
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత తన సినిమా ఈవెంట్లో మెరిశారు. తాజాగా ఆయన నటించిన `హరి హర వీరమల్లు` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేశారు. అభిమానుల్లో నూతనోత్సాహం తీసుకొచ్చారు.
తన పవర్ ఫుల్ స్పీచ్‌తో వారిని ఖుషీ అయ్యేలా చేశారు. సోమవారం సాయంత్రం శిల్ప కళావేదికలో జరిగిన ఈ మూవీ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనతో పనిచేసేందుకు పెద్ద దర్శకులు రారు అని వెల్లడించారు. ఈ క్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ గురించి, అలాగే తన స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తాను విజయాల్లో పెరగలేదని, పరాజయాలతోనే పెరిగానని తెలిపారు. వరస పరాజయాల్లో ఉన్నప్పుడు ఒక్క హిట్ కావాలని అభిమానులు అడిగితే అలాంటి సమయంలో హరీష్ శంకర్ `గబ్బర్‌సింగ్`తో హిట్ ఇచ్చాడని చెప్పారు.
ఆ తర్వాత ఒక్క ఫ్లాప్ మూవీతో తాను స్ట్రక్ అయిపోయాను, సినిమాలపై గ్రిప్ రాలేదు. ఏం చేయాలనే డైలామాలో ఉన్నప్పుడు త్రివిక్రమ్ నా జీవితంలోకి వచ్చాడు. నాకు `జల్సా` సినిమాని ఇచ్చాడు.
అప్పటికీ త్రివిక్రమ్ గురించి పెద్దగా తేలియదు, కానీ పరాజయంలో ఉన్నప్పుడు ఎవరూ తనతో సినిమా చేయడానికి ముందుకు రాకపోయినప్పుడు త్రివిక్రమ్ వచ్చి నాతో సినిమా చేసి హిట్ ఇచ్చాడు.
సక్సెస్ లో ఉన్నప్పుడు మన వెంట ఉండేవారుకాదు, పరాజయంలో, కష్టాల్లో ఉన్నప్పుడు మన వెంట నిలబడేవాడే నిజమైన ఫ్రెండ్. అలా నాకు దొరికిన గొప్ప స్నేహితుడు త్రివిక్రమ్ అని తెలిపారు పవన్ కళ్యాణ్.
`హరి హర వీరమల్లు` సినిమా గురించి, నిర్మాత రత్నం గురించి చెబుతూ, చాలా కష్ట సమయంలో ఈ మూవీ చేసినట్టు తెలిపారు పవన్. సినిమాని పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డామన్నారు.
ఈ సినిమా రెండు కరోనాలను దాటింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాక టైమ్ ఇవ్వలేకపోయాను. అలాంటి సమయంలో రోజూ రెండు గంటలు మాత్రమే ఇవ్వగలిగినప్పుడు తన ఆఫీస్‌కి కూత వేటు దూరంలో సెట్ వేసి షూటింగ్ చేశామని తెలిపారు.
ఈ సినిమా విషయంలో తాను డౌన్ అవుతున్నప్పుడు, ఏంటి? ఎలా చేయాలి? సినిమా రిలీజ్ అవుతుందా అని మదనపడినప్పుడు తన పాటలు, గ్లింప్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఉత్సాహాన్ని నింపారని చెప్పారు పవన్.
ఇక అభిమానులను ఉద్దేశించి పవన్ చెబుతూ, తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు నా వెంటే ఉన్నారని తెలిపారు. వరుస హిట్ల తర్వాత `జానీ` సినిమా పరాజయం చెందినప్పుడు ఒక్కసారిగా అంతా డౌన్ అయిన పరిస్థితుల్లో మీరు నా వెంటనే ఉన్నారు.
అన్నా మీ వెంట మేమున్నామని నిరూపించారు. నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నా అభిమానులు ఎప్పుడూ నన్ను వదిలి వెల్లలేదు. అభిమానులది డబ్బుతో కూడిన బంధం కాదు, గుండెకు గుండెకి ఉన్న బంధం. మా మధ్య దూరం రెండు గుండెలు మాత్రమే అని చెప్పారు పవన్.
`భీమ్లా నాయక్` సినిమా సమయంలో మిగిలిన హీరోల సినిమాలకు టికెట్ రేట్లు వందల్లో ఉంటే, నా సినిమాకి మాత్రం పది, ఇరవై రూపాయలు ఉన్నాయని, అయినా సినిమా విజయం సాధించిందని,
అప్పుడే ఎవర్రా మనల్ని ఆపేదని చెప్పానని, అలాంటిది ఇప్పుడు టైమ్, మన రికార్డ్, మన గట్స్, మన కరేజ్, మన డైనాస్టీ అని అభిమానుల్లో ఊపు తెచ్చే వ్యాఖ్యలు చేశారు పవన్.
అదే సమయంలో పది, 15 రూపాయలు ఉంటేనే విజయాన్ని అందించారు. ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగాయి. సినిమా మీకు నచ్చితే రికార్డులు బద్దలు కొట్టండి అంటూ మరోసారి తనదైన స్టయిల్‌లో కామెంట్ చేశారు పవన్. అభిమానులకు పిలునిచ్చారు.
మీరే నా బలం, మీరే కోసమే నా గుండె కొట్టుకుంటుందని అభిమానులను ఉద్దేశించి పవన్ చెప్పడం విశేషం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` మూవీ తెరకెక్కగా, ఏఎం రత్నం నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.