Bangalore: బెంగళూరు పేరు చెబితేనే గుర్తొచ్చేది ట్రాఫిక్. ఇప్పుడు ఈ ట్రాఫిక్ కారణంగా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకుంది ఈ నగరం. దారుణమైన ట్రాఫిక్ కలిగిన నగరాల్లో బెంగళూరు ఏ స్థానంలో ఉందో తెలుసుకుంటే షాక్ అవుతారు.
మన దేశానికి ఐటీ రాజధానిగా పేరు తెచ్చుకుంది బెంగుళూరు. వేగంగా పెరుగుతున్న జనాభా.. ఆ జనాభాకు తగ్గట్టు పెరుగుతున్న వాహనాలు.. దీనివల్ల బెంగళూరు రోడ్లు నిత్యం రద్దీగా మారిపోతున్నాయి. తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్న నగరాల్లో బెంగళూరు కూడా ఒకటి. తాజాగా టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2025 నివేదిక బయటకు వచ్చింది. దీంతో బెంగళూరు మరొకసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ కల నగరంగా బెంగళూరు రెండవ స్థానంలో నిలిచింది.
24
బెంగళూరుతో ఎంత దారుణమంటే
నివేదిక చెబుతున్న ప్రకారం బెంగుళూరులో 10 కిలోమీటర్ల దూరం వాహనంపై ప్రయాణించడానికి కనీసం 36 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అదే ట్రాఫిక్ రద్దీ పీక్ అవర్స్ లో ఉన్నప్పుడు అయితే వాహనాల వేగం గంటకు 14 కిలోమీటర్లకు పడిపోతుంది. అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో 15 నిమిషాల్లో నాలుగు కిలోమీటర్లు వెళ్లడం కూడా కష్టంగా మారిపోతోంది. ఈ పరిస్థితి రోజూ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు చాలా సమస్యగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు ట్రాఫిక్ మరింతగా పెరిగిపోయింది. దీనివల్ల ఇంట్లో కన్నా రోడ్డుపైనే గడుపుతున్న ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారి శారీరక, మానసిక ఆరోగ్యం పై ట్రాఫిక్ ఒత్తిడి విపరీతంగా ప్రభావాన్ని చూపిస్తోంది.
34
పాపం డ్రైవర్లు
ఇక బెంగళూరులో డ్రైవర్లుగా ఉద్యోగం చేస్తున్న వారి జీవితం మరింత దారుణంగా ఉంది. వారు సంవత్సరానికి వందల గంటలు పైగా ట్రాఫిక్ లోనే గడుపుతున్నారని అంచనా. అంటే వారు జీవితంలో కొన్ని రోజుల సమయాన్ని రోడ్డుపైనే జీవిస్తున్నారు. ఈ సమయం వల్ల ఇంధన వ్యయం పెరగడమే కాదు.. వాయు కాలుష్యం పెరగడం, ప్రొడక్టవిటీ తగ్గడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రపంచ ట్రాఫిక్ ర్యాంకింగ్స్ లో బెంగళూరు పైకి ఎగబాకుతోంది. ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకోవడం పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో చెబుతోంది.
బెంగళూరు రోడ్లపై ట్రాఫిక్ తగ్గాలంటే ప్రజలు తమ సొంత వాహనాలపై ప్రయాణించడం మానాలి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు మారాలి. రైలు ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలి. అలాగే ఐటీ కంపెనీలే వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించాలి. ఆఫీస్ టైమింగ్స్ ను అందరికీ ఒకేలా కాకుండా విడివిడిగా పెట్టాలి. దీనివల్ల ట్రాఫిక్ ఒత్తిడి ఎంతో కొంత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నగరంతో పాటు రవాణా వ్యవస్థ కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందితే బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు ఏదైనా పరిష్కారం దొరికే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.