మీరు కూడా స్టార్ నటులు కదా? సూపర్ హిట్ సినిమా అతడు ను నిర్మించారు కానీ, ఈ సినిమాలో మీరెందుకు నటించలేదని ఓ మీడియా ప్రతినిధి మురళీమోహన్ ను ప్రశ్నించగా. అందుకాయన బదులిస్తూ, తన భార్య పెట్టిన కండిషన్ కారణంగానే తాను ఆ సినిమాలో నటించలేదని తెలిపారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ "అతడు సినిమాలో నాకు పాత్ర ఇవ్వలేదు. నేను సినీ పరిశ్రమలోకి రావాలనుకున్న తొలినాళ్లలో మా ఆవిడ ఓ కండిషన్ పెట్టింది. నేను ఎవరి దగ్గరకు వెళ్లి పాత్రను అడగకూడదు, ఎవరైనా పిలిచి చేయమంటే తప్ప తానుగా వెళ్లి క్యారెక్టర్ ను అడగకూడదు అని స్పష్టం చేసింది. ఆ మాటలకు ఇప్పటివరకూ కట్టుబడి ఉన్నాను.
కెరీర్ అంతా కూడా నా వద్దకు వచ్చిన పాత్రలనే చేస్తూ వచ్చాను. ఇప్పటికీ అదే రూల్ పాటిస్తున్నాను. అందుకే అతడు సినిమాలో క్యారెక్టర్ ఇవ్వమని నేను అడగలేదు. నాకు అందులో పాత్ర లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వలేదు. అందుకే నేను ఈ సినిమాలో కనిపించలేదు" అని మురళీమోహన్ వివరించారు.