విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫంకీ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ లో విశేషాలు ఏంటి, డైరెక్టర్ అనుదీప్ నవ్వులు పూయించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారా అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం 'ఫంకీ'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక.
25
ఫిబ్రవరి 13న రిలీజ్
ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగు పెట్టనున్న 'ఫంకీ' చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది.
35
ట్రైలర్ ఎలా ఉందంటే
'ఫంకీ' ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. కె.వి. అనుదీప్ శైలి కామెడీతో నవ్వులు పూయించింది. ప్రతి ఫ్రేమ్‌లో వినోదం ఉట్టిపడేలా రూపొందించిన ఈ ట్రైలర్, థియేటర్లలో నవ్వుల తుఫాన్ చూడబోతున్నామనే హామీ ఇచ్చింది. విశ్వక్ సేన్, కయాదు లోహర్ కలిసి తెరపై చురుకుగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరి.. చిత్రానికి కొత్త ఉత్సాహాన్ని, మరింత అందాన్ని జోడించింది. ప్రధాన తారాగణంతో పాటు ఇతర పాత్రలు కూడా నవ్వులు పూయిస్తూ 'ఫంకీ'ని పూర్తి స్థాయి వినోదభరిత చిత్రంగా మలిచాయి. మొత్తానికి ట్రైలర్ తో 'ఫంకీ' సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "మీ అందరినీ కలిసి దాదాపు సంవత్సరం అవుతుంది. ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతోనే ఈ విరామం తీసుకోవడం జరిగింది. ఫంకీ సినిమా రెండు గంటల పది నిమిషాల పాటు మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటుంది. ఫోన్ పెట్టుకోవాలనే ఆలోచనే రాదు. ప్రతి సన్నివేశం చూస్తూ నవ్వుకుంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్ కి రండి. కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం." అన్నారు.
కథానాయిక కయాదు లోహర్ మాట్లాడుతూ.. "మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. ట్రైలర్ చూశారు కదా ఎంత కామెడీగా ఉందో. సినిమా దీనికి వంద రెట్లు ఉంటుంది. అనుదీప్ గారి ట్రేడ్ మార్క్ కామెడీ చూస్తారు. నాకు ఈ అవకాశమిచ్చిన నాగవంశీ గారికి ధన్యవాదాలు. ఫిబ్రవరి 13న విడుదలవుతున్న మా ఫంకీ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను." అన్నారు.
55
పంచ్ లు బాగా పేలాయి
దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ.."ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫిబ్రవరి 13న థియేటర్ కి రండి. ఫంకీ సినిమా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది." అన్నారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.."ట్రైలర్ మీ అందరికీ నచ్చింది కదా. పంచ్ లు బాగా పేలాయి కదా. సినిమా అంతా ఇలాగే ఉంటుంది. ప్రతి సన్నివేశం మిమ్మల్ని నవ్విస్తుంది. కామెడీ కోసం థియేటర్ కి రండి. దర్శకుడు అనుదీప్ మిమ్మల్ని అసలు నిరాశపరిచాడు. జాతిరత్నాలుతో ఎలా ఆకట్టుకున్నాడో ఫంకీతో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటాడు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఫంకీ సినిమా కచ్చితంగా నవ్విస్తుంది." అన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. కాలు కదిపే పాటలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలతో ఆ విషయాన్ని రుజువు చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీతనానికి, విజయవంతమైన చిత్రాలకు పేరుగాంచిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ఫంకీ'పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'ఫంకీ' చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.