ప్ర‌పంచంలో టాప్ 10 స్కూళ్ల‌లో చోటు ద‌క్కించుకున్న ఏకైక ఇండియ‌న్ స్కూల్‌.. ఫీజు ఎంతో తెలుసా?

Published : Oct 21, 2026, 09:58 PM IST

Dhirubhai Ambani: ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ 2026 సంవత్సరానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) డిప్లొమా ప్రోగ్రామ్ అందిస్తున్న పాఠశాలల ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో నిలిచింది.

PREV
14
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానం.. చరిత్ర సృష్టించిన విద్యార్థులు

ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) ప్రపంచ విద్యా రంగంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. ఎడ్యుకేష‌న్ అడ్వైజ‌ర్స్ యూకే విడుదల చేసిన 2026 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఈ పాఠశాలకు 9వ స్థానం లభించింది. ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) డిప్లొమా ప్రోగ్రామ్ అందిస్తున్న పాఠశాలల్లో ఈ ఘనత సాధించింది. 2026లో చదువు పూర్తి చేసిన విద్యార్థులు సగటున 40.8 పాయింట్లు సాధించారు. ఈ స్కోరు పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి నమోదైన అత్యుత్తమ విద్యా ఫలితంగా నిలిచింది. ప్రపంచంలోని టాప్ 10 పాఠశాలల్లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ స్కూల్‌గా DAIS గుర్తింపు పొందింది.

మరో విశేషం ఏమిటంటే.. ప్రపంచంలోని టాప్ 10 పాఠశాలల్లో DAISలోనే అత్యధికంగా 105 మంది విద్యార్థులు IB డిప్లొమా ప్రోగ్రామ్‌లో ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులకు బోధిస్తూ మంచి ఫలితాలు సాధించడం పాఠశాల విద్యా ప్రమాణాలను తెలియజేస్తోంది. విద్యార్థుల్లో ఆసక్తి, కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన, సృజనాత్మకత, నాణ్యమైన బోధనకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ విజయం సాధ్యమైందని పాఠశాల పేర్కొంది.

24
ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజులు ఎంతంటే?

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుంటారు. అయితే, ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఫీజులు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న ఈ స్కూల్‌ను 2003లో ప్రారంభించారు. ఇది కో ఎడ్యుకేష‌న్ స్కూల్‌. ఇందులో హాస్ట‌ల్ ఉండ‌దు కేవ‌లం డే స్కాల‌ర్ మాత్ర‌మే.

ఈ స్కూల్ ఫీజుల వివరాలకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోయిన‌ప్ప‌టికీ వివిధ రిపోర్టుల ప్ర‌కారం.. తరగతుల వారీగా అంచనా ఫీజులు ఇలా ఉన్నాయి.

* అప్లికేష‌న్ ఫీజు: ఒక్కసారి చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.5,000. ఇది తిరిగి చెల్లించరు.

* LKG నుంచి 7వ తరగతి వరకు: ఏడాదికి సుమారు రూ.1.7 లక్షలు.

* 8 నుంచి 10వ తరగతి వరకు ICSE: ఏడాదికి సుమారు రూ.1.85 లక్షలు. అయితే ఈ విద్యా విధానాన్ని క్రమంగా నిలిపివేస్తున్నారు.

* 8 నుంచి 10వ తరగతి వరకు కేంబ్రిడ్జి IGCSE: ఏడాదికి సుమారు రూ.4.48 లక్షల నుంచి రూ.5.9 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

* 11, 12వ తరగతులు IB డిప్లొమా ప్రోగ్రామ్: ఏడాదికి సుమారు రూ.9.65 లక్షల వరకు ఉండవచ్చు.

ఈ మొత్తాలు అంచనా మాత్రమే. పాఠశాల ఫీజులను ఎప్పటికప్పుడు సవరించే అవకాశం ఉంది. ఇతరత్రా ఖర్చులు కలిపితే మొత్తం వ్యయం ఇంకా పెరగవచ్చు. కాబట్టి పిల్లలను చేర్పించే ముందు స్కూల్ అడ్మిషన్స్ విభాగాన్ని సంప్రదించి తాజా ఫీజుల వివరాలను రాతపూర్వకంగా తెలుసుకోవడం మంచిది.

34
స్కూల్‌లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి?

ఈ పాఠశాలలో ఫీజులు అన్ని తరగతులకు ఒకే విధంగా ఉండవు. ముఖ్యంగా అంతర్జాతీయ విద్యా విధానాల్లోకి మారినప్పుడు ఫీజులు గణనీయంగా పెరుగుతాయి. 8 నుంచి 10వ తరగతి వరకు కేంబ్రిడ్జి IGCSE విధానంలో విద్యను అందిస్తారు. 11, 12వ తరగతుల్లో ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) డిప్లొమా ప్రోగ్రామ్ ఉంటుంది. ICSE విధానాన్ని క్రమంగా నిలిపివేస్తున్నారు. అంతర్జాతీయ విద్యా విధానాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ప్రాజెక్టులు, పరీక్షలు, అదనపు అభ్యసన కార్యక్రమాలు ఉంటాయి. వీటివల్ల ఫీజులు పెరిగే అవకాశం ఉంది.

విద్యతో పాటు ఇతర రంగాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించేలా ఈ పాఠశాలలో సౌకర్యాలు ఉన్నాయి.

తరగతి గదులు, ప్రయోగశాలలు: సుమారు 1.3 లక్షల చదరపు అడుగుల విద్యా ప్రాంగణం, 60కి పైగా ఏసీ తరగతి గదులు, సైన్స్ ల్యాబ్‌లు ఉన్నాయి.

లైబ్రరీ: 40,000కు పైగా పుస్తకాలతో పాటు డిజిటల్ బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి.

కళలు, సంగీతం: ఆర్ట్, మ్యూజిక్, భాషలు, కంప్యూటర్ విద్య కోసం ప్రత్యేక గదులు ఉన్నాయి. కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రదర్శన స్థలం కూడా ఉంది.

క్రీడలు: సుమారు 2.3 ఎకరాల ఆట స్థలం, బాస్కెట్‌బాల్, టెన్నిస్, వాలీబాల్ కోర్టులు, యోగా రూమ్‌ ఉన్నాయి.

ఇతర సౌకర్యాలు: వైద్య కేంద్రం, ఆడియో-విజువల్ సౌకర్యాలున్న ఆడిటోరియం, రెండు డైనింగ్ హాళ్లలో శాకాహార భోజనం, స్నాక్స్ అందిస్తారు.

44
అడ్మిషన్ ఎలా పొందాలంటే.?

అడ్మిషన్ ప్రక్రియ విషయానికి వస్తే.. బయటి పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు సాధారణంగా 8వ తరగతి, 11వ తరగతుల్లో ప్రవేశ అవకాశాలు ఉంటాయి. అయితే ఖాళీలు, అర్హతలు, ఆ సంవత్సరానికి సంబంధించిన నిబంధనల ఆధారంగా ప్రవేశాలు మారవచ్చు.

8వ తరగతి అడ్మిషన్: సాధారణంగా నవంబర్‌లో నిర్వహించే ప్రవేశ పరీక్ష, ఆ తర్వాత ఇంటరాక్టివ్ సెషన్ ఉంటాయి. సుమారు 500 పదాలతో వ్యక్తిగత అభిప్రాయాలను వివరించే స్టేట్‌మెంట్ కూడా అడగవచ్చు.

11వ తరగతి అడ్మిషన్: మొదట మ‌ల్టీపుల్ ఛాయిస్‌ ప్రశ్నల పరీక్ష, ఆ తర్వాత థియ‌రీ ప్రశ్నల పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది.

చిన్న తరగతులకు ప్రవేశాలు: దరఖాస్తు, విద్యార్థి-తల్లిదండ్రులతో పరస్పర చర్చ వంటి దశలు ఉండవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories