
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ `పుష్ప 2`తో సృష్టించిన సంచలనాలు ఎలాంటివో మనం చూశాం. సుకుమార్ జీనియస్ దర్శకుడు అని, ఆయన ఆలోచనలు ఎక్కడో చాలా హైలో ఉంటాయని, ఆయన ఆలోచనలను నేలకు దించి, సినిమా చేస్తే తాము ఎవ్వరం ఆయన ముందు నిలబడలేం అని దర్శకుడు రాజమౌళి ఓ ఈవెంట్‌లో కామెంట్ చేశారు. ఆ కామెంట్లని నిజం చేశారు సుకుమార్. `రంగస్థలం`, `పుష్ప` చిత్రాలతో తానేంటో ఇండియన్ సినిమాకి రుచి చూపించారు. `పుష్ప 2` ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో ఉంది.
ఇక దర్శకుడు సుకుమార్ సినిమాల్లోకి రావడానికి ముందు లెక్కల మాస్టర్. కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. రైటింగ్, కథలు చెప్పాలనే ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. `ఆర్య`తో దర్శకుడిగా మారి, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. అయితే సుకుమార్ ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ కావడానికి తెరవెనుక తన ఊర్లో జరిగిన స్టోరీ ఉంది. ఒక దొంగ, ఒక పాము, ఒక గుడి పూజారి సుకుమార్ లైఫ్‌నే మార్చేశాయి. అసలేం జరిగిందనేది చూస్తే, సుకుమార్ ది తూర్పుగోదావరి జిల్లా, మట్టపర్రు విలేజ్. సుకుమార్ చిన్నప్పుడు ఆ ఊర్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఊర్లో వెంకటేశ్వరస్వామి వెలిశారు. దానికో కథ ఉంది.
సుకుమార్ ఇంటికి కొద్ది దూరంలో రెండు తాటి చెట్లు ఉండేవట. వాటి మధ్యలో పాము పుట్ట ఉండేది, అక్కడ పాము తిరిగేది. దీంతో అటువైపు ఎవరూ వెళ్లేవారు కాదు. సుకుమార్ ఊర్లోనే ఒక దొంగ ఉండేవాడు. ఆ దొంగ సడెన్‌గా పుట్టకు సమీపంలో చెట్టుకింద కూర్చొని ధ్యానం చేయడం స్టార్ట్ చేశాడట. అక్కడే ఓ రాయి మీద వెంకటేశ్వరస్వామి ఆకారం ఉంది. దీంతో ఈ పరిణామాలు చూసి జనమంతా అక్కడ వెంకటేశ్వరస్వామి వెలిశారని ప్రచారం చేశారట. అక్కడ పుట్టలో ఉన్న పాము ఆ రాయి వద్దే తిరిగేదట. అంతేకాదు ఆ దొంగ వద్దకు కూడా వచ్చేదని, అతని చుట్టూ తిరిగేది. అయినా ధ్యానంలో ఉన్న అతను పట్టించుకునేవాడు కాదట. పక్కనే చెరువు ఉంటే, దాంట్లో మునిగి వచ్చిన రాళ్ల చుట్టూ, విగ్రహాల చుట్టూ తిరిగేదట పాము. దీన్ని సుకుమార్ స్వయంగా చూశారట. ఆ సమయంలోనే ఊర్లో ఓ పిల్లాడు పుట్టాడు, ఆ పిల్లాడి తల నిర్ణీత పరిమాణం కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండేదట. చేతులకు ఎర్రటి శంఖు చిత్రాలున్నాయట. దీంతో ఇవన్నీ చూసి అక్కడ దేవుడే మొలిశాడనే పుకారు స్టార్ట్ అయ్యిందట. దొంగ కాస్త స్వామిజీగా మారిపోయాడు. దీంతో ఇతర ఊర్ల నుంచి జనాలు రావడం, ఆ రాళ్లని, పిల్లాడిని చూసి వెళ్లేవారట. అంతేకాదు తోచని విరాళాలు ఇచ్చేవారట.
వచ్చిన విరాళాలతో గుడని నిర్మించారట. ఆ గుడి నిర్మాణంలో సుకుమార్ కూడా భాగమయ్యాడట. గుడి కట్టడం కోసం పనిచేస్తే డబ్బులు కూడా ఇచ్చేవారట. ఆ గుడికి బీఏ చదివిన పూజారి వచ్చాడు. ఆయన వద్దకు సుకుమార్ ట్యూషన్‌కి వెళ్లేవాడట. పూజారికి నవలలు చదవడం అలవాటు. వారపత్రికల్లో వచ్చే సీరియళ్లని కలిసి పుస్తకంగా తయారు చేసేవారట. అవన్నీ చదువుకోవడానికి ఇచ్చేవాడట. అవి తనకు బాగా ఉపయోగపడ్డాయని తెలిపారు సుకుమార్. ఒక రకంగా తనకు అక్షర జ్ఞానం కలిగింది అక్కడే అని తెలిపారు. దానికి కారణం ఆ పాము, దొంగ, గుడి పూజారి అని తెలిపారు. ఒకవేళ అక్కడ గుడి లేకపోయినా, పాము లేకపోయినా, ఆ దొంగ లేకపోయినా తానిప్పుడు ఇలా ఉండేవాడిని కాదు అని తెలిపారు సుకుమార్. `రంగస్థలం` సినిమా సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు దర్శకుడు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్‌తో తీయబోతున్న సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.