
వరుస పెళ్లిళ్లు, వివాదాస్పద కామెంట్లతో సంచలనంగా మారింది వనితా విజయ్ కుమార్. ఆ తర్వాత `బిగ్ బాస్` ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఆమెకు జోవికా అనే కూతురు కూడా ఉన్నారు. ఆమె కూడా బిగ్ బాస్ 7వ(తమిళం) సీజన్‌లో పాల్గొని ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలో జోవికా విజయ్ కుమార్ బిగ్ బాస్ ద్వారా సంపాదించిన డబ్బుతో `మిస్సెస్ అండ్ మిస్టర్` అనే సినిమాను నిర్మించారు. జోవికా తల్లి వనిత దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వనితకు జంటగా రాబర్ట్ నటించారు.
`మిస్సెస్ అండ్ మిస్టర్` చిత్రం జూన్ నెలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక ఆదివారం చెన్నైలో జరిగింది. ఇందులో వనితా విజయ్ కుమార్, రాబర్ట్, జోవికాతో పాటు సినిమాలో నటించిన షకీలా, పవర్ స్టార్ శ్రీనివాస్, నటి కిరణ్ కూడా పాల్గొన్నారు. దర్శకుడు వసంత బాలన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ ఆడియో లాంచ్‌లో వనితా మాట్లాడుతూ కూతురు జోవికా పుట్టినప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు.
జోవికా బిగ్ బాస్ షోలో పాల్గొన్నప్పుడు ఆమెను విమర్శిస్తూ అనేక కామెంట్లు వచ్చాయి. ఆమె పేరు వెనుక తండ్రి పేరు లేకపోవడంతో ఆమె తండ్రి ఎవరనే చర్చ కూడా ఆ సమయంలో జరిగింది. అప్పుడు దీని గురించి స్పందించని వనిత, `మిస్సెస్ అండ్ మిస్టర్` ఆడియో ఈవెంట్‌లో తన కూతురిపై వచ్చిన ట్రోల్స్ కి కౌంటర్ ఇచ్చారు.
`సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ అన్నీ చదువుతాను. కానీ పట్టించుకోను. జోవికా బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు ఆమె పేరు వెనుక ఎందుకు విజయ్ కుమార్ అని అడిగారు. దానికి ఈ వేదికపై సమాధానం చెబుతున్నాను. ఈ సినిమా రూపొందడానికి కారణం కూడా అదే. నా పేరు వనితా విజయ్ కుమార్, నేటికీ నా పేరు మార్చలేదు. నాకు పెళ్లయి కొడుకు పుట్టి మూడేళ్లయ్యాక, నా జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి.
ఆ టైమ్‌లో నేను ఇండస్ట్రీలో ఉండలేకపోయాను. నేను ఎక్కడికి వెళ్లినా సమస్యే. నా గురించి మాట్లాడి నా పిల్లలకు తండ్రి సమస్య సృష్టించారు. ఆయన ఎవరో చెప్పను. జోవికా నా గర్భంలో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు నా అమ్మ నన్ను అమెరికా వెళ్ళమన్నారు. నేను హాయిగా బిడ్డను కనాలని మా నాన్నే నన్ను అమెరికా పంపించారు.
ఒక అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు అమ్మతో ఉండటం కంటే భర్తతో ఉండాలి. కానీ నేను ఒంటరిగా కష్టపడ్డాను. అమెరికాలో బిడ్డ పుట్టగానే వారి పేరు చెప్పాలి. అప్పుడు నా భర్త పేరును నా కూతురి పేరుతో కలపాలని నేను అనుకోలేదు. నేను బిడ్డను బాగా కనాలని కోరుకున్న మా నాన్న పేరే అప్పుడు గుర్తుకు వచ్చింది. అందుకే జోవికా విజయ్ కుమార్ అని పేరు పెట్టానని వనిత చెప్పారు. ఈసందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.