తేజ సజ్జ 'అద్భుతం' రివ్యూ
ఇలాంటి నేపధ్యంతోనే గతంలోనూ తెలుగులో 'ప్లే బ్యాక్' టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. రెండిటి మధ్య ఉన్న తేడా ఏమిటి...ఈ కథ ఏ మేరకు మనవాళ్ళకు నచ్చే అవకాసం ఉంది...స్టోరీ లైన్ ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
తెలుగులో గత కొద్దికాలంగా ప్రయోగాల సీజన్ నడుస్తోంది. మూస ధోరణిని పక్కన పెట్టి మరీ సినిమాలు చేసేందుకు నిర్మాతలు, హీరోలు ముందుకు వస్తున్నారు. ప్రేక్షకులు కూడా కొత్తదనానికి పట్టం కడుతూ సహకరిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన సినిమానే 'అద్బుతం'. గతాన్ని, వర్తమానాన్ని కలుపుతూ నడిచే కథగా చేసిన ఈ సినిమా ఓ లవ్ స్టోరీ. క్రాస్ టైమ్ కనెక్షన్ అనే పాయింట్ ని ఈ సినిమాలో టచ్ చేసారు. అయితే ఇలాంటి నేపధ్యంతోనే గతంలోనూ తెలుగులో 'ప్లే బ్యాక్' టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. రెండిటి మధ్య ఉన్న తేడా ఏమిటి...ఈ కథ ఏ మేరకు మనవాళ్ళకు నచ్చే అవకాసం ఉంది...స్టోరీ లైన్ ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
టీవి ఛానెల్ లో పనిచేసే సూర్య(తేజ సజ్జ) ఓ రోజు తనకు తన నెంబర్ నుంచే మెసేజ్ రావటంతో షాక్ అవుతాడు. ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఎవరా అని రిప్లై ఇస్తాడు. అవతల మెసేజ్ చేసింది వెన్నెల(శివాని రాజశేఖర్) అనే అమ్మాయి. ఆమెకి కూడా తన నెంబర్ తో తనకే మెసేజ్ రావటంతో ఆశ్చర్యంలో మునిగిపోతుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు మెసేజ్ లు,ఫోన్స్ తో ముందుకు వెళ్తారు. అలాగే అదే సమయంలో ఇలా ఒకే నెంబర్ తో ఇద్దరు కనెక్ట్ అయ్యి ఉంటారా అని టెక్నికల్ గా ఎంక్వైరీ చేస్తారు. ఆ క్రమంలో తెలిసే విషయం ఏమిటంటే... సూర్య 2019లోనూ, వెన్నెల 2014లోనూ ఉన్నారని...క్రాస్ టాక్ ద్వారా తమ ఫోన్స్ కలిసాయని. అక్కడ నుంచి కథ కొత్త టర్న్ తీసుకుంటుంది. ఈ క్రమంలో వీళ్లద్దరికి గతంలోనే పరిచయం ఉందని మెల్లిగా రివీల్ అవుతుంది. అసలు వీళ్లిద్దరూ ఎవరు..ఎక్కడ పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమ కథగా ఎలా టర్న్ తీసుకుంది..గతంలో ఎందుకు విడిపోయారు...వేర్వేరు కాలాల్లో ఉన్న వీళ్లిద్దరూ ఒకటి అయ్యారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ...
ఒక ఫోన్ ను వేదికగా ఉపయోగించి రెండు వేర్వేరు కాల వ్యవధులను పరస్పరం అనుసంధానించే ఐడియా ఎప్పుడూ బాగుంటుంది. అయితే ఏ విచిత్రమైన కథ అయినా believability తో చెప్పగలగలాలి. అప్పుడే జురాసిక్ పార్క్ అయినా ఈ అద్బుతం అయినా అద్బుతంగా ఉందనిపిస్తుంది. ఈ సినిమాలో కోర్ కాన్సెప్టుని నమ్మించే ప్రయత్నం ఓ సైంటిస్ట్ పాత్ర ద్వారా చేసారు. అయితే ఆ కారణం సినిమా బేస్ ని నిలబెట్టే స్దాయిలో అయితే లేదు. అలాగే టైమ్ ట్రావెల్ ని కేవలం టూల్ గానే తీసుకుని, లవ్ స్టోరీకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఇలాంటి కాన్సెప్టు ఎత్తుకున్నారంటే ఏదో అద్బుతం చూడబోతున్నాం అనుకుంటే కేవలం ఓ మామూలు లవ్ స్టోరీ తెరపై కనిపిస్తుంది.
ఇక ఈ ఐడియా ఎక్కడ నుంచి,ఎలా వచ్చింది అనేది ప్రక్కన పెడితే...వాస్తవానికి చాలా విచిత్రమైన కథ ఇది. టైమ్ ట్రావెల్ ని నమ్మితే భలే ఉందనిపించే పాయింట్. మనకు సైంటిఫిక్ జ్ఞానం ఉంటే దానితో ఆడుకునే ఓ తెలివైన పాయింట్. మనకు ఇలా జరిగితే బాగుండును అనిపించే కథ. ఆలోచన బాగుంది. ఓ కొత్త తరహా ప్రయత్నం అనిపించుకునే స్థాయి ఆ స్టోరీ లైన్ కు ఉంది.
అలాగే కొద్ది కాలం క్రితమే ఇలాంటి నేపధ్యం (క్రాస్ టైమ్ కనెక్షన్) తోనే ప్లే బ్యాక్ అనే సినిమా తెలుగులో వచ్చింది. అయితే ఆ సినిమాలో కథని రెండు కాలాల మధ్య జరిగే కథకు క్రైమ్ ని జత చేసి నడిపించారు. ఇక్కడ అద్బుతం విషయానికి వచ్చేసరికి పూర్తిగా లవ్ స్టోరీ చేసేసారు. అసలు ఈ సినిమా లో ఉన్న క్రాస్ టాక్ కనెక్షన్ అనే విషయం అర్థమవ్వడానికి కొంత సమయం పడుతుంది. అర్దమయ్యాక ఆ పాయింట్ చూట్టూ కొత్త విషయం జరుగుతుందేమో అని ఎదురుచూస్తూంటాం. కానీ లవ్ స్టోరీతో సరిపెట్టేసారు. ఐదేళ్ల క్రితం కలవలేకపోయిన ప్రేమికులు, ఈ క్రాస్ టాక్ పుణ్యమా అని ఒకటి అవుతారు. ఆ సీన్స్ బాగానే రాసున్నారు. కాని రెండు కాలాల మధ్య గ్యాప్ మరీ ఐదేళ్లే పెట్టడంతో పెద్దగా ఏమీ అనిపించదు. క్రాస్ టాక్ కనెక్షన్ లేకపోయినా కలుస్తారు అనిపిస్తుంది. దాంతో ఆ టూల్ ప్రయోజనం పెద్దగా లేకుండాపోయింది.
అలాగే లవ్ స్టోరీ లో వచ్చే సీన్స్ ఉద్వేగ భరితంగా చూసుకోవాల్సింది. కానీ హీరో తండ్రి చనిపోవటం వంటి వాటిపైనే దృష్టి పెట్టారు. లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు అక్కడే ఎమోషన్స్ రైజ్ చేస్తే బాగుండేది. అప్పటికీ దర్శకుడు తాను నమ్మిన ఎలిమెంట్స్ ని అక్కడ పూర్తి కన్విక్షన్ తో బలంగానే చెప్పగలిగాడు. కాకపోతే… ఈ ప్రాసెస్ చెప్పుకోదగినంత గొప్పగా జనరంజకంగా సాగలేదు.తొలి సగ భాగం కథ నత్తనడక నడుస్తుంది. క్రాస్ టాక్ ని కేవలం వాళ్లిద్దరూ గతంలో లవర్స్ అని చూపించడానికే వాడుకున్నాడు. క్రాస్ టాక్ ఉంటుందా,అలా ఎప్పుడు జరుగుతుందా ? అనే అనుమానం వేస్తే.. కచ్చితంగా ఈ కథని ఫాలో అవ్వలేరు. అలాగే ఓ సైంటిస్ట్ చేత ఇదంతా నిజంగా రష్యాలో జరిగిందని చెప్పే ప్రయత్నం చేసారు. కానీ అది స్ట్రాంగ్ గా చెప్పలేకపోయారు. దాంతో పూర్తి స్దాయిలో కథతో కనెక్ట్ అవ్వలేం. నిజానికి ఈ సినిమా చూస్తున్నప్పుడు, ముఖ్యంగా తొలి సగంలో ప్లే బ్యాక్ గుర్తొస్తుంది. ఆ కథకీ, ఈ కథకూ సంబంధం లేకపోయినా నేపధ్యం అలాంటిదే కావటంతో అలా జరిగిపోతుంది.
ఎవరెలా చేసారు?
వాస్తవానికి తేజు సజ్జాకు ఇది తొలి సినిమా. ఓహ్ బేబి కన్నా ముందే పూర్తైంది. కానీ రకరకాల కారణాలతో ఆగిపోయింది. అయితే తొలి సినిమాకే మంచి ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషన్స్ సీన్స్ కూడా బాగా పండించాడు. ఇక హీరోయిన్ గా చేసిన శివాని రాజశేఖర్ కు ఇది తొలి చిత్రం. ఎమోషన్స్ సీన్స్ తప్పిస్తే మిగతా సీన్స్ లో ఈజ్ గా చేసుకుంటూ పోయింది. హీరో ప్రెండ్ గా చేసిన కమిడియన్ సత్య కామెడీ వర్కవుట్ కాలేదు. దేవిప్రసాద్, శివాజీరాజా,తులసి వంటి ఆర్టిస్ట్ లు సినిమాకు ఫిల్లర్స్ లా నిలిచి కాపు కాచారు.
టెక్నికల్ గా ..
దర్శకుడు ఫోన్‌ను ద్వారా రెండు వేర్వేరు కాల వ్యవధుల మధ్య కథను చూపించే ఆలోచన బాగుంది కానీ ఇంకాస్త బెటర్ ఎగ్జిక్యూషన్ ఉండే బాగుండేదనిపించింది. ఇలాంటి కొత్త తరహా సినిమా తీయాలనే దర్శకుడు ఆలోచనను మాత్రం ప్రశంసించాల్సిందే. ఇక పాటలు పెద్దగా అనిపించకపోయినా, బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకు కలిసొచ్చే అంశం. సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తెచ్చింది. ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండాఫ్ మరింత ట్రిమ్ చేసుకుంటే సగం భారం, బాధ తప్పేది. రన్‌టైం 2 గంటల 21 నిమిషాలుని 2 గంటల్లో ముగిస్తే సినిమా క్రిస్ప్ గా ఉండేది. లక్ష్మీ భూపాల రాసిన డైలాగులు చాలా చోట్ల వర్కవుట్ అయ్యాయి. కంటెంట్ లేని చోట కూడా కలం బలంతో లాగే ప్రయత్నం చేసారు. నిర్మాణ విలువలు బాగున్నాయి
ఫైనల్ థాట్
ఈ డైరక్టర్ కి లేదా నిర్మాత కు క్రాస్ టైమ్ కనెక్షన్ లాంటిది సెట్ అయితే 'ప్లే బ్యాక్' స్టోరీ లైన్ రిపీట్ అవ్వకపోను.
రేటింగ్: 2.5/5
--సూర్య ప్రకాష్ జోశ్యుల
---
ఎవరవెరు...
ప్రధాన తారాగణం: తేజ సజ్జ, శివాని రాజశేఖర్, సత్య, శివాజీ రాజా తదితరులు
సంగీతం: రథన్
నిర్మాణ సంస్థ: మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్ బ్యానర్
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: మల్లిక్ రామ్
విడుదల: 19-11-2021