అత్య‌ధిక సార్లు టెస్టు క్రికెట్ లో 700+ ప‌రుగులు చేసిన టాప్-5 టీమ్స్ ఇవే

First Published Oct 10, 2024, 10:40 PM IST

Top 5 teams with most 700+ totals : 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టు ఇన్నింగ్స్‌లో 700ల‌కు పైగా పరుగులు చేసిన సందర్భాలు 26 సార్లు క‌నిపించాయి. ఒక ఇన్నింగ్స్‌లో 700+ పరుగులు చేయడం టెస్టు ఫార్మాట్‌లో జట్టుకు భారీ ఫీట్. ఒక ఇన్నింగ్స్‌లో 700 పరుగులు చేసిన తర్వాత ఏ జట్టు కూడా టెస్టు మ్యాచ్‌లో ఓడిపోక‌పోవ‌డం విశేషం.

Top 5 teams with most 700+ totals : బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా వ‌న్డే క్రికెట్, టీ20 క్రికెట్ ఫార్మాట్ తో పోలిస్తే టెస్ట్ క్రికెట్‌ అత్యంత కఠినమైనది. ఇక్కడ ఒక బ్యాటర్ నాణ్యమైన బౌలింగ్ దాడి ఎదుర్కొంటూ భారీ ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడ‌టం అత‌ని బ్యాటింగ్ ప‌వ‌ర్, నైపుణ్యాల‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. ప్ర‌పంచ క్రికెట్ లో మొత్తం 12 టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలు ఉన్నాయి. వాటిలో ఏడు దేశాలు మాత్ర‌మే క‌నీసం ఒక్కసారైనా ఒక ఇన్నింగ్స్‌లో 700 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాయి. టెస్టు క్రికెట్ లో ఒక జ‌ట్టు 700+ ప‌రుగులు చేయ‌డం గొప్ప ఫీట్ అని చెప్పాలి. ఇలాంటి ఘన‌త‌ను ఎక్కువ సార్లు సాధించిన టాప్-5 జ‌ట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

5. వెస్టిండీస్ - 4 సార్లు

వెస్టిండీస్ టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు నాలుగు సార్లు 700+ ప‌రుగులు చేసింది. వీటిలో ఒక  మ్యాచ్ ను గెలవగా, మిగిలిన మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మార్చి 1958లో కింగ్‌స్టన్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై వారి అత్యధిక స్కోరును న‌మోదు చేసింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 328 పరుగులు చేసింది. ఆ త‌ర్వాత గ్యారీ సోబర్స్ 365* పరుగులు ఇన్నింగ్స్ తో ఆతిథ్య జట్టు వెస్టిండీస్ 790/3 ప‌రుగుల‌కు డిక్లేర్ చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ 288 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్‌లో ఇన్నింగ్స్-174 పరుగుల తేడాతో విండీస్ గెలిచింది. 

టెస్టుల్లో వెస్టిండీస్ 700+ స్కోర్లు:

790/3d vs పాకిస్తాన్, కింగ్‌స్టన్, 1958
751/5d vs ఇంగ్లాండ్, సెయింట్ జాన్స్, 2004
747 vs సౌత్ ఆఫ్రికా, సెయింట్ జాన్స్, 2005
749/9d vs ఇంగ్లాండ్, బ్రిడ్జ్‌టౌన్, 2009

Latest Videos


Virat Kohli, RohitSharma

4. భారత క్రికెట్ జట్టు - 4 సార్లు

టెస్టు క్రికెట్‌లో భారత్ నాలుగు సార్లు 700 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసింది. ఇందులో భారత్ రెండు మ్యాచ్‌లు గెలవగా, రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

2016లో చెన్నై టెస్టులో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో భార‌త్ త‌మ‌ అత్యధిక స్కోరు న‌మోదుచేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులు చేసింది. ఆ త‌ర్వాత కరుణ్ నాయర్ 303* ప‌రుగులు, కేఎల్ రాహుల్ 199 పరుగుల ఇన్నింగ్స్ ల‌తో భారత్ 759/7 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భార‌త జట్టు ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టెస్టుల్లో భారత్ 700+ స్కోర్లు:

705/7d vs ఆస్ట్రేలియా, సిడ్నీ, 2004
726/9d vs శ్రీలంక, ముంబై (బ్రబోర్న్), 2009
707 vs శ్రీలంక, కొలంబో, 2010
759/7d vs ఇంగ్లాండ్, చెన్నై, 2016

3. ఇంగ్లాండ్ - 4 సార్లు

ఇప్పటి వరకు టెస్టు క్రికెట్ లో నాలుగు సార్లు 700+ ప‌రుగులు చేసింది ఇంగ్లాండ్. 1938లో ఓవల్‌లో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ త‌మ‌ అత్యధిక స్కోరును న‌మోదుచేసింది. ఓపెనర్ లియోనార్డ్ హట్టన్ 364 పరుగుల ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో  ఇంగ్లాండ్ 903/7d ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ - 579 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో  201 ప‌రుగులు, రెండో ఇన్నింగ్స్ లో 123 పరుగులు చేసింది.

టెస్టుల్లో ఇంగ్లండ్ 700+ ప‌రుగులు:

849 vs వెస్టిండీస్, కింగ్‌స్టన్, 1930
903/7d vs ఆస్ట్రేలియా, ఓవల్, 1938
710/7d vs ఇండియా, బర్మింగ్‌హామ్, 2011
823/7d vs పాకిస్తాన్, ముల్తాన్, 2024

2. ఆస్ట్రేలియా - 4 సార్లు

700 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన జ‌ట్ల జాబితాలో ఆస్ట్రేలియా తన టెస్ట్ చరిత్రలో నాలుగు సార్లు ఈ ఐకానిక్ ఫీట్‌ను సాధించింది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆసీస్ విజయం సాధించింది.

జూన్ 1955లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా త‌మ అత్యధిక స్కోరు సాధించింది. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 357 పరుగులకు ఆలౌటైంది. ఆ త‌ర్వాత‌ నీల్ హార్వే 204 పరుగుల ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా జట్టు 758/8d ప‌రుగులు చేసింది. ఆ తర్వాత ఆతిథ్య జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ - 82 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది. 

టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా 700+ స్కోర్లు:

729/6d vs ఇంగ్లాండ్, లార్డ్స్, 1930
701 vs ఇంగ్లాండ్, ది ఓవల్, 1934
758/8d vs వెస్టిండీస్, కింగ్‌స్టన్, 1955
735/6d vs జింబాబ్వే, పెర్త్, 2003

1. శ్రీలంక - 7 సార్లు

శ్రీలంక టెస్టు క్రికెట్‌లో ఏడుసార్లు 700+ స్కోర్లు సాధించింది. ఈ జాబితాలో అత్య‌ధిక సార్లు ఈ ఫీట్ సాధించింది ఒక్క శ్రీలంక‌నే. ఈ ఏడు సంద‌ర్భాల్లో శ్రీలంక నాలుగు విజ‌యాలు సాధించింది. మిగ‌తాత మూడు మ్యాచ్ ల‌ను డ్రాగా చేసుకుంది.

ఆగస్టు 1997లో భారత్‌పై శ్రీలంక త‌మ అత్యధిక స్కోరు 952/6d న‌మోదుచేసింది. ఈ మ్యాచ్ డ్రా అయింది. అలాగే, టెస్టు క్రికెట్ లో ఒక జ‌ట్టు సాధించిన అత్యధిక స్కోర్ కూడా ఇదే. 

టెస్టుల్లో శ్రీలంక 700+ స్కోర్లు:

952/6d vs భార‌త్, కొలంబో (RPS), 1997
713/3d vs జింబాబ్వే, బులవాయో, 2004
756/5d vs సౌతాఫ్రికా, కొలంబో (SSC), 2006
760/7d vs భార‌త్, అహ్మదాబాద్, 2009
730/6d vs బంగ్లాదేశ్, మీర్పూర్, 2014
713/9d vs బంగ్లాదేశ్, చటోగ్రామ్, 2018
704/3d vs ఐర్లాండ్, గాలె, 2023

click me!