ఉపేక్షించేది లేదు.. ఓటమికి ముమ్మాటికీ వాళ్లే బాధ్యులు.. టీమిండియా పై మాజీ ఆటగాడి ఆగ్రహం

First Published Jul 6, 2022, 11:32 AM IST

ENG vs IND: ఎడ్జబాస్టన్ టెస్టులో టీమిండియా ఓటమిపై సీనియర్ ఆటగాళ్లు మండిపడుతున్నారు. ఈ టెస్టులో శాసించే స్థితిలో ఉన్న భారత జట్టు అనూహ్యంగా ఓడటానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. 

ఇండియా-ఇంగ్లాండ్ రీషెడ్యూల్డ్ టెస్టులో భారత జట్టు అనూహ్య పరాజయానికి కారణం  టీమిండియా బ్యాటింగే అంటున్నాడు మాజీ ఓపెనర్ వసీం జాఫర్.  టాపార్డర్ బ్యాటర్ల వైఫల్యం వల్లే భారత్ ఓటమి  పాలైందని వ్యాఖ్యానించాడు. 

మ్యాచ్ అనంతరం జాఫర్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తో మాట్లాడుతూ.. ‘ఈ టెస్టులో టీమిండియా ఓటమికి కారణం కచ్చితంగా భారత బ్యాటర్ల వైఫల్యమే.  ఈ టెస్టులో ఇండియా  తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసేప్పుడు కొంచెం పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. 

కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం  పిచ్ కూడా బ్యాట్ కు అనుకూలంగానే ఉంది.  కొంచెం నిలదొక్కుకుంటే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముండేది.  రెండో ఇన్నింగ్స్ లో భారత్ కనీసం 350-400 స్కోరు చేసి ఉండాల్సింది.  అప్పుడు ఈ మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది..’ అని తెలిపాడు.

ఈ టెస్టులో టీమిండియా టాపార్డర్ సమిష్టిగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్ లో శుభమన్ గిల్, పుజారా, హనుమా విహారి, కోహ్లి, శ్రేయస్ అయ్యర్ చేసిన పరుగులు 76.. రెండో ఇన్నింగ్స్ లో ఇదే జాబితాలో పుజారా ఒక్కడే కాస్త మెరుగ్గా (66) ఆడాడు. మిగిలినవారిది అదే పంథా.  మిగతా నలుగురు రెండో ఇన్నింగ్స్ లో చేసిన రన్స్  54. 

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో జో రూట్-బెయిర్ స్టో అద్భుతంగా బ్యాటింగ్ చేశారని.. వాళ్లకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చాడు. ‘రూట్, బెయిర్ స్టో ఆడిన విధానం ప్రశంసించదగ్గది.  వాళ్లిద్దరూ ఈ టెస్టులో  ఆటను మరో స్థాయికి తీసుకెళ్లారు..’ అని అన్నాడు. 

తొలి ఇన్నింగ్స్ లో 132 పరుగుల ఆధిక్యం దక్కినా టీమిండియా రెండో ఇన్నింగ్స్  245 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లాండ్ ముందు 378 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. 76.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి  ఛేదించింది. 

భారత బ్యాటర్లు నిలదొక్కుకోవడానికే ఇబ్బందిపడ్డ చోట ఇంగ్లాండ్ ఓపెనర్లు అలెక్స్ లీస్ (56), జాక్ క్రాలే (46), జో రూట్ (142), జానీ బెయిర్ స్టో (114) లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. 

click me!