చూడ్డానికి ఒకేలా ఉన్నా.. ఎస్కలేటర్, ట్రావెలేటర్ మధ్య తేడా ఏంటి.?

Published : Oct 16, 2026, 06:06 PM IST

Escalator vs Travelator: షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లినప్పుడు ఎస్కలేటర్లు, ట్రావెలేటర్లు కనిపిస్తుంటాయి. ఇవి రెండూ ప్రజలు సులభంగా ప్రయాణించడానికి ఉపయోగపడే యంత్రాలే. ఈ రెండింటి మ‌ధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా.?

PREV
15
ఎస్కలేటర్ అంటే ఏంటి?

ఎస్కలేటర్ (Escalator) అంటే కదులుతూ ఉండే మెట్లు. ఒక భవనంలోని కింది అంతస్తు నుంచి పై అంతస్తుకు లేదా పై అంతస్తు నుంచి కింది అంతస్తుకు వెళ్లేందుకు వీటిని ఉపయోగిస్తారు. వీటిలో మెట్లు ఒక నిరంతర లూప్‌లో కదులుతూ ఉంటాయి. విద్యుత్ మోటారు సాయంతో ఈ మెట్లు పనిచేస్తాయి. ఎస్కలేటర్‌పై నిలబడి ప్రయాణించవచ్చు. అవసరమైతే నడవవచ్చు కూడా. ప్రయాణికులు తమ సమతుల్యతను కాపాడుకోవడానికి పక్కనే ఉండే హ్యాండ్‌రైల్‌ను పట్టుకోవచ్చు. సాధారణంగా షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పెద్ద వాణిజ్య భవనాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.

25
ట్రావెలేటర్ అంటే ఏంటి?

ట్రావెలేటర్ (Travelator)ను మూవింగ్ వాక్‌వే లేదా మూవింగ్ వాక్‌వే బెల్ట్ అని కూడా పిలుస్తారు. ఇది చదునైన నేలలా కనిపిస్తూ కదులుతూ ఉంటుంది. దీనిపై నిలబడితే మనల్ని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్తుంది. సాధారణంగా ఒకే అంతస్తులో ఉన్న రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని సులభంగా అధిగమించేందుకు వీటిని ఉపయోగిస్తారు.

కొన్ని ట్రావెలేటర్లు పూర్తిగా సమాంతరంగా ఉంటాయి. మరికొన్ని కొద్దిగా వాలుగా ఉండి, పైకి లేదా కిందికి వెళ్లేందుకు ఉపయోగపడతాయి. వీటిపై నిలబడి ప్రయాణించవచ్చు. నడుస్తూ కూడా ముందుకు వెళ్లవచ్చు. విమానాశ్రయాల్లో ఒక టెర్మినల్ నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు, పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఎక్కువ దూరం నడవాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు.

35
ఎస్కలేటర్, ట్రావెలేటర్ మధ్య ప్రధాన తేడాలు

ఈ రెండూ విద్యుత్‌తో పనిచేసే రవాణా వ్యవస్థలే అయినప్పటికీ, వాటి నిర్మాణం, ఉపయోగంలో తేడాలు ఉన్నాయి.

నిర్మాణం: ఎస్కలేటర్‌లో మెట్లు ఉంటాయి. ట్రావెలేటర్‌లో చదునైన కదిలే బెల్ట్ ఉంటుంది.

ప్రధాన ఉపయోగం: ఎస్కలేటర్ ద్వారా అంతస్తుల మధ్య ప్రయాణించవచ్చు. ట్రావెలేటర్ ద్వారా ఎక్కువగా ఒకే అంతస్తులోని వేర్వేరు ప్రాంతాలకు చేరుకోవచ్చు.

ప్రయాణ దిశ: ఎస్కలేటర్ సాధారణంగా పైకి లేదా కిందికి కదులుతుంది. ట్రావెలేటర్ సమాంతరంగా లేదా స్వల్ప వాలుతో కదులుతుంది.

సామాను తీసుకెళ్లడం: ట్రావెలేటర్‌పై ట్రాలీ బ్యాగులు, విమానాశ్రయ లగేజీ కార్టులు తీసుకెళ్లడం సులభంగా ఉండేలా కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. అయితే ప్రతి ట్రావెలేటర్‌పై అన్ని రకాల కార్టులను అనుమతించరు. ఎస్కలేటర్‌పై చక్రాలున్న ట్రాలీలను తీసుకెళ్లడం సాధారణంగా సురక్షితం కాదు.

ఎక్కడ ఉపయోగిస్తారు?: ఎస్కలేటర్లను మాల్స్, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ఎక్కువగా చూస్తాం. ట్రావెలేటర్లను విమానాశ్రయాలు, పెద్ద షాపింగ్ మాల్స్, కొన్ని రవాణా కేంద్రాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

45
ట్రావెలేటర్ సాధారణంగా ఎంత పొడవు ఉంటుంది?

ట్రావెలేటర్ పొడవు అది ఏర్పాటు చేసే ప్రదేశం, ప్రయాణికుల రద్దీ, ప్రయాణించాల్సిన దూరంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ట్రావెలేటర్లు కొన్ని మీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి. విమానాశ్రయాల్లో మాత్రం కొన్ని పదుల మీటర్ల పొడవు ఉండవచ్చు. ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా 100 మీటర్లకు మించిన పొడవైన ట్రావెలేటర్లను కూడా ఏర్పాటు చేయవచ్చు.

ఉదాహరణకు, విమానాశ్రయంలో ఒక గేట్ నుంచి మరో గేట్‌కు వెళ్లడానికి ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పొడవైన ట్రావెలేటర్లు ప్రయాణికులకు సౌకర్యాన్ని అందిస్తాయి. షాపింగ్ మాల్స్‌లో మాత్రం రెండు విభాగాల మధ్య తక్కువ దూరం ప్రయాణించేందుకు చిన్న ట్రావెలేటర్లను ఏర్పాటు చేయవచ్చు. వీటి పొడవును నిర్ణయించేటప్పుడు స్థలం అందుబాటులో ఉండటం, ప్రయాణికుల సంఖ్య, భవనం నిర్మాణం, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

55
ఎస్కలేటర్లు సాధారణంగా ఎంత పొడవు ఉంటాయి?

ఎస్కలేటర్ పొడవు రెండు అంతస్తుల మధ్య ఉండే ఎత్తు తేడాపై ఆధారపడి ఉంటుంది. అంతస్తుల మధ్య ఎత్తు ఎక్కువగా ఉంటే ఎస్కలేటర్ కూడా పొడవుగా ఉంటుంది. ట్రావెలేటర్‌లా కాకుండా, ఎస్కలేటర్‌లో మెట్లు వాలుగా అమర్చబడి నిరంతరం కదులుతుంటాయి.

ఉదాహరణకు, రెండు అంతస్తుల మధ్య ఎత్తు తేడా 5 మీటర్లు ఉందనుకుందాం. అలాంటి సందర్భంలో ఎస్కలేటర్ వాలుగా ఉండే భాగం పొడవు సుమారు 7 నుంచి 9 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. అయితే ఇది మెట్ల వాలు, నిర్మాణ రూపకల్పనపై ఆధారపడి మారుతుంది. కాబట్టి ఎత్తు తేడాను బట్టి అన్ని ఎస్కలేటర్ల పొడవును ఒకే విధంగా చెప్పలేం.

పెద్ద షాపింగ్ మాల్స్, విమానాశ్రయాలు, బహుళ అంతస్తుల భవనాల్లో ఎక్కువ ఎత్తును అధిగమించేందుకు పొడవైన ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తారు. వీటి రూపకల్పనలో మెట్ల పరిమాణం, వేగం, ప్రయాణికుల భద్రత, ఎక్కే.. దిగే ప్రదేశాలకు తగినంత స్థలం ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories