Chicken Facts: ఈరోజు కోడి మాంసాన్ని సింపుల్‌గా "చికెన్" అని పిలుస్తాం. కానీ గొర్రె మాంసాన్ని "మటన్", పంది మాంసాన్ని “పోర్క్” అని ఎందుకు పిలుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? జంతువుల పేర్లు ఒకలా, వాటి మాంసాల పేర్లు మరోలా ఉండటానికి కారణం ఏంటంటే.?
జంతువుల పేర్లు ఒకలా.. మాంసాల పేర్లు మరోలా ఎందుకు ఉన్నాయి?
ఇంగ్లిష్‌లో గొర్రెను షీప్ అంటారు. కానీ దాని మాంసాన్ని మటన్ అని పిలుస్తారు. అలాగే పందిని పిగ్ అని పిలుస్తే, దాని మాంసం పోర్క్ అవుతుంది. ఆవు పేరు కౌ, కానీ మాంసం మాత్రం బీఫ్. ఈ తేడా ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు సమాధానం మధ్యయుగ యూరప్ చరిత్రలో దాగి ఉంది. అయితే కోడి విషయంలో మాత్రం ఈ మార్పు జరగలేదు. కోడి చికెన్‌గా, దాని మాంసం కూడా చికెన్‌గానే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
25
ఇంగ్లండ్‌ను మార్చేసిన 11వ శతాబ్దపు విజయం
1066లో ఫ్రాన్స్‌కు చెందిన విలియమ్ ది కాంకరర్ (William the Conqueror) ఇంగ్లండ్‌పై దండెత్తి విజయం సాధించాడు. ఈ విజయంతో ఇంగ్లండ్‌లో పాలకులు, రాజ కుటుంబాలు, ఉన్నతాధికారులు ఎక్కువగా ఫ్రెంచ్ భాషనే ఉపయోగించసాగారు. మరోవైపు సాధారణ ప్రజలు మాత్రం ఇంగ్లిష్‌లోనే మాట్లాడేవారు. దీంతో రాజవర్గం, సామాన్య ప్రజల భాషల మధ్య స్పష్టమైన తేడా ఏర్పడింది. ఈ ప్రభావం ఆహార సంస్కృతిపై కూడా పడింది.
35
ధనికుల భోజనం.. పేదల భోజనం మధ్య ఉన్న తేడా
ఆ రోజుల్లో రాజులు, ధనవంతులు ఎక్కువగా జింక, ఆవు, పంది, గొర్రె మాంసాన్ని తినేవారు. ఈ మాంసాలను వడ్డించే సమయంలో ఫ్రెంచ్ పేర్లనే ఉపయోగించేవారు. ఫ్రెంచ్‌లో ఆవుకు సంబంధించిన పదం కాలక్రమేణా బీఫ్‌గా, పంది మాంసం పోర్క్‌గా, గొర్రె మాంసం మటన్‌గా మారింది. అయితే కోడి మాంసాన్ని రాజవర్గం అంతగా ఇష్టపడేది కాదు. వారి దృష్టిలో అది సాధారణ ప్రజలు, పేదలు తినే ఆహారంగా ఉండేది. అందుకే కోడి మాంసానికి ప్రత్యేకంగా ఫ్రెంచ్ పేరు ప్రాచుర్యంలోకి రాలేదు.
ఇంగ్లండ్‌లోని సాధారణ ప్రజలు కోడిని "Chicken" అనే పేరుతోనే పిలిచేవారు. అదే పేరుతో దాని మాంసాన్ని కూడా పేర్కొనేవారు. రాజవర్గం కోడి మాంసాన్ని పెద్దగా ఉపయోగించకపోవడంతో ఫ్రెంచ్ పేరు దానికి అంటుకోలేదు. ఫలితంగా కోడి పేరు, కోడి మాంసం పేరు రెండూ "Chicken"గానే కొనసాగాయి. వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆ పేరు మారకుండా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అదే విధంగా ఉపయోగిస్తున్నారు.
55
చరిత్రలో దాగిన ఒక ఆసక్తికర భాషా మార్పు
బీఫ్, పోర్క్, మటన్ వంటి పదాలు కేవలం మాంసాల పేర్లు మాత్రమే కాదు. అవి మధ్యయుగ ఇంగ్లండ్‌లో జరిగిన రాజకీయ, సామాజిక, భాషాపరమైన మార్పులకు నిదర్శనాలు. పాలకులు ఫ్రెంచ్ మాట్లాడటం, ప్రజలు ఇంగ్లిష్ మాట్లాడటం వల్ల రెండు భాషల పదాలు కలిసిపోయి కొత్త ఆహార పదాలు ఏర్పడ్డాయి. కానీ కోడి మాంసం రాజవర్గంలో పెద్దగా ప్రాధాన్యం పొందకపోవడంతో "చికెన్" అనే ఇంగ్లిష్ పేరు అలాగే నిలిచిపోయింది. అందుకే కోడి మాంసాన్ని ఇప్పటికీ "చికెన్" అని పిలుస్తుండగా, మిగతా జంతువుల మాంసాలకు మాత్రం వేర్వేరు పేర్లు వినిపిస్తున్నాయి.