IPL Retention: వంద కాదు.. వేయి కాదు.. ఏకంగా 4 వేల శాతం పెరుగుదల.. భారీగా పెరిగిన వెంకటేశ్ అయ్యర్ సాలరీ..

First Published Dec 1, 2021, 10:20 AM IST

IPL Retained Players: ఐపీఎల్ రిటైన్డ్ ప్లేయర్ల జాబితా వచ్చేసింది. 8 ఫ్రాంచైజీలు 27 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. రిటెన్షన్ లో దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాను మంగళవారం రాత్రి ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. 

భారత  క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో  మంగళవారం రాత్రి ఐపీఎల్ రిటెన్షన్ ప్లేయర్ల జాబితా విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం8 ఫ్రాంచైజీలు  27 మందిని అట్టిపెట్టుకున్నాయి. పలువురు కీలక ఆటగాళ్లను వదిలేసినా వాళ్లను వేలంలో దక్కించుకోవాలని చూస్తున్నాయి. అయితే రిటైన్డ్ ప్లేయర్ల జాబితాలో మాత్రం పలువురు ఆటగాళ్లు ఊహించినదానికంటే అధిక మొత్తం సంపాదించారు. 

వీరిలో ముఖ్యంగా చెప్పుకునేది కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు, ఇటీవలే భారత  టీ20 జట్టులోకి అరంగ్రేటం చేసిన వెంకటేశ్ అయ్యర్.. నెల రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ రెండో దశ వరకు పెద్దగా పరిచయం లేని ఈ లెఫ్ట్ హ్యాండర్.. దుబాయ్ లో అదరగొట్టాడు. పాయింట్ల పట్టికలో అట్టడుగన ఉన్న కేకేఆర్ ను ఫైనల్ కు చేర్చడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. 

2020 లో  అయ్యర్ ను కోల్కతా రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్ లో అయ్యర్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. 2021 సీజన్ తొలి దశలో కూడా అతడు లోయరార్డర్ లో  బ్యాటింగ్ కు రావడంతో పెద్దగా గుర్తింపు పొందలేదు. కానీ వెంకటేశ్ లోని ప్రతిభను గుర్తించిన  ఆ జట్టు మెక్ కల్లమ్.. అతడిని  ఓపెనర్ గా ప్రమోట్ చేశాడు. ఇక తర్వాత అంతా చరిత్రే. 

2020 లో రూ. 20 లక్షలకు  దక్కించుకున్న ఈ యువ ఆల్ రౌండర్ కు ఈసారి  కోల్కతా ఏకంగా రూ. 8 కోట్లు చెల్లించింది. అంటే గతంతో పోలిస్తే అతడి వేతనం ఏకంగా 4000 శాతం పెరిగిందన్నమాట. ఇంకో మాటలో చెప్పాలంటే.. తన పాత వేతనంతో పోలిస్తే 40 రెట్లు అధికం.

అయ్యర్ ఒక్కడే కాదు.. మరికొందరు ఆటగాళ్లను కూడా ఫ్రాంచైజీలు ఊహించని ధరకు నిలుపుకున్నాయి. వీరిలో సన్ రైజర్స్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్ లు  గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 

జమ్మూకాశ్మీర్ కు చెందిన ఈ ఇద్దరు కుర్రాళ్లు.. ఇప్పుడిప్పుడే ఐపీఎల్ లో సత్తా చాటుతున్నారు. బ్యాటర్ గా అబ్దుల్ సమద్, ఫాస్ట్ బౌలర్ గా ఉమ్రాన్ మాలిక్ ను సానబెడుతున్న హైదరాబాద్.. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం వార్నర్, రషీద్ ఖాన్ వంటి హేమాహేమీలను కాదని  ఈ అప్ కమింగ్ ప్లేయర్లను దక్కించుకోవడం విశేషం. 

ఈ సీజన్ కు ముందు  ఉమ్రాన్ మాలిక్ ను ఎస్ఆర్హెచ్.. రూ. 10 లక్షలకు దక్కించుకోగా తాజాగా  అది రూ. 4 కోట్లకు పెరిగింది.  అబ్దుల్ సమద్ కు కూడా గతంలో రూ. 20 లక్షలు దక్కగా.. నేడు అది రూ. 4 కోట్లకు చేరింది. 

ఇక హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (ఇంకా అధికారికంగా ప్రకటించలేదు) కు కూడా భారీగానే ముట్టజెప్పింది యాజమాన్యం. అంతకుముందు కేన్ మామ సాలరీ రూ. 3 కోట్లు కాగా.. ఇప్పుడది ఏకంగా రూ. 14 కోట్లకు చేరింది. 

పంజాబ్ సూపర్ కింగ్స్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా భారీగానే దక్కించుకున్నాడు. గతంలో అతడిని కోటి రూపాలయకు దక్కించుకున్న పంజాబ్.. ఇప్పుడు ఏకంగా రూ. 14 కోట్లు ముట్టజెప్పింది. మరో పంజాబ్  లోకల్ కుర్రాడు అర్షదీప్ సింగ్.. రూ. 20 లక్షల నుంచి రూ. 4 కోట్లకు ఎగబాకాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న రుతురాజ్ గైక్వాడ్..  రూ. 40 లక్షల నుంచి రూ. 6 కోట్లకు ఎగబాకాడు. 

గైక్వాడ్ తో పాటు రవీంద్ర జడేజా కూడా తన సాలరీని పెంచుకున్నాడు. గతంలో జడ్డూకు రూ. 12 కోట్లు ముట్టజెప్పిన చెన్నై.. ఇప్పుడు దానిని రూ. 16 కోట్లకు పెంచింది. 

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న పృథ్వీ షా.. గతంలో రూ. 1.2 కోట్లకు అమ్మడుపోగా.. ఇప్పుడు  ఆ విలువను రూ. 7.5 కోట్లకు పెంచుకున్నాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మహ్మద్ సిరాజ్.. రూ. 2.6 కోట్ల నుంచి రూ. 7 కోట్లకు ఎగబాకాడు.

click me!