హీరో రాజశేఖర్ తన కెరీర్‌లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు హీరోగా మెప్పించిన ఆయన విలన్‌గా తనలోని మరో యాంగిల్ ని ఈతరం ఆడియెన్స్ కి పరిచయం చేయబోతున్నారు.
యాంగ్రి యంగ్ మేన్‌గా ఎదిగిన రాజశేఖర్ ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపేశారు. యాక్షన్ చిత్రాలతో ఉర్రూతలూగించారు. తిరుగులేని సూపర్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అప్పట్లో రాజశేఖర్ సినిమాలు చిరంజీవి, బాలయ్య చిత్రాలకు పోటీగా ఆడేవంటే అతిశయోక్తి కాదు. చాలా సార్లు బాలయ్యతో బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. చాలా సార్లు రాజశేఖర్ సక్సెస్ అయ్యారు కూడా. బాక్సాఫీసు వద్దే కాదు, కథలు, కాన్సెప్ట్ ల పరంగానూ పోటీ పడ్డారు. ఆకట్టుకున్నారు. హై ఎమోషనల్ మూవీస్ తో మెప్పించారు. మిగిలిన హీరోలు చేయలేని సాహసాలు రాజశేఖర్ చేశారు.
24
వరుస పరాజయాల్లో రాజశేఖర్
అయితే రాను రాను రాజశేఖర్ క్రేజ్ పడిపోయింది. ఆయన సినిమాలు థియేటర్లలో ఆడకపోవడంతో కొంత డౌన్ అయ్యారు. డిఫరెంట్ మూవీస్‌తో తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా, అవి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో వెనకబడిపోతున్నాయి. చివరగా రాజశేఖర్ `పీఎస్‌వీ గరుడవేగ`తో హిట్ కొట్టారు. ఆ వెంటనే చేసిన `కల్కి` జస్ట్ యావరేజ్‌గా ఆడింది. కానీ స్టయిలీష్ మూవీగా మెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడుతున్నాయి. చివరికి క్యారెక్టర్స్ వైపు కూడా టర్న్ తీసుకున్నారు. నితిన్ హీరోగా నటించిన `ఎక్స్ టార్డినరీ మ్యాన్` చిత్రంలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడకపోవడంతో మళ్లీ గ్యాప్ తీసుకున్నారు.
34
రౌడీ జనార్థన్‌లో రాజశేఖర్
ఇదిలా ఉంటే ఇప్పుడు శర్వానంద్ హీరోగా చేస్తున్న ఓ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో, ఆయనకు తండ్రిగా కనిపిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. కానీ ఇప్పుడు ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా రాజశేఖర్ విలన్‌గా టర్న్ తీసుకుంటున్నాడట. ఆయన విజయ్ దేవరకొండ సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ ఓ మూవీ చేస్తున్నారు. కీర్తిసురేష్ ఇందులో హీరోయిన్. దిల్ రాజు నిర్మించే ఈ మూవీ ఇటీవలే ప్రారంభమైంది. `రౌడీ జనార్థన్` అనే పేరుతో ఇది తెరకెక్కనుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ రస్టిక్ గా మూవీ సాగుతుందని తెలుస్తోంది.
ఈ సినిమాతో హీరో రాజశేఖర్ విలన్‌గా టర్న్ తీసుకుంటున్నారట. పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో ఆయన కనిపించబోతున్నారట. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆయన లుక్ ఉండబోతుందని తెలుస్తోంది. హీరోని డామినేట్ చేసే స్థాయిలో రాజశేఖర్ పాత్ర ఉంటుందని, అందుకే ఆయన ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాజశేఖర్ హీరోగానూ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఓ రీమేక్‌లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. తమిళంలో హిట్ అయిన `లబ్బరు పందు`ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని, ఇందులో వీఆర్ దినేష్ పాత్రలో రాజశేఖర్, అర్జున్ కళ్యాణ్ పాత్రలో విశ్వదేవ్ రాచకొండ నటిస్తున్నట్టు సమాచారం. రాజశేఖర్ కూతురు కూడా ఇందులో కనిపించబోతున్నట్టు టాక్. మొత్తంగా ఈ మూడు సినిమాలతో రాజశేఖర్ కమ్ బ్యాక్ కాబోతున్నట్టు టాక్. అంతేకాదు ఇకపై వరుసగా నెగటివ్ రోల్స్ కూడా చేసేందుకు రాజశేఖర్ నిర్ణయం తీసుకున్నారట. ఆ దిశగానే ప్లాన్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.