Peddireddy song: పేరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్ యూట్యూబ్‌లో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పాటకు ఏకంగా 54 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ పాటను ఆలపించిన మమతా రమేశ్ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
యూట్యూబ్, సోషల్ మీడియాలో జానపద పాటలకు కొత్త ఊపునిచ్చిన పేరు మమతా రమేశ్. ‘సక్కనోడ నా బావ’ పాటతో మొదలైన ఆమె ప్రయాణం, ఇప్పుడు ‘పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డ’ పాటతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. పల్లె గళం, సహజమైన భావోద్వేగంతో ఆమె పాడిన పాట కోట్లమంది హృదయాలను తాకింది.
25
గ్రామీణ నేపథ్యం నుంచి గాయకురాలిగా
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నానాజ్‌పూర్ గ్రామం మమతా రమేశ్ స్వస్థలం. ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నల మధ్య చిన్నదానిగా పెరిగింది. డిగ్రీ వరకు చదువుకున్న మమతాకు చిన్ననాటి నుంచే పాటలంటే ప్రాణం. పాఠశాల కార్యక్రమాల్లో దేశభక్తి గీతాలు, సామాజిక గీతాలు పాడేది. గ్రామీణ వాతావరణం కారణంగా సోషల్ మీడియా పరిచయం తక్కువే. అయినా యూట్యూబ్‌లో ఒక అవకాశం వస్తే పాడాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది. అదే కోరిక ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
35
‘పెద్దిరెడ్డి బిడ్డ’ పాట హిట్ వెనుక కథ
2022లో ‘సక్కనోడ నా బావ.. నన్ను హైదరాబాద్‌కు తీసుకుపోవా’ పాటతో మమతా పేరు సోషల్ మీడియాలో వినిపించింది. ఆ తర్వాత ‘బావో బంగారం’ పాట ఆమెకు విస్తృత గుర్తింపునిచ్చింది. అయితే నిజమైన బ్రేక్ మాత్రం ‘పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డ’ పాటతో వచ్చింది. బుల్లెట్ బండి లక్ష్మణ్ రాసిన ఈ పాటలోని భావోద్వేగం మమతా జీవితానికి చాలా దగ్గరగా అనిపించింది. అక్టోబర్‌లో రికార్డింగ్ పూర్తయి, నవంబర్ 28న పాట విడుదలైంది. విడుదలైన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా టాప్ వన్ ట్రెండింగ్ సాంగ్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ పాట 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
డిగ్రీ చదువుతున్న రోజుల్లో హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్‌లో సేల్స్ గర్ల్‌గా పని చేసింది మమతా. అదే చోట సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్న రమేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్ల ప్రేమ తర్వాత 2016లో తిరుపతి వెంకన్న సన్నిధిలో వివాహం చేసుకున్నారు. తన గాన ప్రయాణంలో భర్త రమేశ్ కీలక పాత్ర పోషించారు. వారమంతా ఉద్యోగం చేస్తూనే, ఆదివారం రోజున ఆమెను రికార్డింగ్ స్టూడియోలకు తీసుకెళ్లే బాధ్యత ఆయనే తీసుకున్నారు. మమతా విజయానికి వెనుక ఆయన ప్రోత్సాహమే బలం.
55
ఎవరికీ చెప్పుకోని వ్యాధి
2018లో మమతా జీవితంలో ఊహించని సమస్య ఎదురైంది. లక్షల్లో ఒక్కరికి వచ్చే అరుదైన వ్యాధి ఆమెను వెంటాడింది. శరీరమంతా ఇన్‌ఫెక్షన్, ముక్కులోంచి రక్తస్రావం మొదలయ్యాయి. క్యాన్సర్ అనుమానంతో పరీక్షలు చేసినా, అది కాదని తేలింది. చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఇవ్వడంతో రెండు కాళ్ల బొక్కలు అరిగిపోయాయి. చిన్న వయసులో ఆపరేషన్ చేయడం ప్రమాదమని, 40 ఏళ్ల తర్వాత శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు సూచించారు. ఎక్కువ సేపు నిలబడినా, కూర్చున్నా తీవ్రమైన నొప్పి. ఈ బాధతోనే రోజూ మందులు వాడుతూ పాటల ప్రయాణం కొనసాగిస్తోంది.