
సినిమా అంటే ఇప్పుడు హీరో ప్రధానంగానే సాగుతుంది. పెద్ద హీరోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. హీరోని బట్టే బిజినెస్ అవుతుంది. కలెక్షన్లు వస్తుంటాయి. హీరో రేంజ్, మార్కెట్‌ని బట్టి ఆ మూవీ వసూళ్లని రాబడుతుందని భావిస్తుంటారు. కానీ అవన్నీ నిన్నటి ముచ్చట్లు. ఇప్పుడు వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడు సినిమాల్లో హీరోలు మారిపోతున్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, బాలకృష్ణ, రామ్‌చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజ.. స్టార్ హీరో ఎవరైనా సరే ఇకపై వీరంతా సినిమాకి హీరోలు కాబోరు, అసలు హీరోలు వేరే ఉన్నారు. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో. ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన సినిమాలు హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ ని రాబడతాయి. ఆయన ఇటీవల మారుతి దర్శకత్వలో నటించిన `ది రాజాసాబ్` మూవీ డిజాస్టర్ అయ్యింది. దీనికి సుమారు రూ.400కోట్ల బడ్జెట్ అయ్యింది. రూ.230కోట్లకుపైగా బిజినెస్ అయ్యింది. వచ్చిన కలెక్షన్లు రెండు వందల కోట్ల వరకు ఉన్నాయి. బడ్జెట్ పరంగా, థియేట్రికల్ పరంగా ఈ చిత్రం ద్వారా నిర్మాతకి వచ్చిన నష్టం రూ.200-250కోట్లు ఉంటుందని టాక్. కంటెంట్ సరిగా లేకపోవడం. సాలిడ్ స్టోరీ లేకపోవడం. మిగిలిన హంగులకు ప్రయారిటీ ఇచ్చిన దర్శకుడు మారుతి కథని, కథనాన్ని గాలికొదిలేయడం సినిమాని దెబ్బ కొట్టింది. దీంతో సినిమా ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. బిగ్గెస్ట్ స్టార్ హీరో అయినా ప్రభాస్ ఈ మూవీని హిట్ చేయలేకపోయారు. కంటెంట్ సరిగా లేకపోతే ఎవరూ ఏం చేయలేరని ఈ చిత్ర ఫలితం నిరూపించింది.
అలాగే అంతకు ముందు బాలకృష్ణ `అఖండ 2` సినిమాతో వచ్చారు. ఈ సినిమాకి అయిన బడ్జెట్ రెండు వందల కోట్లు అని సమాచారం. అయిన బిజినెస్ రూ.125కోట్ల అని టాక్. కానీ సినిమాకి వంద కోట్లు కూడా కలెక్షన్లు రాలేదు. ఓవరాల్‌గా ఈ మూవీ ద్వారా బయ్యర్లు, నిర్మాతలకు వచ్చిన నష్టం వందకోట్లకుపై మాటే. కానీ దర్శకుడు బోయపాటి సరిగా తీయకపోవడం. సనాతన ధర్మం, హిందుత్వం అంటూ ప్రొపగండా మూవీ తీశారు, కానీ అన్ని వర్గాల ఆడియెన్స్ ని అలరించేలా సినిమాని తీయలేకపోయారు. స్క్రిప్ట్ లోనూ చాలా లూప్స్ ఉన్నాయి. దీంతో ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. బాలయ్యకి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. పైగా వరుసగా నాలుగు హిట్లు కొట్టారు. అయినా `అఖండ2`ని సేవ్ చేయలేకపోయారు. ఇక్కడ హీరో ప్రభావం పనిచేకపోయింది. సినిమాని హిట్ చేయలేకపోయింది. హీరో కంటే కంటెంట్ ముఖ్యమని ఈ చిత్రం చెప్పింది.
అంతేకాదు అంతకు ముందు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` పరిస్థితి కూడా సేమ్. ఈ చిత్రానికి మూడు వందల కోట్లకుపైగా బడ్జెట్ అయ్యింది. కానీ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. వంద కోట్లకుపైగానే నిర్మాత దిల్ రాజు నష్టపోవాల్సి వచ్చింది. కానీ దర్శకుడు శంకర్ ఔట్‌డేటేడ్ కథని ఎంచుకున్నారు, అదే సమయంలో కథనంతో మ్యాజిక్ చేయలేకపోయారు. దీంతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. రామ్ చరణ్‌కి విశేషమైన ఫాలోయింగ్ ఉంది, పాన్ ఇండియా హీరో కూడా. కానీ అది ఈ సినిమాని గట్టెక్కించలేకపోయింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్` పరిస్థితి కూడా అంతే. ఈ సినిమాకి రూ.150కోట్లకుపైగానే బడ్జెట్ అయ్యింది. రూ.123కోట్ల వ్యాపారం జరిగింది. ఇప్పుడు కలెక్షన్లు రూ.94కోట్లు వచ్చాయి. సుమారు యాభై కోట్ల వరకు షేర్ వచ్చింది. అంటే ఇంకా రూ.70కోట్లకుపై షేర్ రాబట్టాలి. వంద కోట్లకుపైగా గ్రాస్ రావాలి. కానీ ఇప్పుడీ మూవీ టోటల్ గ్రాస్ కూడా వంద దాటే పరిస్థితుల్లో లేదు. సుమారు డెబ్బై కోట్ల వరకు నష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. పవర్ స్టార్ ఇమేజ్ కేవలం మొదటి రోజుకే పనిచేసింది. రెండో రోజు నుంచి ఇది పడిపోయింది. ఓవరాల్‌గా డిజాస్టర్ దిశగా వెళ్తోంది. కంటెంట్ ముఖ్యమని ఈ సినిమా ఫలితం కూడా చెప్పింది.
అదే ఇప్పుడు బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్న `ధురంధర్ 2` మూవీ బడ్జెట్ రెండు భాగాలు కలిపి రూ.250కోట్లు. మొదటి భాగం రూ.1300కోట్లు రాబట్టింది. సుమారు నాలుగు వందల కోట్లు మొదటి భాగంలోనే లాభాలు వచ్చాయి. రెండో భాగం ఇప్పటికే రూ.1300కోట్లు దాటింది. రెండు వేల కోట్లు దిశగా వెళ్తోంది. ఈ సినిమా ద్వారా వెయ్యి కోట్లకుపైగా లాభాలను నిర్మాతలు పొందబోతున్నారు. అందుకు కారణం ఇందులో ఉన్న కంటెంట్. దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందిన ఈ సినిమాని దేశం మొత్తం చూస్తోంది. సాలిడ్ కంటెంట్ ఉంటే స్టార్స్ తో పనిలేదని నిరూపించిన చిత్రమిది. అంతేకాదు తెలిసిన హీరోలతోనూ పనిలేదని నిరూపించింది. రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ హీరో, తెలుగు ఆడియెన్స్ ని ఆయన్ని ఆరాధించరు, అభిమానులు కూడా కాదు, కానీ ఆయన సినిమాని తెగ చూస్తున్నారు. సో అక్కడ హీరో కంటే కంటెంట్‌ని చూస్తున్నారు.
అంతేకాదు ఈ సంక్రాంతికి చిరంజీవి.. మన శంకర వర ప్రసాద్ గారు మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి, నయనతార జంటగా నటించగా, వెంకటేష్ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రానికి రూ.150-200కోట్ల బడ్జెట్ అయ్యింది. రూ.120కోట్ల బిజినెస్ అయ్యిందట. కానీ కలెక్షన్లు సుమారు రూ.400కోట్లు వచ్చాయి. లాభాలు రూ.70-80కోట్లు ఉంటుంది. ఓటీటీ రైట్స్ కలుపుకుంటే ఇది వంద కోట్లకుపైగా లాభాలను పొందింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోవడానికి, ఆడటానికి కారణం కంటెంట్. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండటం, నవ్వుకునేలా ఉండటం, చిరంజీవి మార్క్ డాన్సులు, పాటలు, ఆయన యాక్టింగ్, యాక్షన్ ఆకట్టుకున్నాయి. దీంతో ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇలా సాలిడ్ కంటెంట్ తో వచ్చిన, వస్తోన్న చిత్రాలే హిట్ అవుతున్నాయి. సరైన కథ, కథనాలు లేని సినిమాలు, దర్శకులు సరిగా తీయలేని మూవీస్ డిజాస్టర్ అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమాకి హీరోలు ముఖ్యం కాదు, కంటెంట్ ముఖ్యమని, కథే హీరో అని నిరూపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు హీరోకి అర్థం మారిపోతుంది. కథనే హీరో అనే స్థాయికి వచ్చేసింది.