పర్యటన అయితే ఉంది.. కానీ..! దక్షిణాఫ్రికా టూర్ పై వీడని సందిగ్దత.. ఎటూ తేల్చని కేంద్రం

First Published Dec 1, 2021, 12:41 PM IST

India tour Of South Africa: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్..  సౌతాఫ్రికాలో వీర విహారం చేస్తున్న నేపథ్యంలో ఇండియా-దక్షిణాఫ్రికా సిరీస్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఇండియా-సౌతాఫ్రికా ల మధ్య జరుగుబోయే సిరీస్ ఉంటుందా..? లేదా..? అనేదానిపై ఇంకా అనుమానాలు వీడటం లేదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్..  దక్షిణాఫ్రికా లో విజృంభిస్తున్న తరుణంలో  ఈ సిరీస్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. తాము భారత ఆటగాళ్లకు పూర్తి స్తాయి రక్షణ కల్పిస్తామని దక్షిణాఫ్రికా బోర్డు ఇప్పటికే హామీ ఇచ్చింది.

 అయినా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాత్రం దీనిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నది.  ఈ టూర్ కు  ఆటగాళ్లను పంపించడమా..? లేదా..? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిన బీసీసీఐ.. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నది. 

అయితే ఇదే విషయమై బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ..  ‘పర్యటన కొనసాగుతుంది.. కానీ దీనిపై మేమింకా నిర్ణయం తీసుకోలేదు. డిసెంబర్ 17న తొలి టెస్టు మొదలుకావాల్సి ఉంది. దానికి మాకింకా సమయముంది..  చర్చించాక వివరాలు వెల్లడిస్తాం..’ అని తెలిపాడు. 


క్రికెటర్ల  భద్రతే తమకు ముఖ్యమన్న  బీసీసీఐ.. అందుకోసం తాము దక్షిణాఫ్రికా బోర్డుతో చర్చలు సాగిస్తున్నట్టు తెలిపింది. అయితే రాబోయే మూడు, నాలుగు రోజుల్లో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. 

షెడ్యూల్ ప్రకారం.. భారత జట్టు డిసెంబర్ 8 రాత్రి గానీ 9 న గానీ దక్షిణాఫ్రికాకు బయల్దేరాల్సి ఉంది. డిసెంబర్ 17న జోహన్నస్బర్గ్ వేదికగా తొలి టెస్టు ఆడాలి.   

సౌతాఫ్రికా టూర్ లో భారత జట్టు.. మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 లు ఆడుతుంది. కానీ ఇటీవల ఆ దేశంలో విజృంభించిన ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తితో దక్షిణాఫ్రికా ను ప్రపంచ దేశాలు ‘హై రిస్క్’ కంట్రీగా భావిస్తున్నాయి.  అంతేగాక ఆ దేశంతో పాటు ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు కూడా మొదలయ్యాయి. ఈనేపథ్యంలో  ఇండియా-సౌతాఫ్రికా టూర్ ఎంతమేరకు విజయవంతమవుతుందనేది  ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

click me!