
Top 5 highest partnerships in test cricket : మూడు ఫార్మాట్లలో టెస్ట్ క్రికెట్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ తమ బెస్ట్ ఇస్తే ప్లేయర్లకు మంచి గుర్తింపు వస్తుంది. చాలా మంది దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లు సుదీర్ఘమైన నాక్‌లు ఆడేందుకు మానసిక, శారీరక అలసటతో పోరాడుతూనే తమ క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి చక్కని వేదికగా ఉంటుంది.
టెస్ట్ క్రికెట్‌లో భాగస్వామ్యాలు మ్యాచ్ ఫలితాన్ని ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తాయి. భారీ భాగస్వామ్యాలు ఇద్దరు బ్యాటర్ల మధ్య నైపుణ్యాలు, పరస్పర అవగాహనను ప్రదర్శిస్తాయి. అయితే, టెస్టు క్రికట్ లో అత్యధిక పరుగుల టాప్-5 పార్ట్‌నర్ షిప్ పరుగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
5. డాన్ బ్రాడ్‌మన్- బిల్ పోన్స్‌ఫోర్డ్ (AUS) – 451 పరుగులు vs ఇంగ్లాండ్, 1934
1934 యాషెస్‌లో ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మన్ - బిల్ పోన్స్‌ఫోర్డ్‌ల మధ్య రెండో వికెట్‌కు 451 పరుగులు చేయడం టెస్ట్ క్రికెట్‌లో ఐదవ అత్యధిక పార్ట్‌నర్ షిప్ పరుగుల రికార్డుగా నిలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన బ్రాడ్‌మన్ (244), పోన్స్‌ఫోర్డ్ (266) సంచలన ఇన్నింగ్స్ లను ఆడారు. 451 పరుగుల భారీ భాగస్వామ్యం సాధించారు. ఇది ఆస్ట్రేలియా స్కోరు బోర్డును 701 పరుగులకు తీసుకెళ్లింది.
ఇంగ్లండ్ 321 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు 708 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్‌లో ఇంగ్లండ్ 145 పరుగులకే ఆలౌటై 562 పరుగుల తేడాతో ఓడిపోయింది.
4. హ్యారీ బ్రూక్ - జో రూట్ (ENG) - 454 పరుగులు vs పాకిస్తాన్, 2024
ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ - జో రూట్ టెస్టు క్రికెట్‌లో నాలుగో అత్యధిక పార్ట్‌నర్ షిప్ పరుగుల రికార్డును నమోదు చేశారు. 2024 పర్యటనలో ముల్తాన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో వీరిద్దరూ ఈ ఘనత సాధించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్, కెప్టెన్ షాన్ మసూద్, అఘా సల్మాన్ అద్భుత సెంచరీలతో చెలరేగడంతో 556 పరుగులకు పాక్ ఆలౌటైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ - జో రూట్ అద్భుత ఇన్నింగ్స్ లతో పాక్ బౌలింగ్ ను చిత్తు చేశారు.
నాలుగో వికెట్‌కు బ్రూక్, రూట్‌లు 454 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను కమాండింగ్ స్థానానికి చేర్చారు. రూట్ డబుల్ సెంచరీ చేయగా, బ్రూక్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఇంగ్లాండ్ 823/7 d పరుగులు చేసింది.
3. మార్టిన్ క్రోవ్ - ఆండ్రూ జోన్స్ (NZ) – శ్రీలంక vs 467 పరుగులు, వెల్లింగ్టన్, 1991
1991లో వెల్లింగ్టన్ టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ క్రోవ్ - ఆండ్రూ జోన్స్ 467 పరుగులతో టెస్ట్ క్రికెట్‌లో మూడవ అత్యధిక పార్ట్‌నర్ షిప్ ను నమోదుచేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక అరవింద డిసిల్వా 267 పరుగులు చేయడంతో 497 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ కేవలం 174 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌పై శ్రీలంక ఫాలోఆన్‌ను అమలు చేసింది.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆండ్రూ జోన్స్ - కెప్టెన్ మార్టిన్ క్రోవ్ మ్యాచ్ ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడారు. జోన్స్ 186, మార్టిన్ 299 పరుగులు చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 467 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వారి అద్భుత ఇన్నింగ్స్ లతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
2. సనత్ జయసూర్య - రోషన్ మహానామ (SL) 576 పరుగులు vs భారతదేశం, కొలంబో 1997
శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య - రోషన్ మహానామా 576 పరుగుల పార్ట్‌నర్ షిప్ తో టెస్ట్ క్రికెట్‌లో రెండవ అత్యధిక భాగస్వామ్య రికార్డును సాధించారు. 1997లో కొలంబోలో భారత్‌పై ఈ ఘనత సాధించారు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజారుద్దీన్‌లు అద్భుత సెంచరీలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 537/8 వద్ద డిక్లేర్ చేసింది.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో సనత్ జయసూర్య (340), రోషన్ మహానామ (225) రెండో వికెట్‌కు 576 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టెస్టు క్రికెట్‌లో ఇదే తొలి 500 పరుగుల భాగస్వామ్యం. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 952/6 వద్ద డిక్లేర్ చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. ఇది టెస్టు క్రికెట్‌లో అత్యధిక స్కోరు కావడం విశేషం.
Jayawardene-Sangakkara
1. మహేల జయవర్ధనే - కుమార సంగక్కర (SL) – 624 పరుగులు vs దక్షిణాఫ్రికా, కొలంబో, 2006
శ్రీలంక దిగ్గజ క్రికెటర్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర 624 పరుగుల టెస్టు క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 2006లో కొలంబోలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో వీరిద్దరూ ఈ ఘనత సాధించారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇది మొదటి, ఇప్పటివరకు ఏకైక 600+ పరుగుల పార్ట్‌నర్ షిప్.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక, జయవర్ధనే (374), సంగక్కర (287) భారీ స్కోరుతో చెలరేగడంతో 756/5 వద్ద డిక్లేర్ చేసింది. ఈ దిగ్గజ జోడీ మూడో వికెట్‌కు 624 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
ఆ తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 169 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 434 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ - 153 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది.