India Vs New Zealand: రోహిత్ శర్మకు విశ్రాంతి.. న్యూజిలాండ్ తో తొలి టెస్టుకు అతడే కెప్టెన్..!

First Published Nov 11, 2021, 6:07 PM IST

India Vs New Zealand: టీ20 ప్రపంచకప్ లో పేలవ ప్రదర్శన అనంతరం టీమిండియా.. న్యూజిలాండ్ తో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్నది. 

ప్రపంచకప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు  రానున్నది. టీమిండియాతో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్.. మూడు టీ20లు రెండు టెస్టులు ఆడనున్నది. కాగా టీ20ల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసఐ) ఇప్పటికే జట్టును ప్రకటించింది. 

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. కివీస్ తో మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 25-29 మధ్య తొలి టెస్టు.. డిసెంబర్ 3-7 మధ్య రెండో టెస్టు ఆడనున్నది. అయితే టీమిండియాకు టెస్టులకు రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి ఈ సిరీస్ లో తొలి టెస్టుకు విశ్రాంతి కోరాడు. 

ఈ నేపథ్యంలో  తొలి టెస్టుకు కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారా..? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీ20లకు కెప్టెన్ గా నియమించిన రోహిత్ శర్మనే తొలి టెస్టుకూ కొనసాగిస్తారని వార్తలు వస్తున్నా.. మరికొందరేమో టెస్టులకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అజింక్యా రహానేను నియమిస్తారని వాదనలు వినిపించాయి. 

అయితే బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం రహానే వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. ఇదే విషయమై గురువారం ముంబైలో సమావేశమైన  బోర్డు పెద్దలు.. తొలి టెస్టుకు రహానేను సారథిగా నియమించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. శుక్రవారం తుది జట్టును ప్రకటించే అవకాశముంది.

తీరిక లేని క్రికెట్ కారణంగా రోహిత్ శర్మ.. ఈ టెస్టు సిరీస్ నుంచి తనకు విశ్రాంతి కావాలని కోరినట్టు తెలుస్తున్నది. ఆరు నెలలుగా టీమిండియా సీనియర్ క్రికెటర్లంతా బయో బబుల్ లోనే గడుపుతున్నారు. అంతేగాక వారిపై పనిభారం కూడా పెరుగుతున్నది. 

బయో బబుల్, పని ఒత్తిడి కారణంగా ఇప్పటికే విరాట్ కోహ్లి.. టీ20 సిరీస్ తో పాటు తొలి టెస్టుకు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే  ముంబైలో జరిగే రెండో టెస్టుకు కోహ్లి అందుబాటులో ఉంటాడని చెబుతున్నా అది కూడా అనుమానమే. 

విరాట్, రోహిత్ తో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రిషభ్ పంత్, శార్దుల్ ఠాకూర్ లు కూడా ఈ సిరీస్ లకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో కీపర్లుగా వృద్ధిమాన్ సాహా, కెఎస్ భరత్ ను ఎంపిక చేసే అవకాశముంది. 

click me!