అఫ్గాన్‌తో అంత వీజీ కాదు.. అది గుర్తుంచుకోవాల్సిందే.. : భారత్‌కు మాజీ క్రికెటర్ సూచన

First Published Sep 2, 2022, 5:24 PM IST

Asia Cup 2022: ఆసియా కప్-2022లో  అఫ్గానిస్తాన్ అదరగొడుతున్నది. గ్రూప్-బిలో ఉన్న ఆ జట్టు.. శ్రీలంక, బంగ్లాదేశ్ లను ఓడించి  సూపర్-4కు అర్హత సాధించింది. 

afghanistan

యూఏఈ వేదికగా జరుగుతున్న  ఆసియా కప్-2022లో అంచనాలకు మించి రాణిస్తున్న అఫ్గానిస్తాన్ జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆ జట్టును అనామక జట్టు అనుకుంటే తప్పులో కాలేసినట్టేనని, ఆ జట్టును అంత తేలిగ్గా తీసుకుంటే షాకులు తప్పవని టీమిండియా మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా హెచ్చరించాడు. 

గ్రూప్ దశలో శ్రీలంక తో పాటు బంగ్లాదేశ్ లను మట్టికరిపించిన ఆ జట్టు.. టీ20 ఫార్మాట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నదని, బౌలర్లతో పాటు బ్యాటింగ్ లోనూ అద్భుతాలు చేస్తున్న అఫ్గాన్ తో ఆడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిఖిల్ చోప్రా సూచించాడు. 

ఈ మెగా టోర్నీలో భాగంగా భారత జట్టు.. ఈనెల 6 (మంగళవారం) అఫ్గానిస్తాన్ తో తలపడనుంది. సూపర్-4లో భాగంగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. నిన్నా మొన్నటిదాకా ఆసియా కప్ లో భారత ప్రధాన ప్రత్యర్థి పాకిస్తాన్ అని భావించిన వాళ్లు ఇప్పుడు అప్గాన్ పేరును కూడా సూచిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో నిఖిల్ చోప్రా మాట్లాడుతూ.. ‘ఆసియా కప్-2022 లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడిన అఫ్గాన్ బంగ్లాదేశ్, శ్రీలంక చేసిన చిన్న చిన్న తప్పులను  కూడా చేయలేదు. నోబాల్స్, అదనపు పరుగుల విషయంలో కూడా ఆ జట్టు అప్రమత్తంగా ఉంది.  అఫ్గాన్ చాలా టైట్ క్రికెట్ ఆడుతున్నది. 

మీరు గొప్ప ఆటగాడు లేదా మీది గొప్ప జట్టే కావచ్చు.. కానీ అఫ్గాన్ తో ఆడుతున్నప్పుడు మాత్రం  ఆ జట్టును తేలికగా తీసుకుంటే కుదరదు.  అఫ్గాన్ ను ఓడించడానికి  మీలోని ఉత్తమ ఆటను బయటకు తీయాల్సిందే..’ అని అన్నాడు. 

ఆసియా కప్ కు ముందు అఫ్గాన్.. ఐర్లాండ్ తో  టీ20 సిరీస్ ఆడి ఓడింది. కానీ ఆ తర్వాత  ఆ జట్టు అద్భుతంగా పుంజుకుంది.  బౌలింగ్ లో రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లు అదరగొడుతున్నారు. బ్యాటింగ్ లో రహ్మతుల్లా గుర్బాజ్, జజాయ్, నజీబుల్లా జద్రాన్ లు దూకుడుమీదున్నారు. ఈ టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో టాప్ క్లాస్  ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న  అఫ్గాన్.. ఫైనల్ బెర్త్ పై కన్నేసిందనడంలో సందేహమే లేదు.

click me!