కథ:
పేదవారికి అండగా, ఊరికి పెద్దగా ఉండే మురళి కృష్ణ (బాలకృష్ణ) ఎవరికి అన్యాయం జరిగినా సహించడు. ఈ క్రమంలో అదే ఊరికి కలెక్టర్ గా శరణ్య (ప్రగ్యా జైస్వాల్)వస్తుంది. బాలయ్య మంచితనం, ఊరి కోసం, ప్రజల కోసం ఆయన పడే తాపత్రయం, నిస్వార్థమైన మనసు చూసి ఆకర్షితురాలు అవుతుంది. అలా మురళి కృష్ణ, శరణ్య మధ్య ప్రేమ చిగురిస్తుంది. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకొని వైవాహిక జీవితం మొదలుపెడతారు. అదే ఊరిలో వరదరాజులు(శ్రీకాంత్) అక్రమ మైనింగ్ జరుపుతూ ఉంటాడు. కాపర్ మైనింగ్స్ లో అకృత్యాలు సాగిస్తూ ఉంటాడు. ఆ మైనింగ్స్ వలన చుట్టు ప్రక్కల ఉన్న గ్రామ ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది తెలుసుకున్న మురళి కృష్ణ రంగంలోకి దిగుతాడు. వరదరాజులును ఎదిరిస్తాడు. దీనితో మురళి కృష్ణను తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపించి తనకు అడ్డులేకుండా చేసుకుంటాడు. మురళి కృష్ణ జైలుపాలు కావడంతో వరదరాజులు అరాచకాలు మితిమీరిపోతాయి. చివరికి శరణ్యకు ఆమె కుటుంబానికి వరదరాజులు నుండి ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నిస్సహాయ స్థితిలో బాలయ్య అఖండ గా ఎంట్రీ ఇస్తాడు. ఈ అఖండ ఎవరు? అతడు క్రూరుడైన వరదరాజులుకు ఎలా చెక్ పెట్టాడు? మురళి కృష్ణ కుటుంబంతో అతనికి సంబంధం ఏమిటీ? అనేది మిగతా కథ
అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అఖండ (Akhanda)బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలే అన్నమాట వినిపిస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన బోయపాటి తెరకెక్కించిన ఫైట్ సీక్వెన్సులు అభిమానులతో పాటు ఫ్యాన్స్ కి ట్రీట్ అంటున్నారు. బాలయ్య ఆటం బాంబ్ అయితే దాన్ని సరిగా పేల్చడం తెలిసినవాడు ఒక్క బోయపాటే అనేది అక్షర సత్యమని బల్లగుద్ది చెబుతున్నారు.
ముఖ్యంగా బాలయ్య ఇంట్రో సీన్ గూస్ బంప్స్ కలిగించేది ఉందని, ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. ఈ మధ్య కాలం ఈ రేంజ్ మాస్ ఇంటర్వెల్ బ్యాంగ్ రాలేదని తెలియజేస్తున్నారు. రాయలసీమ యాసలో బాలయ్య డైలాగ్స్ మరో ఆకర్షణ. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. రెండు పాటలు మెప్పించగా... జై బాలయ్య సాంగ్ ఫుల్ కిక్ పంచుతుంది.
డిఫరెంట్ రోల్స్ లో బాలకృష్ణ తన నటవిశ్వరూపం చూపించారు. విలన్ గా శ్రీకాంత్ (Srikanth) నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఆయనకు ఈ మూవీతో బ్రేక్ వచ్చే ఆస్కారం కలదు. సినిమాలో ప్రధాన పాత్రలు చేసిన నటులు మెప్పించారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్(Pragya jaiswal) కెరీర్ లో మొదటిసారి మంచి పాత్ర దక్కించుకున్నారు. కథలో కీలమైన కలెక్టర్ పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంది. సాంగ్స్ లో బాలయ్యతో ఆమె కెమిస్ట్రీ కూడా అద్భుతం.
థమన్ బీజీఎం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఎలివేట్ అవ్వడంలో థమన్ బీజీఎమ్ ప్రధానంగా నిలిచింది. ఇక సెకండ్ హాఫ్ దర్శకుడు బోయపాటి ఎమోషనల్ గా నడిపారు. బోయపాటి సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ పీక్స్ లో ఉంటాయి. గత సినిమాలకు మించి అఖండ మూవీలో చూడవచ్చు.
అఖండ సినిమా ఆద్యంతం సీరియస్ నోట్ లో సాగుతుంది. సినిమాలో కామెడీకి ఆస్కారం లేదు. ఇక అఖండ గురించి వినిపిస్తున్న నెగిటివ్ కామెంట్స్ నిడివి ఎక్కువైందని అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సాగదీతకు గురైందన్న మాట వినిపిస్తుంది.
బోయపాటి సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు ఉంటాయి. కథ కూడా చాలా బలంగా ఉంటుంది. అఖండ విషయానికి వస్తే కథాబలం లేదన్న మాట వినిపిస్తుంది. అలాగే ఇది బాలయ్య వన్ మ్యాన్ షో అంటున్నారు. మితిమీరిన యాక్షన్ సన్నివేశాలు కూడా ఒకింత ఇబ్బంది కలిగించే అంశం అంటున్నారు.