Ind Vs Nz: ఆ ఆరుగురు లేరు.. మరి ప్రపంచ ఛాంపియన్లను ఢీకొనడమెలా..? తొలి టెస్టులో టీమిండియాకు అగ్ని పరీక్ష..

First Published Nov 24, 2021, 1:01 PM IST

India Vs New Zealand: బౌలింగ్ విషయం పక్కనబెడితే బ్యాటింగ్  ఆర్డర్ లో ఉన్నవారిలో  రహానే,  పుజారా తప్ప మిగిలిన వారికి  పెద్దగా అనుభవం లేదు. మరి వీళ్లు న్యూజిలాండ్ బౌలర్లను ఏ మేరకు నిలువరిస్తారనేది వేచి చూడాలి.

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య గురువారం నుంచి కాన్పూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్నది. ఇప్పటివరకు ఇండియాలో ఇండియాను ఓడించని కివీస్... ఆ అప్రతిష్టను చెరిపేయాలనే ఉద్దేశంతో భారత గడ్డపై అడుగుపెట్టింది. 

సిరీస్ సంగతి పక్కనబెడితే  33 ఏండ్లుగా  టెస్టులలో స్వదేశంలో భారత్ ను కూడా కివీస్ ఓడించలేదు. ఈ చెత్త రికార్డులకు ఈ సిరీస్ లో అయినా చరమగీతం పాడాలని కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ భావిస్తున్నది. అయితే అందుకు వారికి  సదావకాశాలే ఉన్నాయి. కొంతకాలంగా భారత జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో వెన్నెముకగా ఉన్న ఆరుగురు కీ ప్లేయర్లు అందుబాటులో లేరు. 

తీరిక లేని క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఈ సిరీస్ నుంచి  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్, విరాట్ కోహ్లీ (తొలి టెస్టుకు మాత్రమే) తప్పుకున్నారు. కొన్నాళ్లుగా భారత జట్టు బౌలింగ్  భారాన్ని మోస్తున్న జస్ప్రీత్ బుమ్రా,  మహ్మద్ షమీ కూడా సిరీస్ కు దూరమయ్యారు. ఇక వీళ్లతో పాటు మరో భారత ఓపెనర్ కెఎల్ రాహుల్ కూడా గాయంతో  సిరీస్ నుంచి తప్పుకున్నాడు.

ఈ నేపథ్యంలో అజింక్యా రహానే నేతృత్వంలోని యువ భారత జట్టు  ప్రపంచ టెస్టు ఛాంపియన్లైన  కివీస్ ను ఎలా ఓడిస్తుంది..? అనేది ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. 

ఆరుగురు కీ ప్లేయర్లతో పాటు ప్రస్తుతం తొలి టెస్టుకు కెప్టెన్, వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రహానే, పూజారాలు కూడా ఫామ్ లో లేరు. టెస్టుల్లో పూజారా సెంచరీ చేయక  34 నెలలు దాటింది.  గత 22 టెస్టుల్లో అతడి  యావరేజీ 29 కంటే తక్కువ. ఇక రహానే పరిస్థితి కూడా అంతే.. గత 15 టెస్టుల్లో అతడి బ్యాటింగ్ సగటు 25 కంటే తక్కువగా ఉంది. ఈ గణాంకాలు ఇప్పుడు  ఆందోళన కలిగిస్తున్నాయి. 

అయితే సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్న వేళ భారత రిజర్వ్ బెంచ్ ను పరీక్షించడానికి భారత్ కు ఇది చక్కని అవకాశమని కూడా పలువురు విశ్లేషణలు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో ఓపెనర్ శుభమన్ గిల్ ను మిడిలారర్డర్ లో పంపాలనుకున్నా.. కెఎల్ రాహుల్ కు గాయమవడంతో అతడిని తిరిగి మయాంక్ అగర్వాల్ తో కలిసి ఓపెనింగ్ పంపే అవకాశాలే ఎక్కువున్నాయి. 

ఇక సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ లలో ఒకరికి తొలి టెస్టులో ఆడే అవకాశం రానున్నది. అయితే ఇప్పటిదాకా టీ20లకే పరిమితమైన ఈ స్టార్లు..  టెస్టులలో కీలకంగా ఉండే మిడిలార్డర్ లో ఏ మేరకు రాణిస్తారనేది సందేహమే..? ఓపెనర్లుగా మయాంక్, గిల్ వస్తే..  ఆ  తర్వాత పుజారా, రహానే, శ్రేయస్ అయ్యర్ (లేదా) సూర్యకుమార్ బ్యాటింగ్ కు వస్తారు. 

రిషభ్ పంత్ కు విరామం ఇవ్వడంతో ఆ  స్థానాన్ని  మరో కీపర్ వృద్ధిమాన్ సాహా భర్తీ చేస్తున్నాడు. అతడు ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. ఇక జడేజా, అశ్విన్ లు ఏడు, ఎనిమిది స్థానాల్లో వచ్చే అవకాశముంది.  

బౌలింగ్ విషయం పక్కనబెడితే బ్యాటింగ్  ఆర్డర్ లో ఉన్నవారిలో  రహానే,  పుజారా తప్ప మిగిలిన వారికి  పెద్దగా అనుభవం లేదు. మరి వీళ్లు న్యూజిలాండ్ బౌలర్లను ఏ మేరకు నిలువరిస్తారనేది వేచే చూడాలి. ఇక ఈ సిరీస్ లో పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్లతో ఆడిస్తామని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్  చెప్పిన నేపథ్యంలో యువ భారత  బ్యాటర్లు వారిని ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తికరం. 

తొలి టెస్టుకు భారత జట్టు : అజింక్యా రహానే (కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

click me!