Snake: పాము కనిపించగానే చాలామంది భయంతో పరుగులు తీస్తారు. కొందరైతే దాన్ని ఎలాగైనా అక్కడి నుంచి తరిమేయాలని చూస్తారు. అందుకోసం రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి పాముపై పర్ఫ్యూమ్ స్ప్రే చేయడం. అలా చేస్తే నిజంగానే పాము పారిపోతుందా?
ఇంట్లోకి పాము వచ్చిందంటే చాలు.. ఒక్కసారిగా అందరూ భయపడిపోతారు. దాన్ని ఎలా బయటకు పంపించాలా అని ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది రకరకాల చిట్కాలు చెబుతుంటారు. అలాంటి వాటిలో ఒకటి పాముపై పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే అది వెంటనే పారిపోతుందనేది. పర్ఫ్యూమ్ వాసనను పాము తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోతుందని కొందరు చెబుతుంటారు. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వీడియోలు, పోస్టులు కనిపిస్తుంటాయి. మరి నిజంగానే పాముపై పర్ఫ్యూమ్ కొడితే అది పారిపోతుందా? ఇందులో నిజం ఎంతో తెలుసుకుందాం.
25
పాము వాసన గుర్తించే విధానం
సాధారణంగా మనుషులకు ఏదైనా ఘాటైన వాసన వస్తే వెంటనే గుర్తిస్తారు. కానీ పాములు వాసనను గుర్తించే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. పాములు తమ నాలుకను పదేపదే బయటకు చాచి లోపలికి తీసుకుంటూ ఉంటాయి. పరిసరాల్లో ఉన్న వాసనలను, వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి పాములు ఇలా చేస్తాయి. గాలిలో, నేలపై ఉన్న చిన్న చిన్న వాసన కణాలను నాలుకతో సేకరించి నోటిలో ఉండే ప్రత్యేకమైన అవయవం ద్వారా గుర్తిస్తాయి. దీని సాయంతో ఆహారం ఎక్కడ ఉంది? చుట్టుపక్కల మరో జీవి ఉందా? అనే విషయాలను తెలుసుకుంటాయి.
35
పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే పాములు పారిపోతాయా?
పాములకు వాసనను గుర్తించే శక్తి ఉందని, పర్ఫ్యూమ్ వాసన వస్తే అవి భయపడి పారిపోతాయని అనుకోవడం అన్నిసార్లు కరెక్ట్ కాదు. మనకు పర్ఫ్యూమ్ వాసన చాలా ఘాటుగా అనిపించవచ్చు. కానీ అదే వాసన పాముపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేం. నిపుణుల ప్రకారం.. పాముపై పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే కొన్నిసార్లు అది తీవ్రమైన అసౌకర్యానికి గురికావచ్చు. కానీ మరికొన్నిసార్లు ఆ ఘాటైన వాసనకు కోపంతో లేదా ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేయవచ్చు.
కొన్నిసార్లు పాముపై ఏదైనా స్ప్రే చేసినప్పుడు అది వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు కూడా మనం చూసుంటాం. అయితే దీనికి కారణం ఆ స్ప్రే వాసనే అని చెప్పలేం. పాము దగ్గర మనుషులు కదలడం, శబ్దాలు చేయడం, దాని శరీరంపై ఏదైనా ద్రవం పడటం వంటి కారణాలతో కూడా అది కదలవచ్చు. పాము జాతిని బట్టి, అక్కడి పరిస్థితులను బట్టి వాటి ప్రవర్తన మారుతుందనే విషయం మర్చిపోవద్దు.
పాము కనిపించినప్పుడు దానిపై పర్ఫ్యూమ్, పురుగుల మందు లేదా ఇతర రసాయనాలను స్ప్రే చేయకూడదు. పాము తనకు ప్రమాదం ఉందని భావిస్తే కాటు కూడా వేయవచ్చు. పాము కనిపించిన వెంటనే దాని దగ్గరకు వెళ్లకుండా దూరంగా ఉండాలి. పిల్లలు, పెంపుడు జంతువులను కూడా దాని దగ్గరకు వెళ్లనివ్వకూడదు. పామును మీరే పట్టుకోవడానికి లేదా తరిమేయడానికి ప్రయత్నించకుండా అటవీశాఖ అధికారులకు లేదా శిక్షణ పొందిన పాము రక్షకులకు సమాచారం ఇవ్వాలి.
55
పాములు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటి పరిసరాల్లోకి పాములు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇంటి చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోకుండా చూసుకోవాలి. పిచ్చి మొక్కలు, పొదలు ఎక్కువగా పెరగకుండా శుభ్రం చేయాలి. కట్టెలు, రాళ్లు, ఇతర వస్తువులను ఇంటికి దగ్గరగా కుప్పలుగా వేయకూడదు. ముఖ్యంగా ఎలుకలు ఎక్కువగా ఉంటే వాటిని తినడానికి పాములు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకోవాలి. తలుపుల కింద, గోడల మధ్య ఉన్న ఖాళీలను మూసివేయడం మంచిది.