అరటిపండ్లు మన ఆహారంలో ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి పూజలు, పండుగల వరకు వీటిని విరివిగా ఉపయోగిస్తాం. అరటిపండ్లతో షేక్స్, చిప్స్, హల్వా వంటి ఎన్నో రకాల వంటకాలు కూడా తయారు చేస్తుంటారు. అయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది తినే ఈ పండ్ల సాగులో ఓ నగరం ప్రసిద్ధి చెందింది.
మహారాష్ట్రలోని జల్గావ్ నగరాన్ని, ఆ ప్రాంతాన్ని కలుపుకొని ఉన్న జిల్లాను అరటిపండ్ల రాజధానిగా పిలుస్తుంటారు. దేశంలో అరటిపండ్ల ఉత్పత్తికి పేరుగాంచిన ప్రాంతాల్లో జల్గావ్ ఒకటి. ఇక్కడ పండించే అరటిపండ్లు మహారాష్ట్రతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల మార్కెట్లకూ సరఫరా అవుతుంటాయి. ఉత్తర మహారాష్ట్రలో ఉన్న ఈ ప్రాంతంలో అరటి సాగుకు అనుకూలమైన వాతావరణం, సారవంతమైన నేలలు ఉన్నాయి. నీటి సదుపాయాలు, రైతుల అనుభవం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు కూడా అరటి సాగు విస్తరణకు దోహదపడుతున్నాయి.