చార్లెస్ గుడ్ఇయర్ అనే ఆవిష్కర్త తీవ్రమైన దారిద్య్రం, అప్పుల జైలు శిక్షలు, పిల్లల మరణాల వంటి కష్టాలను ఎదుర్కొంటూ రబ్బరుపై ప్రయోగాలు చేశారు. అయన కష్టం వల్లే నేడు ప్రపంచం పరుగులు పెడుతోంది.
ప్రస్తుతం ప్రపంచం చక్రంపై పరుగులు పెడుతోంది. వాహనాల టైర్ల తయారీ వెనుక అద్భుతమైన ఆవిష్కారణ ఉంది. ఆధునిక రబ్బరు పొందిన శాస్త్రవేత్త చార్లెస్ గుడ్ఇయర్ కనిపెట్టిన వల్కనైజషన్ ప్రాసెస్ వల్లే టైర్లు తయారీ సాధ్యం అయింది. దీని వెనుక ఆయన పడ్డ కష్టాలు, కటిక దారిద్య్రం, తన పిల్లల మరణం, భార్య కోపం ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం.
1830ల కాలంలో లభించే సహజ రబ్బరు ఎండకు కరిగిపోయి, చలికి విరిగిపోయేది. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించి రబ్బరును స్థితిస్థాపకంగా (Elastic), గట్టిగా మార్చాలనే ఆశయం చార్లెస్ గుడ్ఇయర్ మెదడును పిచ్చిగా ఆవహించింది. ఈ ప్రయోగాల కోసం ఆయన తన వద్ద ఉన్న రూపాయి రూపాయి ఖర్చు చేయడమే కాకుండా, స్నేహితులు, బంధువుల వద్ద విపరీతంగా అప్పులు చేశారు. అప్పులు తీర్చలేక ఆయన జీవితంలో అనేకసార్లు 'అప్పుల జైలు' (Debtors' Prison) అనుభవించారు. చివరికి జైలు గదిలో ఉన్నప్పుడు కూడా ఆయన రబ్బరు ముక్కలు, రసాయనాలతో ప్రయోగాలు చేయడం ఆపలేదు.
25
భార్య వేదన – రహస్య ప్రయోగాలు
గుడ్ఇయర్ కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఆయన భార్య క్లారిస్సా బీచర్, పిల్లలు తినడానికి తిండి లేక తీవ్రంగా అల్లాడిపోయేవారు. ప్రయోగాల కోసం గుడ్ఇయర్ ఇంట్లోని వంట పాత్రలు, ఫర్నిచర్, చివరికి పిల్లల స్కూల్ పుస్తకాలను కూడా అమ్మి రసాయనాలు కొనేవారు. ఆకలి, దారిద్య్రం కారణంగా వారి ఆరుగురు సంతానం చిన్నతనంలోనే చనిపోయారు. తన ప్రయోగాల వల్లే కుటుంబం నాశనమవుతోందని భార్య ఆయనను గట్టిగా హెచ్చరించే వారు. ఆమెకు తెలియకుండా మిడ్ నైట్ వేళల్లో కిచెన్ వంట పొయ్యి వద్ద రహస్యంగా ప్రయోగాలు చేసేవారు.
35
ఆ రాత్రి జరిగిన అద్భుతం – వల్కనైజేషన్ ఆవిష్కరణ
1839వ సంవత్సరంలో ఒకరోజు గుడ్ఇయర్ రబ్బరు, గంధకం (Sulfur) కలిపిన మిశ్రమంతో ప్రయోగాలు చేస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఆ మిశ్రమం తీవ్రమైన వేడితో మండుతున్న కిచెన్ పొయ్యి (Hot Stove) పైన పడింది. రబ్బరు కరిగిపోయి నల్లటి ద్రవంగా మారుతుందని గుడ్ఇయర్ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా, పొయ్యిలోని అధిక వేడి, గంధకం కలవడం వల్ల ఆ రబ్బరు కరగకపోగా... కాలిన తోలులా మారి, అత్యంత గట్టిగా, స్థితిస్థాపకంగా (Elastic) మారింది. సల్ఫర్, వేడి కలిస్తే రబ్బరు శాశ్వతంగా గట్టిపడుతుందని ఆయన గ్రహించారు. ఈ విప్లవాత్మక పద్ధతికే "వల్కనైజేషన్" అని పేరు పెట్టారు. ఆయన ప్రయోగాలు చేస్తున్నప్పుడు పొరపాటున రబ్బరు, సల్ఫర్ పొయ్యిలో పడిన మాట వాస్తవమే. అప్పుడే ఆయన వల్కనైజషన్ కనుగొన్నారు. కానీ అది భార్య చూస్తుందనే భయం వల్ల పొయ్యిలో వేయలేదు. పొరపాటున పడ్డాయి అనే కథనాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా చార్లెస్ కష్టం వల్లే అద్భుతమైన ఆవిష్కరణ సాధ్యం అయింది.
వల్కనైజేషన్ను కనిపెట్టినప్పటికీ గుడ్ఇయర్ దురదృష్టం ఆయనను వదల్లేదు. పేటెంట్ హక్కుల కోసం సరైన సమయంలో డబ్బులు వెచ్చించలేకపోవడం వల్ల యూరప్‌కు చెందిన ఇతర వ్యాపారులు ఆయన పద్ధతిని చూసి తమ సొంత పేరుతో పేటెంట్లు పొందేందుకు ప్రయత్నించారు. ఆ పేటెంట్ కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగి ఆయన మరింత అప్పులపాలయ్యారు. అధికారికంగా "వల్కనైజ్డ్ రబ్బరు" ఆవిష్కర్తగా గుడ్ఇయర్ పేరే నమోదైనప్పటికీ, ఆ ఆవిష్కరణ ద్వారా ఆయన ఎలాంటి ఆర్థిక లాభం పొందలేకపోయారు. చివరికి 1860లో సుమారు 2 లక్షల డాలర్ల అప్పులతో ఆయన నిరుపేదగా కన్నుమూశారు.
55
సైన్స్ చరిత్రలో శాశ్వత స్థానం
గుడ్ఇయర్ చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ప్రపంచం ఆయన త్యాగాన్ని గుర్తించింది. ఆయన కనిపెట్టిన వల్కనైజ్డ్ రబ్బరు ఆధారంగానే తర్వాతి కాలంలో సైకిళ్లు, కార్లు,బస్సులు, విమానాలకు అవసరమైన ఆధునిక టైర్ల తయారీ సాధ్యమైంది. 1898లో స్థాపించబడిన ప్రసిద్ధ "గుడ్ఇయర్ టైర్ & రబ్బర్ కంపెనీ" ఆయన గౌరవార్థమే ఆ పేరును పెట్టుకుంది. "జీవితాన్ని సంపాదించిన డబ్బుతో కాకుండా, సమాజానికి చేసిన మేలుతోనే కొలవాలి" అని నమ్మిన చార్లెస్ గుడ్ఇయర్, ప్రపంచ రవాణా రంగాన్ని పూర్తిగా మార్చేసి సైన్స్ చరిత్రలో అమరుడయ్యారు.