ప్రేమకి చావు లేదు. ప్రేమ కథలకు ముగింపు లేదు. కొత్తగా ఏ లవ్ స్టోరీతో సినిమా చేసినా ఆడియెన్స్ చూసేందుకు ఆసక్తి చూపుతాడు. లవ్ స్టోరీకి, మంచి ఫ్యామిలీ అంశాలు, కాస్త యాక్షన్, డ్రామా జోడిస్తే ఇక ఆసినిమాకి తీరుగే లేదు. మరి అలా అన్ని అంశాలు మేళశించి `ఛలో ప్రేమిద్దాం` సినిమా తెరకెక్కింది. శుక్రవారం(నవంబర్ 19)న పది చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో `ఛలో ప్రేమిద్దాం` ఒకటి. టీజర్, ట్రైలర్స్ తో ఆకట్టుకుంది `ఛలో ప్రేమిద్దాం`. కొత్త నటీనటులు, దర్శక, నిర్మాతలు కలిసి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. సాయి రోనక్, నేహా సోలంకి జంటగా నటించడగా, సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వం వహించారు. ఉదయ్ కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. మరి పది సినిమాలతో పోటీ పడ్డా ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం సక్సెస్ అయ్యిందా? ఫలితం ఎలా ఉందనేది రివ్యూ(Chalo Premiddam Movie Review)లో తెలుసుకుందాం.
కథః
హీరో కాంతారావ్(సాయి రోనక్)ని పోలీసులు చితకబాదుతుండటంతో సినిమా ప్రారంభం అవుతుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. వైజాగ్‌కి చెందిన కాంతారావుది మిడికల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న(పోసాని) ఓల్డేజ్ హోమ్‌లో మేనేజర్. తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్‌లో వదిలేసి వెళ్లిపోయిన కొడుకులను చూసిన పోసాని కొడుకులంటే కోపం. ఆ కోపాన్ని తన కొడుకు కాంతారావ్‌పై చూపిస్తుంటాడు. కొడుకు ఎక్కడ తప్పు చేస్తాడా, తిడదామా అని వెయిట్ చేస్తుంటాడు. కానీ కాంతారావు చదువుల్లో ఫస్ట్ ఉంటాడు. తండ్రికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వడు. ఈ క్రమంలో అతను హైయ్యర్ స్టడీస్ కోసం హైదరాబాద్ వెళతాడు. అక్కడ మధుమతి పరిచయం అవుతుంది. ఆమెకి కాంతారావు ముందే తెలుసు. ఓ అమ్మాయిని తన బాస్ వేధింపుల నుంచి రక్షించేందుకు హెల్ప్ చేసిన సీన్ చూసి అప్పుడే అతనికి పడిపోతుంది. ఇక హైదరాబాద్‌లో మధుమతి చేసే పనులకు ఇంప్రెస్ అయిన కాంతారావు ఆమె ప్రేమలో పడతాడు. తన ప్రేమని వ్యక్తం చేసే టైమ్ వస్తుంది. ప్రేమని వ్యక్తం చేయగా మధుమతి సైలెంట్‌గా వెళ్లిపోతుంది. కట్ చేస్తే చిత్తూరికి మధుమతి అక్క మ్యారేజ్ కోసం కాలేజ్ ఫ్రెండ్స్ తోపాటు కాంతారావు కూడా వెళ్తాడు. అక్కడ తనని పెంచి పోషిస్తున్న పెద్దప్ప(నాగినీడు).. మధుమతి ప్రేమని అంగీకరించాడా? పెద్దప్పకి, మధుమతి తండ్రి నాగప్ప(సిజ్జు)కి గొడవేంటి? అక్కడ ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
ఇదొక కమర్షియల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమని చెప్పొచ్చు. స్టార్ హీరోలు చేసే స్థాయి కథ కావడం విశేషం. తొలి చిత్రంతోనే దర్శకుడు సురేష్ శేఖర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకున్నాడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. ఎక్కడా వల్గారిటీకి తావులేదు. మొదట్లో హీరో తండ్రి పోసాని, తల్లి హేమ, వాళ్ల కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తుంటాయి. కాలేజ్ ఎపిసోడ్ సరదాగా సాగుతుంది. హైదరాబాద్‌లో మధుమతికి ఇంప్రెస్ అయ్యే సన్నివేశాలు, ఆ అమ్మాయి తన ఇరిటేషన్‌ని చిన్న స్లిప్‌లలో చెప్పే సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. దీనికి తోడు కాలేజ్‌లో పవన్, భరత్, అలాగే కారుమంచి రఘులతో వచ్చేసన్నివేశాలు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. అదే సమయంలో కాస్త ల్యాగ్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
సెకండాఫ్ కథ మొత్తం రాయలసీమ చిత్తూరుకి వెళ్తుంది. అక్కడ పెద్దప్ప నాగినీడు ఊరు పెద్ద. తనకి ఆస్తులు లేకుండా చేశాడని, తనని పదవులకు దూరం చేశాడని పెద్దప్పపై నాగప్ప పగతో రగిలిపోతుంటాడు. ఆయన్ని చంపేసేందుకు ప్లాన్లు చేస్తుంటాడు. అక్కడ ఎమ్మెల్యే ప్రభాకర్ పాలన బాగా లేదని ఊర్లో జనం చెప్పడంతో ఎదురుతిరిగిన ప్రభాకర్ ని జనం ముందు తంతాడు పెద్దప్ప. దీంతో తన పరువు పోయిందని ప్రభాకర్ ఆయనపై పగ పెంచుకుంటాడు. పెద్దప్పని చంపేసేందుకు ప్లాన్ చేస్తుంటాడు. మరోవైపు అక్క పెళ్లిలో మధుమతి తన ప్రేమ విషయం అన్న శివన్న(శశాంక్)కి చెబుతుంది. మరోవైపు హీరో ఫ్రెండ్స్ బ్యాచ్‌లోకి గేని పంపించి ఆటపట్టించడం వంటి సన్నివేశాలతో ఓ వైపు ఎంటర్‌టైన్‌మెంట్, మరోవైపు సీరియస్ సీన్లని చాలా క్లీన్‌గా రాసుకున్నాడు దర్శకుడు. వెటికవే సెపరేట్‌గా స్పెస్ ఇస్తూ వాటిని మలిచిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌లో మధ్య మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు, సెకండాఫ్‌లో పెళ్లి ఈవెంట్‌లో వచ్చి సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ మాత్రం మరింత క్రిస్పిగా రాసుకోవాల్సింది. ఎక్కువ సేపు క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండటంతో ఆడియెన్స్ సహనం పరీక్షించేలా అనిపిస్తుంది. అదే సమయంలో హీరోహీరోయిన్లని చంపేందుకు, పెద్దప్పని చంపేందుకు ప్రభాకర్ ఓ వైపు, నమ్మిన బంటు శివన్న మరోవైపు ప్రయత్నించే సన్నివేశాలు ట్విస్ట్ లతో ఆట్టుకున్నా, నిడివి అనేది ఆ కిక్‌ని తగ్గించేస్తుంది.
నటీనటులుః
హీరోగా నటించిన సాయి రోనక్ బాగానే చేశాడు. ఎక్స్ ప్రెషన్స్ పలికించడంలో మరింత అనుభవం కావాలనేది అర్థమవుతుంది. మధుమతిగా హీరోయిన్ నేహా సోలంకి చాలా బాగా చేసింది. సందడంగా ఆ అమ్మాయిదే అనేట్టు చేసింది. `ఫోన్ ఎక్కువ మాట్లాడకండి.. మ్యాటర్ పనిచేయదు` అని హీరోయిన్ చెప్పిన విధానం బాగా పేలింది. కారుమంచి రఘు కామెడీ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఫ్రెండ్స్ గా భరత్,పవన్ ఫర్వాలేదనిపించారు. పోసాని, హేమ, నాగినీడు, ప్రభాకర్, సిజ్జు, శశాంక్ పాత్రలు తమ పాత్ర పదిరి మేరకు ఫర్వాలేదనిపించాయి.
టెక్నీషియన్లుః
దర్శకుడు సురేష్ కొత్త డైరెక్టర్ అయినా మంచి అటెప్ట్ చేశాడని చెప్పొచ్చు. కథని నడిపించే విషయంలో మరికాస్త దృష్టి పెట్టి ఉంటే, సినిమా నిడివిని తగ్గించి ఉంటే సినిమా బోర్ లేకుండా ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసేదిగా ఉండేది. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకి ప్లస్ అని చెప్పాలి. పాటలు చాలా బాగున్నాయి. ఆర్‌ఆర్ సైతం ఆకట్టుకుంటుంది. సంగీతమే సినిమాకి బలం. సురేష్ గంగుల మెలోడీ సాంగ్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి. అదే సమయంలో పాటలు ఒకటి రెండు తగ్గిస్తే బాగుండేది. అజిత్ వి రెడ్డి, జయపాల్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి. ఎడిటర్ మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఎడిటింగ్‌లో తన మార్క్ చూపించలేకపోయాడని చెప్పాలి. మరోవైపు నిర్మాణ విలువలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాల స్థాయిలో నిర్మించారు. ఫారెన్ లొకేషన్ల విషయంలో నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తాయి. రాజీపడకుండా నిర్మించారని చెప్పొచ్చు.
ప్లస్‌లుః
ఎంటర్టైన్‌మెంట్
సంగీతం
లవ్ స్టోరీ
మైనస్‌లుః
స్లో నెరేషన్
నిడివి
క్లైమాక్స్
ఫైనల్ థాట్‌ః ల్యాగ్ అనేది పక్కన పెడితే ఇదొక క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
రేటింగ్: 2.75
చిత్ర యూనిట్‌ః
నటీనటులుః సాయి రోనక్(హీరో), నేహ సోలంకి(హీరోయిన్), శశాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బాహుబలి ప్రభాకర్, హేమ, రఘు కారుమంచి, సూర్య, తాగుబోతు రమేష్.
సంగీతంః భీమ్స్ సిసిరోలియో
పాటలుః సురేష్ గంగుల, దేవ్,
ఎడిటింగ్ః ఉపేంద్ర జక్క
ఆర్ట్ డైరక్టర్ః రామాంజనేయులు
పీఆర్వోః రమేష్ చందు, నగేష్ పెట్లు
ఫైట్స్ః నభా-సుబ్బు,
కొరియోగ్రఫీః వెంకట్ దీప్; సినిమాటోగ్రఫీః అజిత్ వి.రెడ్డి, జయపాల్ రెడ్డి
నిర్మాతః ఉదయ్ కిరణ్,
రచన-దర్శకత్వంః సురేష్ శేఖర్ రేపల్లె.
also read: తేజ సజ్జ 'అద్భుతం' రివ్యూ
also read: Ram Asur Review : రామ్ అసుర్ మూవీ రివ్యూ