Rohit Sharma:గతేడాది మేం ఓడటానికి కారణమదే.. అందుకే దానిని మారుస్తున్నాం : హిట్‌మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Aug 7, 2022, 5:33 PM IST

WI vs IND T20I: గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన పొట్టి ప్రపంచకప్ లో భారత జట్టు  గ్రూప్ దశలోనే  ఇంటిబాట పట్టింది. విరాట్ కోహ్లీకి టీ20 సారథిగా అదే చివరి టోర్నీ. ఆ తర్వాత  భారత జట్టుకు రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టాడు. 
 

2021 టీ20 ప్రపంచకప్ లో భారత్ టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగింది.  ఇక టోర్నీకి ముందే తనకు సారథిగా ఇదే చివరి టోర్నీ అని విరాట్ కోహ్లీ ప్రకటించడంతో  అతడు కచ్చితంగా తన బెస్ట్ ఇస్తాడని, ఆటగాళ్లు కూడా  కోహ్లీకి టీ20 ప్రపంచకప్ ను గిఫ్ట్ గా ఇస్తారని ఊహించారు. కానీ అవన్నీ భ్రమలే అని తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఓటమితో తేలిపోయింది.  తర్వాత న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఓడటంతో  భారత్ గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. 

అయితే ఈ ఓటములు భారత్  కు మంచే చేశాయి అంటున్నాడు  టీమిండియా సారథి రోహిత్ శర్మ. గత టీ20 ప్రపంచకప్ లో తాము ఏం కోల్పోయామో తెలుసుకున్నామని..  ఆ తర్వాత ప్లాన్ మార్చామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మాత్రం పక్కా ప్రణాళికతో వెళ్తున్నామని తెలిపాడు. 
 

ఆసియా కప్ కు ముందు స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ టీవీ ఇంటర్వ్యూలో రోహిత్ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా రోహిత్ మాట్లాడుతూ.. గతేడాది టీ20 ప్రపంచకప్ లో మేం ఫైనల్ చేరలేకపోయాం. అందుకు కారణం మేం ఆడే వైఖరి, అప్రోచ్ బాగోలేదని  గ్రహించాం.  దానిని మార్చుకుంటే తప్ప ఫలితాలు రావని నిశ్చయించాం. ఇక ఆ తర్వాత మా జట్టులో ఆటగాళ్లకు కూడా అదే విషయం స్పష్టంగా చెప్పాం. దూకుడుగా ఆడటాన్ని అలవరుచుకుని అదే విధానంతో ముందుకు సాగుతున్నాం. 
 

ఇక మా జట్టు ఎక్కడ ఉండాలనేదానిమీద మేం స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరుచుకున్నాం. ఆ మేరకే  కెప్టెన్, హెడ్ కోచ్ నుంచి ఆటగాళ్లకు స్పష్టమైన సందేశాలు అందుతున్నాయి. మేం నిర్దేశించుకున్న ప్రణాళికల ప్రకారం.. ఆటగాళ్లకు స్వేచ్ఛ, స్పష్టత కావాలి. అది మేం వాళ్లకు కావాల్సినంత ఇస్తున్నాం. స్పష్టత ఉన్నాక  ఇక వ్యక్తిగతంగా ఆటగాళ్లు రాణిస్తారని తెలిపాడు. 

దీంతో పాటు టీమ్ లో  సిరీస్ కు ఒక సారథి అన్నట్టుగా పాటిస్తున్న విధానంపై  విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రోహిత్ దీనిమీద స్పందించాడు. జట్టులో ఎక్కువ మంది సారథులు ఉంటే మంచిదేనని, దానివల్ల తన పని సులువవుతుందని చెప్పడం గమనార్హం. 

ఇదే విషయమై రోహిత్ మాట్లాడుతూ... ‘జట్టులో ఎక్కువమంది సారథులు ఉంటే అదే జట్టుకే మంచిదని నేను భావిస్తాను. మేం ప్రతీయేటా ఐపీఎల్ ఆడతాం.  అక్కడ పది ఫ్రాంచైజీలున్నాయి. పది మంది కెప్టెన్లు ఉన్నారు.  వారంతా  ఏదో ఒక దశలో టీమిండియాలోనూ భాగమవుతారు.. 

జాతీయ జట్టులో ఆడేప్పుడు మాకు ఒత్తిడిని అధిగమిస్తూ, పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఆడే ఆటగాళ్లు కావాలి. ఒక జట్టుకు సారథిగా పనిచేస్తే ఇవన్నీ తెలుస్తాయి.  అప్పుడు నా పని కూడా సులువవుతంది..’అని హిట్ మ్యాన్ చెప్పాడు. 

click me!