ఈ 3 సూపర్ హిట్ సాంగ్స్‌⁠ని తడబడకుండా మీరు పాడగలరా ? ఓసారి ట్రై చేయండి.. వెంకీ, పవన్ సినిమాల్లోనివి

Published : Nov 05, 2025, 07:18 PM IST

తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన టంగ్ ట్విస్టర్ సాంగ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లోని కొన్ని పాటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ఈ పాటలని మీరు పాడగలరా.. 

తెలుగు సినిమాల్లో వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్ లాంటి గేయ రచయితలు ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని తమ పాటల రూపంలో అందించారు. వీరు మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో గొప్ప లిరిసిస్ట్ లు ఉన్నారు. వారంతా ప్రేక్షకులు సరదాగా పాడుకునే పాటలు, ఉర్రూతలూగించే పాటలు. ఆలోచన రేకెత్తించే పాటలు, విప్లవాత్మక పాటలు అందించారు. వీటితో పాటు వారి సాహిత్యంలో ప్రేక్షకులకు ఛాలెంజ్ అనిపించే టంగ్ ట్విస్టర్ సాంగ్స్ కూడా ఉన్నాయి. తెలుగులో సినిమాల్లో ఉన్న ఓ 3 టంగ్ ట్విస్టర్ సాంగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

25
వెన్నెలకంటి రాసిన ఈ పాట గురించి తెలుసా

 ''గలగలమని తరగల తరగని కల కదిలిన కథలివే 

కలకలమని కులుకుల అలుకలుగని చిలికిన సుధలివే 

చెలువనుగని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే 

అలుపెరుగని అలరుల అలలను గని తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే 

తలపడకిక తప్పదులే''   

ఇది విక్టరీ వెంకటేష్, శ్రీదేవి నటించిన క్షణ క్షణం చిత్రంలోని జుంబాయే అంటూ పాటలోని చరణం. పడాలని ట్రై చేసినా చాలా తికమక పెట్టేలా ఉంది కదా. ఈ సాంగ్ ని వెన్నెలకంటి రాశారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటని మనో, చిత్ర ఇద్దరూ అద్భుతంగా పాడారు. క్షణ క్షణం చిత్రంలోని పాటలన్నీ ఆణిముత్యాలే. 

35
సిరివెన్నెల కలం నుంచి జాలువారిన అద్భుతం 

 ''ఎక్కడ ఎక్కడ ఎక్కడ 

ఎక్కడ ఎక్కడ ఎక్కడ 

ఎక్కడ దాక్కున్నావే లక్కులు తెచ్చే చుక్క 

ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే చప్పున చక్కగా 

ఠక్కున టక్కరి పెట్టా నిన్ను పట్టేదెట్టా''

 ఇది రాజేంద్ర ప్రసాద్ లేడీస్ టైలర్ చిత్రంలోని పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. వంశీ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ నటించిన లేడీస్ టైలర్ చిత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో పాటలన్నీ సిరివెన్నలే రాశారు. ఈ టంగ్ ట్విస్టర్ సాంగ్ ని గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడారు. 

45
ఇది పవన్ సినిమాలోని పాట

''ఓయ్ సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు 

చీటికిమాటికి మాటికి చీటికి ఘాటుగా తాకినా ఊపిరి కొట్టుడు 

దాటక దాటక గీతను దాటి చెక్కిలి చేరే చక్కర కొట్టుడు 

మీటక మీటక మనస్సే మీటి మాటలు చెప్పే చేతల కొట్టుడు 

కొట్టినవాడే దగ్గర జరిగే దగ్గర జరిగే..సిగ్గులు కరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓ..ఓ .. 

ప్రేమలు పిండగ నోములు పండగ, కోమలి చెంపలు మళ్ళీ కొట్టాలేయ్''

ఇది పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి చిత్రంలోనిది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సినిమా నిరాశ పరిచినప్పటికీ ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంది. ఈ పాటని ఆస్కార్ విజేత చంద్రబోస్ రాశారు. చెంపదెబ్బలకు హీరోతో హీరోయిన్ ప్రేమలో పడ్డ సందర్భం అది. ఈ సందర్భాన్ని ఛాలెంజ్ గా తీసుకుని చంద్రబోస్ ఈ టంగ్ ట్విస్టర్ సాంగ్ ని అందంగా రాశారు. ఈ పాటని నరేష్ అయ్యర్, శ్వేతా మీనన్ పాడారు.   

55
మీరూ ట్రై చేయండి

సాధారణంగా సూపర్ హిట్ సాంగ్స్ ని ప్రేక్షకులు తెగ పాడేస్తుంటారు. ఇలాంటి టంగ్ ట్విస్టర్ సాంగ్స్ వినడానికి చాలా బావున్నప్పటికీ పాడడానికి మాత్రం ఎవ్వరూ సాహసించరు. వీటిని తడబడకుండా కరెక్ట్ గా పాడడం అంత సులభం కాదు. కానీ సాధన చేస్తే అంత కష్టం కూడా కాదు. ఇలాంటి పాటలని మీరూ పాడి చూడండి.

Read more Photos on
click me!

Recommended Stories