Rajinikanth Watched Dragon Movie : డ్రాగన్ సినిమా దర్శకుడు అశ్వత్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు రజినీకాంత్. ఈ దర్శకుడి ఎన్నో ఏళ్ళ కలను సూపర్ స్టార్ నిజం చేశారు. ఇంతకీ తలైవా ఏం చేశారంటే?
Rajinikanth Watched Dragon Movie : ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమా చూసి డైరెక్టర్ అశ్వత్ మారిముత్తును ఇంటికి పిలిచి అభినందించారు రజినీకాంత్.
తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు రజినీకాంత్. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తనకు విశ్రాంతి దొరికినప్పుడల్లా కొత్త సినిమాలు చూడటం రజినీకాంత్‌కు అలవాటు. అలా చూసిన సినిమా తనకు బాగా నచ్చితే, ఆ చిత్ర బృందాన్ని నేరుగా పిలిచో లేదా ఫోన్ ద్వారా సంప్రదించో అభినందిస్తారు.
ఆ క్రమంలోనే ఇటీవల అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా డ్రాగన్. ఈసినిమా ఫిబ్రవరి 21న విడుదలై థియేటర్లలో రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ విజయవంతంగా నడుస్తున్న డ్రాగన్ సినిమాను రజినీకాంత్ చూశారు. సినిమా సూపర్ స్టార్‌కు బాగా నచ్చడంతో ఆ సినిమా దర్శకుడు అశ్వత్ మారిముత్తును తన ఇంటికి పిలిచి తన శుభాకాంక్షలు తెలిపారు రజినీకాంత్.
రజినీని కలిసినప్పుడు, ఏమి అశ్వత్ ఇలా రాశావ్, ఫెంటాస్టిక్.. ఫెంటాస్టిక్ అని పొగిడి అభినందించారట. మంచి సినిమా తీయాలి, సినిమా చూసి రజినీ సార్ ఇంటికి పిలిచి అభినందించాలి. ఆయన మన సినిమా గురించి మాట్లాడాలి అనేది దర్శకుడు కావాలని కష్టపడి పనిచేసే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ కల. నా కల నెరవేరిన రోజు ఇది అని ఎంతో సంతోషంగా చెప్పారు అశ్వత్.
సాధారణంగా ఇలాంటి హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకుల దగ్గర రజినీ కథ అడుగుతుంటారు. అదేవిధంగా అశ్వత్ దగ్గర కూడా కథ అడిగి ఉండొచ్చు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదివరకు లవ్ టుడే సినిమా విడుదలై విజయం సాధించినప్పుడు ప్రదీప్ రంగనాథన్‌ను నేరుగా పిలిచి అభినందించిన రజినీ, ఇప్పుడు అతని డ్రాగన్ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి అభినందించారు. దీంతో డ్రాగన్ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉందట.