
మాంసాహారం అనగానే ముందుగు గుర్తుచ్చేది చికెన్. కేవలం ఇండియాలోనే కాదు అనేక దేశాల్లో చికెన్ ను ఇష్టంగా తింటుంటారు.. అందుకే కోడి మాంసానికి మంచి డిమాండ్ ఉంది. మనదేశంలో చికెన్‌తో ఎన్నో రకాల వంటకాలు తయారు చేస్తుంటారు... చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకమైన వంటకం ఉంటుంది. ఇక హైదరాబాద్ లో దొరికే బిర్యానీ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే.
అయితే కేవలం హైదరబాదీ బిర్యానీయే కాదు తెలంగాణలోని ఓ చిన్న గ్రామానికి చెందిన చికెన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అదే నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ చికెన్. సాధారణంగా చేసే చికెన్ కూరకు, అంకాపూర్ స్టైల్ చికెన్‌కు రుచిలో చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ వంటకాన్ని ఒక్కసారి రుచి చూసినవారు మళ్లీ మళ్లీ తినాలని కోరుకుంటారు. మరి అసలు ఈ అంకాపూర్ చికెన్‌లో అంత ప్రత్యేకత ఏముంది? దీని తయారీలో ఉపయోగించే పదార్థాలు ఏంటి? ఈ వంటకం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? తెలుసుకుందాం.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న అంకాపూర్ గ్రామం ప్రత్యేకమైన చికెన్ వంటకానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారయ్యే నాటుకోడి కూరకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. సాధారణంగా హోటళ్లలో లభించే చికెన్ వంటకాలతో పోలిస్తే దీని తయారీ విధానం భిన్నంగా ఉంటుంది. స్థానికంగా లభించే పదార్థాలు, పల్లెటూరి వంట పద్ధతులు ఈ వంటకానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
అంకాపూర్ చికెన్‌లో ప్రధానంగా నాటు కోడి మాంసాన్ని ఉపయోగిస్తారు. ఫామ్ కోళ్లతో పోలిస్తే నాటు కోడి మాంసం గట్టిగా ఉండటంతో పాటు, దానికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్లు స్వేచ్ఛగా తిరుగుతూ సహజంగా దొరికే అహారం తీసుకుంటాయి… ఇలా పెరిగే కోడి మాంసంతోనే అంకాపూర్ చికెన్ కర్రీ తయారు చేయడం వల్ల రుచిలో ప్రత్యేకత కనిపిస్తుంది.
అంకాపూర్ చికెన్ ప్రత్యేకతల్లో ముఖ్యమైనది దాని తయారీ విధానం. సాధారణంగా చికెన్ ముక్కలను నేరుగా మసాలాల్లో ఉడికిస్తారు. కానీ అంకాపూర్ పద్ధతిలో చికెన్ ముక్కలను తోలుతో సహా ముందుగా పొయ్యిపై కాల్చుతారు. ఇలా చేయడం వల్ల మాంసానికి ఒక ప్రత్యేకమైన కాలిన వాసన, పొగ రుచి వస్తుంది. దీనినే స్మోకీ ఫ్లేవర్ అంటారు.
ఈ విధంగా కాల్చిన చికెన్ ముక్కలకు మసాలాలు బాగా పట్టేలా వండుతారు. దీంతో కూరలోని మసాలాల రుచితో పాటు, పొయ్యిపై కాల్చిన మాంసం రుచి కూడా కలిసి కొత్త రుచిని అందిస్తుంది. అంకాపూర్ చికెన్‌ను ఇతర చికెన్ వంటకాల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టే అంశాల్లో ఇదొకటి.
ఏ వంటకమైనా దాని రుచి అందులో ఉపయోగించే మసాలాలపై ఆధారపడి ఉంటుంది. అంకాపూర్ చికెన్ విషయంలోనూ ఇదే కీలకం. స్థానికంగా లభించే కారం, తాజా కొత్తిమీర, పుదీనా, గరం మసాలా దినుసులను ఇందులో ఉపయోగిస్తారు. ఈ పదార్థాలన్నింటినీ సరైన మోతాదులో కలిపి కూరను తయారు చేస్తారు.
మసాలాలను మాంసానికి బాగా పట్టేలా నిదానంగా ఉడికించడం మరో ప్రత్యేకత. ఎలాంటి కృత్రిమ రుచులపై ఆధారపడకుండా, సంప్రదాయ పద్ధతిలోనే వంట చేస్తారు. అందుకే అంకాపూర్ చికెన్‌లో మసాలాల ఘాటు, నాటు కోడి మాంసం రుచి, పొయ్యిపై కాల్చడం వల్ల వచ్చే సువాసన అన్నీ కలగలిసి ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి.
అంకాపూర్ చికెన్‌కు ఇప్పుడు ఎంత గుర్తింపు ఉందో, దీని వెనుక అంత ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది. సుమారు 40 ఏళ్ల క్రితం అంకాపూర్ గ్రామానికి చెందిన పెద్ద రామ గౌడ్ ఈ ప్రత్యేకమైన వంటకాన్ని పరిచయం చేసినట్లు చెబుతారు. ఆయన రూపొందించిన వంట విధానం క్రమంగా గ్రామంలో ప్రాచుర్యం పొందింది.
ముఖ్యంగా గ్రామంలో జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకల్లో అంకాపూర్ చికెన్ ప్రత్యేక వంటకంగా మారింది. అతిథులకు ఈ నాటు కోడి కూర వడ్డించడం అక్కడి ఆతిథ్య సంప్రదాయంలో భాగమైంది. అలా ఒక గ్రామానికి పరిమితమైన ఈ వంటకం క్రమంగా ఇతర ప్రాంతాలకూ పరిచయమైంది.
ఒకప్పుడు అంకాపూర్ గ్రామానికి వెళ్లినవారికి మాత్రమే ఎక్కువగా తెలిసిన ఈ చికెన్ వంటకం, ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక వంటకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ అంకాపూర్ స్టైల్ చికెన్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ వంటకం గురించి తెలుసుకున్న ఇతర ప్రాంతాలవారు సైతం దీని రుచిని ఆస్వాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మొత్తానికి అంకాపూర్ చికెన్ ప్రత్యేకత కేవలం నాటు కోడి మాంసంలోనే లేదు. దాని తయారీ విధానం, స్థానిక మసాలాలు, పొయ్యిపై కాల్చే సంప్రదాయం, దశాబ్దాలుగా కొనసాగుతున్న పల్లెటూరి వంట పద్ధతులు అన్నీ కలిసి దీనికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. ఒక చిన్న గ్రామం పేరును ఓ ప్రత్యేకమైన వంటకం ప్రపంచానికి పరిచయం చేయడం నిజంగా విశేషమే.