ఇంగ్లాండ్ లో వైట్ బాల్ ఫార్మాట్ కు కెప్టెన్ అయితే టెస్టులకు మంగళమే.. నయా సారథి సంచలన వ్యాఖ్యలు

First Published Jul 6, 2022, 12:13 PM IST

Jos Buttler: ఇటీవలే ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ సారథి ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో  ఆ స్థానాన్ని జోస్ బట్లర్ భర్తీ చేస్తున్నాడు. 

ఇంగ్లాండ్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. టెస్టులకు ఓ కెప్టెన్ ఉండగా..వన్డే, టీ20లకు మరో సారథి ఉంటాడు.  ఈ సంప్రదాయాన్ని ఆ జట్టు చాలా కాలంగా  కొనసాగిస్తున్నది. అయితే మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లుఅక్కడ చాలా అరుదు. 
 

ఇక ఇంగ్లాండ్ కు వైట్ బాల్ (వన్డే, టీ20) కెప్టెన్సీ బాధ్యతలు మోయాల్సి వస్తే ఆ ఆటగాడు టెస్టులలో చోటు  సాధించడం చాలా కష్టమంటున్నాడు ఆ జట్టు  పరిమిత ఓవర్ల నయా కెప్టెన్ జోస్ బట్లర్. 

ఇంగ్లాండ్ కు వైట్ బాల్ కెప్టెన్ అయితే టెస్టు కెరీర్ కు మంగళం పాడినట్టేనని.. ఆ దిశగా ఆశలు పెట్టుకోవడం కూడా వృథా అని అన్నాడు. భారత జట్టుతో గురువారం నుంచి టీ20 సిరీస్  ప్రారంభం కానున్న నేపథ్యంలో అతడు విలేకరులతో మాట్లాడాడు. 

బట్లర్ స్పందిస్తూ.. ‘వైట్ బాల్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తూ టీమ్ కు విజయాలు అందించడం ఇప్పుడు నా మొదటి ప్రాధాన్యత.  ఈ ఫార్మాట్ లో సవాళ్లను స్వీకరించడానికి నేను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. 

నేను ఇకనుంచి నా దృష్టి మొత్తం దీని మీదే కేంద్రీకరించాల్సి ఉంది. ఇక నా టెస్టు కెరీర్ గురించి మాట్లాడాల్సి వస్తే.. ఇక అది ప్రశ్నార్థకమే. దీనికి సమాధానం నేను చెప్పలేకపోవచ్చు. ఇప్పటికైతే నా అవసరం అక్కడ లేదు.  

నేను ఈ ఏడాది యాషెస్ సిరీస్ లో కూడా సరిగా రాణించలేదు. ఇప్పటికైతే నేను ఇంగ్లాండ్ టెస్టు టీమ్ లో సభ్యుడిని కాదు. కానీ బెన్ స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లాండ్ టెస్టు జట్టు అద్భుతంగా పురోగతి చెందుతున్నది. ప్రస్తుతానికి అక్కడ  కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేట్టు కూడా కనిపించడం లేదు..’ అని అన్నాడు.

2015లో ఇయాన్ మోర్గాన్ కు వైట్ బాల్ కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పిన ఇంగ్లాండ్.. బట్లర్ ను వైస్ కెప్టెన్ గా చేసింది. అప్పట్నుంచి బట్లర్ టెస్టుల మీద దృష్టి తగ్గించాడు.  టీ20లు, వన్డేలకే ప్రాధాన్యమిచ్చాడు. 

టెస్టులలో బట్లర్.. 57 మ్యాచులాడి 2,907 పరుగులు చేశాడు. కానీ 151 వన్డేలలో 4,120 పరుగులు, 88 టీ20లలో 2,140 పరుగులు సాధించాడు. వన్డేలలో 10, టీ20లలో ఒక సెంచరీ చేశాడు. 

click me!