Anaswara Rajan: నటి అనస్వర రాజన్ ఛాంపియన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. తెలుగు ప్రేక్షకుల అభిమానం, చంద్రకళ పాత్ర సవాళ్లు, నటన పట్ల ఆమెకున్న ఆసక్తి, బాల్యం నుంచీ సినీ ప్రయాణం లాంటి విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
మలయాళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి అనస్వర రాజన్.. ప్రస్తుతం ఛాంపియన్ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది హీరోయిన్ అనస్వర రాజన్. తన పేరు అనస్వరకు అర్థం "నాశనం లేనిది" లేదా "అనంతమైనది" అని వివరించింది.
25
తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు..
"తెలుగు ప్రేక్షకులు ఏ మంచి సినిమానైనా, ఏ మంచి నటుడినైనా ఆదరిస్తారు. అది మా పరిశ్రమలా కాదు. వారంతా మంచి చిత్రాలను అంగీకరిస్తారు" అని హీరోయిన్ అనస్వర చెప్పింది. 2019లో విడుదలైన 'తన్నీర్ మతన్ దినంగల్' సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకుల ప్రేమను పొందానని, అప్పటి నుంచే తెలుగు చిత్రాలలో నటించాలని ఆశపడ్డానని తెలిపింది.
35
మొదటి సినిమా ఆడిషన్ జరిగింది అప్పుడే..
ఛాంపియన్ చిత్రం ఇతర ప్రేమకథా చిత్రాల కన్నా భిన్నమైనదని అనస్వర చెప్పింది. ఈ సినిమాలో ఆమె పోషించిన చంద్రకళ పాత్ర కొత్త సవాలును విసిరిందని పేర్కొంది. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు తన మొదటి సినిమా ఆడిషన్‌కు వెళ్లడం, ఎలాంటి నటన అనుభవం లేకుండానే ఎంపిక కావడం తనను ఆశ్చర్యపరిచిందని అనస్వర పేర్కొంది.
కేరళలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన తాను ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని తెలిపింది. ఆడిషన్‌కు వెళ్లడానికి తన అక్క సహాయపడిందని.. అలా తల్లిదండ్రులు తనను అనుమతించారని పేర్కొంది. సినిమా రంగం తనను ఒక నటిగా మాత్రమే కాకుండా, ఒక వ్యక్తిగా కూడా ఎదిగేలా చేసిందని అనస్వర స్పష్టం చేసింది.
55
అతడే నా ఫేవరెట్ హీరో..
"నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నటన నుండి లభించే అడ్రినలిన్ రష్ నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. అది డబ్బు, కీర్తి కంటే ఎక్కువ" అని ఆమె అన్నారు. ప్రశంసలతో పాటు విమర్శలు రావడం సహజమేనని, మొదట్లో కష్టంగా అనిపించినా, ఇప్పుడు వాటిని స్వీకరించే సామర్థ్యం పెరిగిందని వివరించింది. అల్లు అర్జున్ తనకు ఇష్టమైన తెలుగు హీరో అని.. తెలుగు సినిమాలు చూస్తున్నానని తెలియకుండానే.. వాటిని ఇష్టపడ్డానని పేర్కొంది.