‘విహారికి విశ్రాంతినిచ్చి ఈ ముంబై ఆటగాడిని తీసుకోవాలి.. అప్పుడే మిడిలార్డర్ పటిష్టం..’

First Published Jul 6, 2022, 1:18 PM IST

ENG vs IND: ఎడ్జబాస్టన్ టెస్టులో టీమిండియా దారుణ పరాజయం భారత జట్టులో బ్యాటింగ్ లోపాలను ఎత్తిచూపింది. టాపార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో.. 

Hanuma Vihari

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య బుధవారం ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలోనూ విఫలమైన హనుమా విహారిని జట్టు నుంచి తప్పించి రంజీ సీజన్ లో అదరగొట్టిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశమివ్వాలంటున్నాడు వసీం జాఫర్.

ఎడ్జబాస్టన్ మ్యాచ్ ముగిశాక ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో  జాఫర్  మాట్లాడుతూ.. ‘విహారి వరుసగా విఫలమవుతున్నాడు. రాబోయే టెస్టు సిరీస్ లలో అతడికి చోటు కష్టమే అనిపిస్తున్నది. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్  దేశవాళీ క్రికెట్ లో భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. 
 

టీమిండియాకు మిడిలార్డర్ స్థానాన్ని భర్తీ చేయడానికి అతడు  సిద్ధమవుతున్నాడు.  సర్ఫరాజ్ ఫామ్ దృష్ట్యా అతడికి అవకాశమివ్వాలి..’ అని  జాఫర్ తెలిపాడు.

జాఫర్ చెప్పినట్టు గత కొద్దిరోజులుగా విహారి దారుణంగా విఫలమవుతున్నాడు. గత 10 టెస్టులలో అతడు 25 సగటుతో 383 పరుగులు మాత్రమే చేశాడు. ఎడ్జబాస్టన్ టెస్టులో విహారి.. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 31  రన్స్ మాత్రమే చేశాడు. 

మరోవైపు సర్ఫరాజ్ మాత్రం రంజీలలో రెచ్చిపోయాడు. ఈ సీజన్ లో అతడు ముంబై తరఫున ఆడుతూ.. 982 పరుగులు చేశాడు. రంజీ సీజన్ లో 900 పరుగులు దాటడం అతడికి ఇది వరుసగా మూడో సీజన్ కావడం విశేషం.  

ఇటీవలే ముగిసిన రంజీ సీజన్ లో అతడి మెరుపులకు గాను  సర్ఫరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. ఇక ఇటీవలే  సర్ఫరాజ్ ఖాన్ కు టీమిండియాలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు బీసీసీఐ అధికారులు కూడా  తెలిపిన విషయం తెలిసిందే. నవంబర్ లో జరుగబోయే బంగ్లాదేశ్ సిరీస్ లో అతడికి భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది.

ఇదిలాఉండగా.. విహారికి విశ్రాంతినివ్వాలని సూచించిన జాఫర్.. శుభమన్ గిల్ ను మిడిలార్డర్ లో ఆడించాలని చెప్పాడు. అతడు ఇప్పుడే ఎదుగుతున్న క్రికెటర్ అని.. ఓపెనింగ్ వల్ల అతడు ఇబ్బందులు పడుతున్నట్టు కనిపిస్తున్నదని జాఫర్ తెలిపాడు. 
 

గిల్ తో పాటు శార్దూల్ ఠాకూర్ కు కూడా జాఫర్ మద్దతుగా నిలిచాడు. ఒక్క మ్యాచ్ ద్వారా శార్దూల్ ప్రదర్శనను నిందించడం సరికాదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. 

click me!