అయితే ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా ఓ కొత్త మోసం మొదలైంది. ఇందులో మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. అవతలి వ్యక్తి, "మేడమ్/సార్, నేను ఓ మెడికల్ షాపుకో, కిరాణా కొట్టుకో డబ్బులు పంపబోయి పొరపాటున మీ నంబర్‌కు పంపించేశాను. మీకు మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది చూడండి. దయచేసి ఆ డబ్బును నా ఈ నంబర్‌కు తిరిగి పంపిస్తారా?" అని చాలా వినయంగా అడుగుతారు.
ఈ మాట వినగానే మీరు కాస్త తెలివైన వాళ్లయితే ఇది ఫేక్ కాల్ అని అనుమానిస్తారు. కానీ అకౌంట్‌లోకి డబ్బులు వచ్చినట్టు SMS చూస్తే... అవతలి వ్యక్తి చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది. "అయ్యో పాపం... పొరపాటున పంపించాడు" అని జాలిపడి మీరు డబ్బులు తిరిగి పంపించారంటే, మీ అంత అమాయకులు ఇంకెవరూ ఉండరు. మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడినట్లే... మీ డబ్బులను మీరే చేజేతులా వాళ్లకు అప్పగించినట్లు.
సైబర్ నేరగాళ్లు ఇలా కొత్తరకం వలపన్ని మీ అకౌంట్లోని డబ్బులు ఖాళీ చేస్తున్నారు. డబ్బులు వచ్చినట్లుగా మెసేజ్ మాత్రమే వస్తుంది… నిజానికి అకౌంట్లోకి డబ్బులు రావు. మీరు మెసేజ్ చూసి నిజంగానే అకౌంట్లోకి డబ్బులు వచ్చాయనుకుని మీ డబ్బులను సైబర్ నేరగాళ్లకు పంపిస్తారు. ఇలా చేజేతులా డబ్బులు పొగొట్టుకునేలా సైబర్ నేరాల బాాధితుల జాబితాలో చేరిపోతారు.