PKL 8: ఒక్కోరోజు మూడు మ్యాచులు.. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 షెడ్యూల్ విడుదల.. మ్యాచులన్నీ అక్కడే..

First Published Dec 1, 2021, 11:09 AM IST

Pro kabaddi League: గత ఏడు సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ మళ్లీ వచ్చింది. ఈనెలలోనే ఎనిమిదో సీజన్ మొదలుకానున్నది. బెంగళూరు వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్ షెడ్యూల్ ను నిర్వాహకులు విడుదల చేశారు. 

కబడ్డీ అభిమానులు ఎప్పుడెడప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.  ఐపీఎల్ మాదిరే అభిమానులను విశేషంగా అలరించే ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 కు సంబంధించిన తొలి దశ సీజన్  వచ్చేసింది.  ఈ మేరకు లీగ్ నిర్వాహకులు మార్షల్ స్పోర్ట్స్, వివో ప్రో కబడ్డీ లీగ్.. బుధవారం షెడ్యూల్ ను విడుదల చేసింది. 

కరోనా నేపథ్యంలో ఈ మ్యాచులన్నింటినీ ఒకే వేదికలో ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 22 నుంచి మొదలయ్యే ఈ మెగా ఈవెంట్ లో ఒక్కోరోజు మూడు మ్యాచులు కూడా జరుగుతుండటం గమనార్హం. 

ఈనెల 22 నుంచి బెంగళూరులోని షెరటన్ గ్రాండ్ బెంగళూరు వైట్ ఫీల్డ్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనున్నారు. బెంగళూరులో ఇది ఒక పెద్ద హోటల్. 

22 న.. బెంగళూరు బుల్స్  వర్సెస్ యూ ముంబా మధ్య తొలి మ్యాచ్ తో ఈ సీజన్ మొదలుకాబోతున్నది. రెండో   మ్యాచ్ లో తెలుగు టైటాన్స్.. తమిళ్ తలైవాలను ఢీకొట్టబోతున్నది. 

సుమారు రెండు నెలల పాటు కొనసాగే ఈ సీజన్ లో తొలి దశనే తొలుత  విడుదల చేశారు.  ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 దాకా జరిగే  ఫస్ట్ ఫేజ్ లో ఒక్కో జట్టు ఇతర జట్లతో రెండు మ్యాచులు ఆడనున్నాయి. మొత్తం 12 జట్లు పోటీ పడబోతున్నాయి. 

అయితే గతంలో రోజుకు  రెండు  మ్యాచులు నిర్వహించగా.. తాజాగా  ఫస్ట్ ఫేజ్ లోని కొన్ని రోజులు (ముఖ్యంగా శనివారాల్లో) మూడు మ్యాచులను నిర్వహించేందుకు నిర్వాహకులు  సిద్ధమయ్యారు. 

డిసెంబర్ 22న మొదలుకాబోయే ఈ  ఎనిమిదో సీజన్ లో.. వరుసగా నాలుగు రోజుల పాటు రోజుకు మూడు మ్యాచులు (25 వరకు) జరుగుతాయి. ఇక ఆ తర్వాత వచ్చే ప్రతి శనివారం.. ఇదే విధంగా మ్యాచులు జరుగనున్నాయి. మిగతా రోజుల్లో రోజుకు రెండు మ్యాచులను నిర్వహించనున్నారు. 

తొలి నాలుగు రోజులతో పాటు.. జనవరి 1, 8, 15 తేదీలలో కూడా ఆరు జట్లు మూడు మ్యాచుల్లో పోరాడనుండటంతో ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్ పక్కాగా అందనుంది. 

కొవిడ్ నిబంధనలను పాటిస్తూ కఠినమైన  బయో బబుల్ లో నిర్వహిస్తున్న ఈ లీగ్ లో ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని, అందుకే ఒకే వేదికపై మ్యాచులను నిర్వహిస్తున్నామని మార్షల్ స్పోర్ట్స్ సీఈవో, లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి అన్నారు. 

అయితే వ్యూయర్షిప్ పెంచుకోవడంతో పాటు  లీగ్ కు ఆదరణ కల్పించడానికే  తొలి నాలుగు రోజులతో పాటు వారాంతాల్లో  మూడు మ్యాచులను నిర్వహిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ ఈ సారి డబుల్ ఎంటర్టైన్మెంట్ అందివ్వడం మాత్రం పక్కా..  

click me!