Gautam Gambhir on virat Kohli: సందర్భం వచ్చినప్పుడల్లా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తో పాటు ఆటగాడిగా అతడి వైఫల్యాలను ఎత్తి చూపే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. ఈసారి దానికి విరుద్ధంగా మాట్లాడాడు.
టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించడంపై భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ (బీసీసీఐ) తీసుకున్న ఈ నిర్ణయాన్ని భేష్ అంటున్నవారు కొందరైతే.. అదో పనికిమాలిన నిర్ణయమని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
28
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్.. విరాట్ పై తనదైన శైలిలో స్పందించాడు. ఎప్పుడూ ఎడమొహం పెడమొహంలా ఉండే వీళ్లిద్దరి సంబంధాల మధ్య గంభీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
38
విరాట్ కోహ్లీని పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ గా తొలగించడంపై గంభీర్ మాట్లాడుతూ.. ‘రెడ్ బాల్ క్రికెట్ (టెస్టులు) లో రోహిత్ శర్మ రోల్ ఎలాంటిదో.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో విరాట్ పాత్ర కూడా అంతే. ఈ నిర్ణయం (కెప్టెన్సీ నుంచి తప్పించడం) కోహ్లీకి లాభించేదే. దీని ద్వారా అతడు కొన్ని బాధ్యతల నుంచి విముక్తుడయ్యాడు.
48
దీంతో అతడు వైట్ బాల్ క్రికెట్ (వన్డే, టీ20 లు) లో మరింత ప్రమాదకారిగా మారే అవకాశముంది. ఎందుకంటే ఇప్పుడు అతడి భుజాలపై కెప్టెన్సీ ఒత్తిడి లేదు. అతడు ఇండియా గర్వించే విధంగా ఆడుతాడు.
58
ఒక్క టెస్టులలోనే కాదు.. వన్డేలు, టీ20లలో కూడా విరాట్ మళ్లీ పరుగుల ప్రవాహాన్నా కొనసాగిస్తాడు. ఇదే సమయంలో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు అనేది జట్టుకు ఉపకరించేదే. జట్టుకు వారి విజన్ ఉపయోగపడుతుంది.
68
ఫార్మాట్ ఏదైనా.. ఇకనుంచి భారత క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ లోని ఉత్తమ ఆటను చూడబోతారు. అదే సమయంలో సుదీర్ఘకాలంగా అతడు ఆట మీద చూపిస్తున్న మక్కువ.. క్రికెట్ మీద అతడికున్న అభిరుచి కెప్టెన్ కాకపోయినా ఉత్తమంగానే ఉంటాయి...’ అని గంభీర్ చెప్పాడు.
78
గతంలో ఐపీఎల్ సందర్భంగా వీళ్లిద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అని నోరు పారేసుకుని కొట్టుకున్నంత పని చేసిన ఘటనను ఇద్దరి అభిమానులు ఇప్పటికీ మరువలేరు. తాజాగా గంభీర్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది.
88
దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో భారత టెస్టు జట్టుతో పాటు వన్డే నాయకత్వ మార్పులు కూడా చేసిన బీసీసీఐ.. విరాట్ ను తప్పించి రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల క్రికెట్ కు సారథిగా నియమించిన విషయం తెలిసిందే. వన్డే కెప్టెన్ గా అత్యంత విజయవంతమైన రికార్డున్నా.. ఐసీసీ ట్రోఫీ లేదనే కారణంతో కోహ్లీని కెప్టెన్ గా తొలగించినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.