ఈసారి ఆర్సీబీ రిటైన్ చేసుకునేది వీళ్లనే.. ఆ ఆస్ట్రేలియా ఆటగాడిపై నమ్మకం లేదంటున్న ఆకాశ్ చోప్రా

First Published Nov 24, 2021, 12:05 PM IST

IPL Mega Auction: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఎవరెవరు  ఏ జట్టు తరఫున ఆడతారో అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ ఆఖర్లో గానీ లేదా వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో గానీ ఐపీఎల్ మెగా వేలం జరుగనున్నది. 

క్యాష్ రిచ్ లీగ్ గా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో 2022 సీజన్ కోసం మరికొద్దిరోజుల్లో వేలం ప్రారంభం కానున్నది. ఈసారి ఐపీఎల్ లోకి రెండు కొత్త జట్లు వస్తున్న నేపథ్యంలో ఈ వేలం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఇటీవలే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)  వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈసారి ఐపీఎల్ లో ఆయా జట్లు నలుగురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశముంది. అందులో ముగ్గురు ఇండియన్స్.. ఒక విదేశీ ఆటగాడు ఉండాలి.  ఈ నెల ఆఖరుకల్లా  ఇందుకు సంబంధించిన జాబితాను ఆయా జట్లు అందించాల్సి ఉంది. 

ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎవరిని రిటైన్  చేసుకుంటే మంచిది..? తానైతే ఎవరిని రిటైన్ చేసుకుంటాననే విషయాలపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడాడు.  ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

చోప్రా మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి, యుజ్వేంద్ర చాహల్ ను అయితే పక్కాగా రిటైన్ చేసుకోవాల్సిందే. ఇక మూడు, నాలుగు స్థానాల్లో మహ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్ ను తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. 

అయితే మహ్మద్ సిరాజ్ కు బదులు మరో బౌలర్ హర్షల్ పటేల్ గురించి కూడా ఆలోచిస్తా.  వాళ్లిద్దరిలో ఎవరైనా ఓకే..’ అని అన్నాడు.  విదేశీ ప్లేయర్ల కోటాలో ఒకరిని తీసుకోవాల్సింది వస్తే తానైతే గ్లెన్ మ్యాక్స్వెల్ పై అంతగా ఆసక్తి చూపబోనని చోప్రా చెప్పాడు. 

‘మీరు  మ్యాక్సీ గురించి కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ నేనైతే అతడిని రిటైన్ చేసుకోను. ఐపీఎల్ లో అతడి ప్రదర్శనపై నేను వంద శాతం సంతృప్తితో  లేను. గత సీజన్ లో ఆర్సీబీ తరఫున అతడు బాగానే ఆడినా నేనైతే అతడిని మళ్లీ రిటైన్ చేసుకోను.. ’ అని తెలిపాడు. 

అంతేగాక..  ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం తెలుగు కుర్రాడు హనుమ విహారిని  ఎంపికచేయకపోవడంపైనా ఆకాశ్ చోప్రా బీసీసీఐ పై మండిపడ్డాడు. అది సెలెక్టర్లు  చేసిన ఘోర తప్పిదమని చెప్పాడు. 

కాగా.. ఆర్సీబీ జట్టు కు ఇన్నాళ్లు పెద్ద దిక్కుగా ఉన్న ఏబీ డివిలియర్స్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతేగాక విరాట్ కోహ్లి  కూడా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.  వచ్చే సీజన్ కోసం  ఆర్సీబీ కొత్త సారథితో పాటు  నాణ్యమైన విదేశీ ఆటగాళ్లను,  స్వదేశీ క్రికెటర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. 

click me!