్యాపిస్తాయి. ఈ సీజన్ వైరల్ ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి మన పెద్దలు బోనంలో పసుపు, వేపాకులు, సున్నాన్ని వాడారు.
ఇవన్నీ పవర్ ఫుల్ యాంటీ సెప్టిక్, యాంటీ బయాటిక్ లా పనిచేస్తాయి. ఇంటి గుమ్మాలకు, వీధులకు వేపాకు మండలు కట్టడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. అలాగే ఆషాఢ, శ్రావణ మాసాల్లో స్త్రీలు పాదాలకు పసుపు రాసుకోవడం వల్ల నీటిలో తడవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, పగుళ్లు తగ్గుతాయి. ఇక బోనం కుండపై దీపం పెట్టడం వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే, పూర్వకాలంలో దారి చీకటిగా ఉంటే ఆ వెలుతురే నడవడానికి రూట్ చూపిస్తుంది. అందుకే ఈ పండుగ ఆరోగ్యానికి, భక్తికి ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అని సైంటిఫిక్ రీజన్స్ పేర్కొంటున్నాయి.