
సినిమా పరిశ్రమలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. పది శాతం ఉంటే ఎక్కువ ఉండదు. ఏడాది రెండు వందల సినిమాలు రిలీజ్ అయితే వాటిలో ఆడే మూవీస్, చిన్నా చితకా కలిపి ఓ పదిహేను వరకు ఉంటే గొప్ప. ఎంతటి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అయినా ఏదో ఒక మూవీ విషయంలో బోల్తా పడుతుంటారు. కానీ మన ఇండియాలో ఈ స్టార్ డైరెక్టర్స్ మాత్రం పరాజయం ఎరగలేదు. తీసిన ప్రతి సినిమాతో హిట్ కొట్టారు. కొన్ని హిట్ టాక్ తేలేకపోయినా కమర్షియల్‌గా సక్సెస్ కొట్టారు. ఆయా దర్శకుల గురించి తెలుసుకుందాం.
పరాజయం అంటూ లేని దర్శకుల్లో రాజమౌళి మొదటి వరుసలో ఉంటారు. ఆయన 12 సినిమాలు చేస్తే అన్నీ హిట్టే. మిశ్రమ స్పందన రాబట్టుకున్న `యమదొంగ` బాగానే ఆడింది. `ఆర్ఆర్‌ఆర్` కూడా బాగా ఆడింది. ఇది ఏకంగా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రాజమౌళి రూపొందించిన చిత్రాల్లో `స్టూడెంట్ నెం 1`, `సింహాద్రి`, `సై`, `ఛత్రపతి`, `విక్రమార్కుడు`, `యమదొంగ`, `మగధీర`, `ఈగ`, `మర్యాద రామన్న`, `బాహుబలి`, `బాహుబలి 2`, `ఆర్‌ఆర్ఆర్` వంటి చిత్రాలున్నాయి. అన్నీ మంచి విజయాలు సాధించాయి. అదే సమయంలో జక్కన్న ఇండియన్ సినిమా లెక్కలు మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు జక్కన్న. దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపొందిస్తున్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి ఎంటర్‌టైన్‌మెంట్స్ కి కేరాఫ్‌గా నిలిచారు. ఆయన `పటాస్`తో కెరీర్ ని ప్రారంభించారు. తొలి చిత్రంతో ఆకట్టుకున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్లని సమపాళ్లలో మేళవించి సినిమాలు చేస్తూ హిట్ కొడుతున్నారు. `పటాస్`, `సుప్రీం`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్2`, `సరిలేరు నీకెవ్వరు`, `ఎఫ్ 3`, `భగవంత్ కేసరి`, `సంక్రాంతికి వస్తున్నాం` వంటి 8 సినిమాలు చేశారు. `ఎఫ్ 3` మూవీకి నెగటివ్ టాక్ వచ్చింది. కానీ హిట్ ఖాతాలోనే పడింది. ఇంకోవైపు ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్‌తో `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇది ఏకంగా రూ.350కోట్లు రాబట్టడం విశేషం. కేవలం ఒక తెలుగు లాంగ్వేజ్‌లోనే విడుదలైన ఈ మూవీ ఈ రేంజ్‌లో వసూళ్లని రాబట్టడం విశేషం. ఇప్పుడు అనిల్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కూడా పరాజయం ఎరుగని డైరెక్టర్‌గా నిలిచారు. ఆయన `మున్నాభాయ్ ఎంబీబీఎస్` చిత్రంతో దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు. సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా `లాగే రహో మున్నాభాయ్`, `3 ఇడియట్స్`, `పీకే`, `సంజు`, `డంకీ` చిత్రాలతో సక్సెస్ కొట్టారు. ఆరు సినిమాలు చేసి ఆరు విజయాలు అందుకొని బాలీవుడ్‌లో అత్యంత సక్సెస్ ఉన్న దర్శకుడిగా నిలిచారు.
అట్లీ సైతం ఈ 100శాతం సక్సెస్ ఉన్న దర్శకుడిగా నిలిచారు. `రాజారాణి`తో తొలి విజయాన్ని అందుకున్నారు అట్లీ. `వరుసగా `థెరి`, `మెర్సల్`, `బిగిల్`, `జవాన్` చిత్రాలతో విజయాలు సొంతం చేసుకున్నారు. చివరగా `జవాన్`తో ఆయన సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ సినిమాని రూపొందిస్తున్నారు. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం అత్యంత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. `ఉగ్రం` సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీ కన్నడలో మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత `కేజీఎఫ్` చిత్రంతో సంచలనాలు సృష్టించారు. ఈ రెండు సినిమాలతో కన్నడ సినిమా లెక్కలు మార్చేశారు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత ప్రభాస్‌తో `సలార్` చేసి మరో హిట్ అందుకున్నారు. డివైడ్ టాక్ వచ్చిన `సలార్` కూడా సుమారు రూ.700కోట్లు రాబట్టింది. ఇలా నాలుగు సినిమాలు చేసి నాలుగు హిట్లు కొట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో `డ్రాగన్` మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.
నాగ్ అశ్విన్ మూడు సినిమాలతోనే పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగారు. `ఎవడే సుబ్రమణ్యం`తో దర్శకుడిగా పరిచయమై `మహానటి`తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ప్రభాస్‌తో `కల్కి 2898ఏడీ` సినిమా చేసి సంచలనాలు సృష్టించింది. మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి మెప్పించారు. ఇండియన్ మూవీలో ఇదొక సరికొత్త ప్రయోగంగా చెప్పొచ్చు.
ఇక తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం అత్యంత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా నిలిచారు. ఆయన `మానగరం` చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. `ఖైదీ`తో అందరి దృష్టిని ఆకర్షించారు. `మాస్టర్`, `విక్రమ్`, `లియో` చిత్రాలతో దుమ్ములేపారు. ఇప్పుడు `కూలీ`తో వచ్చారు. ఈగురువారం ఈ చిత్రం విడుదలైంది. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి వారు కలిసి నటించారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. టాక్ ప్రకారం మూవీ ఆడటం కష్టమనే ఫీలింగ్ కలుగుతుంది. మరి ఈ సినిమా సక్సెస్ లోకేష్ సక్సెస్ క్రెడిట్ ని నిర్ణయించబోతుంది.