
అంతర్జాతీయ స్థాయిలో మంచి కెరీర్ కోరుకునే చాలా మంది భారతీయ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం ఒక ముఖ్యమైన మైలురాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విద్యను అందిస్తున్నాయి. అయితే, చదువుకోవడానికి, పని చేయడానికి ఏ దేశం సరైనదో ఎంచుకోవడం విద్యార్థులకు పెద్ద సవాలుగా మారుతుంది. ఒక విద్యార్థి ఎంచుకునే దేశం వారి భవిష్యత్తు అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. భారతీయ విద్యార్థులు చదువుకుంటూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేయడానికి అనువుగా ఉన్న 10 బెస్ట్ దేశాలు, వాటి వర్క్ పర్మిట్ నిబంధనల వివరాలు గమనిస్తే..
అమెరికా లో విద్యను అభ్యసించే అంతర్జాతీయ విద్యార్థులు F-1 వీసా కలిగి ఉంటే ఆన్-క్యాంపస్ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడానికి అర్హత పొందుతారు. కళాశాల తరగతులు జరుగుతున్న సమయంలో విద్యార్థులు వారానికి గరిష్ఠంగా 20 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఉంటుంది.
మరోవైపు, యునైటెడ్ కింగ్‌డమ్ లో Tier 4 స్టూడెంట్ వీసాపై చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులు కూడా చదువుకుంటూనే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయవచ్చు. ఇక్కడ విద్యార్థులు వారానికి 10 నుండి 20 గంటల వరకు పనిచేయడానికి అనుమతి ఉంది. ఈ పని గంటల నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. విద్యార్థులు నిర్దేశించిన పని గంటలను దాటి పనిచేయకూడదు.
స్విట్జర్లాండ్‌లో అంతర్జాతీయ విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడానికి ప్రత్యేక వర్కింగ్ పర్మిట్ పొందాల్సి ఉంటుంది. యురోపియన్ యూనియన్ దేశాల విద్యార్థులతో పాటు ఐస్‌లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ పౌరులకు పని గంటలపై ఎలాంటి పరిమితులు ఉండవు. అయితే, ఇతర దేశాల విద్యార్థులు తరగతులు జరుగుతున్న సమయంలో వారానికి 10 నుండి 15 గంటల వరకు పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. సెలవుల సమయంలో మాత్రం ఫుల్ టైమ్ వర్క్ చేసుకోవచ్చు.
స్వీడన్‌లో చదువు పూర్తయిన తర్వాత ఉండి పనిచేయాలనుకునే విద్యార్థులకు వర్క్ పర్మిట్ అవసరం అవుతుంది. చదువుకునే సమయంలో పనిచేయడానికి ఎలాంటి చట్టపరమైన పని గంటల పరిమితి లేదు. అర్హత కలిగిన విద్యార్థులు వారానికి 40 గంటల వరకు పనిచేయడానికి అనుమతి పొందవచ్చు.
జపాన్ దేశం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ వీసాను అందిస్తుంది. దీని ద్వారా విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం వరకు పనిచేయవచ్చు. కొన్ని నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ఈ వీసాను ఇంకా ఎక్కువ కాలం పొడిగించుకునే అవకాశం ఉంటుంది, ఇది విద్యార్థులకు పని అనుభవాన్ని పొందడానికి ఎంతగానో తోడ్పడుతుంది. చదువుకుంటున్న సమయంలో విద్యార్థులు వారానికి గరిష్ఠంగ 28 గంటల వరకు పని చేయవచ్చు.
జర్మనీ విషయానికి వస్తే, విద్యార్థులు ప్రత్యేకం అయిన వర్క్ పర్మిట్ లేకుండానే పనిచేయవచ్చు. అయితే, ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ, ఫారినర్స్ ఆఫీస్ నుండి అనుమతి పొందిన తర్వాత, అంతర్జాతీయ విద్యార్థులు సంవత్సరానికి 240 హాఫ్ డేస్ లేదా 120 పూర్తి రోజులు పార్ట్ టైమ్ వర్క్ చేయవచ్చు. దీనితో పాటు జర్మనీలో మంచి అకడమిక్ రికార్డు ఉన్న విద్యార్థులకు అనేక స్కాలర్‌షిప్‌లు కూడా లభిస్తాయి.
ఫ్రాన్స్‌లో విద్యార్థులు రెసిడెన్సీ కార్డ్ కలిగి ఉండి, వారి విద్యా సంస్థ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్‌కు యాక్సెస్ ఇచ్చినంత వరకు క్యాంపస్‌లో లేదా క్యాంపస్ వెలుపల పనిచేయడానికి అర్హత కలిగి ఉంటారు. విద్యార్థులు ఇక్కడ సంవత్సరానికి గరిష్ఠంగా 964 గంటల వరకు పనిచేయవచ్చు.
డెన్మార్క్ దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు వర్క్ పర్మిట్ లేదా ఎస్టాబ్లిష్‌మెంట్ కార్డ్ అవసరం అవుతుంది. చదువుకునే సమయంలో విద్యార్థులకు వారానికి 20 గంటల పార్ట్ టైమ్ వర్క్ పర్మిట్ ఉంటుంది. అదేవిధంగా వేసవి సెలవుల సమయంలో ఫుల్ టైమ్ పనిచేయడానికి అనుమతి ఉంటుంది.
కెనడాలో చదువుకుంటూనే పనిచేయాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా డెసిగ్నేటెడ్ లర్నింగ్ ఇన్‌స్టిట్యూషన్ లో ఫుల్ టైమ్ విద్యార్థిగా నమోదు చేసుకుని ఉండాలి. ఇక్కడ విద్యార్థులకు వారానికి 20 గంటల వరకు పనిచేయడానికి అనుమతి ఉంటుంది. దీనికి అదనంగా, ఆఫ్-క్యాంపస్ లో పనిచేయడానికి అనుమతించే ప్రత్యేక నిబంధన ఉన్న స్టడీ పర్మిట్ కలిగి ఉండాలి. అలాగే విద్యార్థులు సోషల్ సెక్యూరిటీ నంబర్ ను కూడా పొందాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం స్టూడెంట్ వీసాపై వచ్చే విదేశీ విద్యార్థులను పార్ట్ టైమ్ పనిచేయడానికి అనుమతిస్తుంది. ఆస్ట్రేలియాలో పనిచేయాలనుకుంటే, స్టూడెంట్ వీసా ద్వారా విద్యార్థులు చదువుకునే సమయంలో ప్రతి రెండు వారాలకు 40 గంటల వరకు పనిచేసే హక్కును పొందుతారు, సెలవుల సమయంలో ఫుల్ టైమ్ పనిచేయవచ్చు.