ఏపీలో టికెట్‌ రేట్లు కప్పు టీ కంటే తక్కువ..కొత్త రేట్లు ఇవే.. నెటిజన్ల ట్రోల్స్.. తెలంగాణ గ్రీన్‌ సిగ్నల్‌

First Published | Dec 1, 2021, 11:04 PM IST

కొన్ని ఏండ్ల నాటి టికెట్ రేట్లని ఇప్పుడు నిర్ణయించడం ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సినీ ప్రముఖులు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం టికెట్ల రేట్ల విషయం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

jagan

jagan

సినిమా థియేటర్ లో టికెట్ల రేట్లకి సంబంధించి ఇటీవల అసెంబ్లీలో టికెట్‌ రేట్లని పెంచడానికి వీలు లేదని, ఎక్కువ షోలు వేయడానికి వీల్లేదని చట్టం తెచ్చింది. బిల్లుని పాస్‌ చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ వ్యతిరేకత వ్యక్తమవుతుంది.  కొన్ని ఏండ్ల నాటి టికెట్ రేట్లని ఇప్పుడు నిర్ణయించడం ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సినీ ప్రముఖులు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం టికెట్ల రేట్ల విషయం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా టికెట్ రేట్ల వివరాలను వెల్లడించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో కప్పు టీ కంటే తక్కువగా టికెట్ల రేట్లు ఉండటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

గ్రామీణ ప్రాంతాల్లో ఎకానమీ సీట్ల టికెట్ల రేట్లు రూ. 5 ఉండటం షాక్‌కి గురి చేస్తుంది. గ్రామాల్లోని థియేటర్లలో, పట్టణాల్లో, నగరాల్లో నాన్‌ ఏసీ, ఏసీ, మల్టీ ప్లెక్స్ లో టికెట్ల స్లాబులను ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వివరాలు వెల్లడించింది. `నో బెనిఫిట్ షోస్, నో ఎక్స్‌ట్రా షోస్, నో టికెట్ హైక్స్.. కేవలం నాలుగంటే నాలుగే ఆటలు. టికెట్లను కూడా ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో అమ్ముతుంది..` అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. 


ys jagan

ys jagan

ఇటీవల ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్లులో ఉంది ఇదే. ఈ బిల్లు ప్రకారం ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల కొత్త రేట్లను బుధవారం ప్రకటించింది. ఈ రేట్లతో సినిమా నిర్మాతల పరిస్థితి ఏమో గానీ.. థియేటర్ల వ్యవస్థ మాత్రం భారీగా నష్టపోవడం ఖాయం. ఈ రేట్లు చూసిన థియేటర్ల యజమానులు షాక్‌ అవుతున్నారు. సినిమా టికెట్ల కొత్త ధరల ప్రకారం అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా ప్రకటించారు.
 

theatre

టికెట్ల రేట్ల వివరాలను ఓ సారి చూస్తే, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో... మల్టీప్లెక్సుల్లో ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40. నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20. మున్సిపాలిటీ ప్రాంతాల్లో... మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150 , డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30. నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15. 
 

నగర పంచాయతీల్లో... మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15. నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10. గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో... మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10. నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5. 

ఈ టికెట్‌ రేట్ల వివరాలు చూస్తుంటే కామెడీగా ఉందంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ టికెట్ల రేట్లపై సినీ ప్రియులు సైతం సెటైర్లు వేస్తున్నారు. కప్పు టీ కంటే తక్కువగా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వంపై పలువరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంకా అప్‌డేట్‌ కారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమని తమ గుప్పింట్లో పెట్టుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని కొందరు కామెంట్‌ చేస్తుండటం గమనార్హం. 
 

మరోవైపు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం బాగుందని, కానీ టికెట్ల రేట్లని పెంచమని కోరారు. రేట్లు పెంచి ఆన్‌లైన్‌లో అమ్మితే ప్రభుత్వానికి ట్యాక్స్ ల రూపంలో ఆదాయం వస్తుందన్నారు. కానీ ఇలా చేస్తే థియేటర్ల మనుగడ కష్టమని చెప్పారు. అంతకు ముందు చిరంజీవి సైతం తమ రిక్వెస్ట్ ని తెలియజేసిన విషయం తెలిసిందే. లోలోపల సినీ నిర్మాతలు రగిలిపోతున్నారు. మదన పడుతున్నారు. ఇప్పుడు వరుసగా `అఖండ`,`పుష్ప`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `భీమ్లా నాయక్‌`,`రాధేశ్యామ్‌` వంటి భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. భారీ బడ్జెట్‌ చిత్రాలు ఈ టికెట్ రేట్లతో సినిమాని రిలీజ్‌ చేస్తే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. 

telangana highcourt

telangana highcourt

మరోవైపు తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు హైకోర్ట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. `అఖండ`, `పుష్ప`, `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాలకు టికెట్ల రేట్లని పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. టికెట్‌ పై రూ.50 పెంచుకునే అవకాశం కల్పించడం విశేషం. 

Latest Videos

click me!