Ashes 2021-22: రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. గాయంతో కీలక ఆటగాడు దూరం

First Published Dec 12, 2021, 3:29 PM IST

Josh Hazlewood: యాషెస్ సిరీస్ లో భాగంగా గబ్బాలో ముగిసిన తొలి టెస్టులో విజయం సాధించిన ఆసీస్ కు భారీ షాక్ తగిలింది. సిడ్నీలో జరుగబోయే రెండో టెస్టుకు ముందు ఆ జట్టు కీలక బౌలర్ గాయం కారణంగా వైదొలిగాడు. 

ఇంగ్లాండ్ తో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో భాగంగా  శనివారం ముగిసిన తొలి  టెస్టులో గెలిచి విజయానందంలో ఉన్న ఆస్ట్రేలియాకు  భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేస్ త్రయంలో ఒకడైన జోష్ హెజిల్వుడ్.. సిడ్నీలో జరుగబోయే రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. 

తొలి టెస్టు సందర్భంగా గాయం కావడంతో జోష్ హెజిల్వుడ్ రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. గబ్బా టెస్టులో నాలుగో రోజు  హెజిల్వుడ్ బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. 

పక్కటెముకల నొప్పితో గాయపడుతున్న అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో అతడు రెండో టెస్టులో  ఆడటం లేదు.  హెజిల్వుడ్ స్థానంలో జై రిచర్డ్సన్ ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. 

అసలైతే తొలి టెస్టు నాలుగో రోజే హెజిల్వుడ్ గ్రౌండ్ లోకి రావడం కష్టమే అని తెలిసినా.. అతడు నొప్పిని భరించి మరీ బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో జో రూట్ వికెట్ తో కలిపి రెండు వికెట్లు తీసిన హెజిల్వుడ్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా 14 ఓవర్లు బౌలింగ్ చేసి 32 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. 

హెజిల్వుడ్ గాయంపై ఆసీస్  సారథి కమిన్స్ మాట్లాడుతూ.. ‘ఇది ఐదు టెస్టు మ్యాచుల సిరీస్. ఈ సమయంలో ఎవరికీ గాయాలు కావొద్దని కోరుకుంటున్నాం.  హెజిల్వుడ్  త్వరలోనే జట్టుతో కలుస్తాడు..’ అని అన్నాడు. 

ఇక హెజిల్వుడ్ తో పాటు డేవిడ్ వార్నర్ కూడా గాయం బారిన పడ్డట్టు తెలుస్తున్నది. అయితే అతడు సిడ్నీ టెస్టు ఆడుతాడా.? లేదా..? అన్నది మాత్రం తేలాల్సి ఉంది.  తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో  బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మార్క్ వుడ్ బంతి వార్నర్ చేతికి బలంగా తాకడంతో అతడికి గాయమైందని తెలుస్తున్నది. 

ఈ కారణంగానే రెండో ఇన్నింగ్స్ లో వార్నర్ బ్యాటింగ్ కు రాలేదు. అతడి స్థానంలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ  ఓపెనర్ గా వచ్చాడు. కానీ 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 

ఇక ఇంగ్లాండ్ తో జరిగిన గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో 147 పరుగులకే  ఆలౌట్  అయిన ఇంగ్లాండ్.. రెండో టెస్టులో ఒకదశలో మెరుగ్గానే ఆడినా నాలుగో  రోజు  ఆసీస్ బౌలర్ల ధాటికి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో విజయం ఆసీస్ ను వరించింది. 

click me!