న్యూజిలాండ్ విజయం వెనక ఎమ్మెస్ ధోనీ... కెప్టెన్ కూల్ విన్నింగ్ ఫార్మాలాతో కెప్టెన్ ఐస్...

First Published Nov 11, 2021, 5:52 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి, అద్భుత విజయంతో తొలిసారి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కి చేరింది. అయితే కివీస్ విజయం వెనక కూడా ఎమ్మెస్ ధోనీ ఉన్నాడంట...

మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, 4 వికెట్ల నష్టానికి 166 పరుగుల స్కోరు చేసింది. డేవిడ్ మలాన్ 41 పరుగులు చేయగా మొయిన్ ఆలీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఇప్పటిదాకా టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ చేసిన జట్లే విజయాలను అందుకున్నాయి. క్వాలిఫైయర్స్ రౌండ్ నుంచి మొదలైన ఈ ఆనవాయితీని మెజారిటీ మ్యాచుల్లో కొనసాగింది...

అయితే 167 పరుగుల లక్ష్యఛేదనలో 13 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌తో పాటు కెప్టెన్ కేన్ విలియంసన్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు...

దీంతో ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో ఏ జట్టూ ఆఖరి 10 ఓవర్లలో 98 పరుగులు చేయలేకపోగా, ఆఖరి 10 ఓవర్లలో న్యూజిలాండ్ లక్ష్యం 109 పరుగులు...

డివాన్ కాన్వే 46 పరుగులతో ఆకట్టుకున్నా గ్లెన్ ఫిలిప్స్ 2 పరుగులకే అవుట్ కావడంతో ఉత్కంఠరేగింది. ఇంగ్లాండ్ జట్టు దాదాపు మ్యాచ్‌పై పట్టుసాధించేసిందని అనుకున్నారంతా...

అయితే ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన జేమ్స్ నీశమ్ 11 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 27 పరుగులతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్ చేరగా, డార్ల్ మిచెల్ ఆ దూకుడుని కొనసాగించి మ్యాచ్‌ని ముగించాడు...

ఆఖరి 2 ఓవర్లలో 20 పరుగులు కావాల్సిన దశలో మిచెల్, రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 20 పరుగులు రాబట్టి 19వ ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించేశాడు...

అయితే ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం ఖరారైపోయిన సమయంలో కామెంటరీ బాక్సులో ఉన్న కివీస్ కామెంటేటర్ సిమాన్ డౌల్, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు...

‘గ్రెటెస్ట్ లీడర్ ఎమ్మెస్ ధోనీ ఎప్పుడూ ఒకే మాట చెప్పేవాడు... ఓ బ్యాటర్‌గా ఎంత ఎక్కువ సేపు క్రీజులో పాతుకుపోతే, బౌలర్లపై అంత ప్రెషర్ పెంచడానికి అవకాశం దొరుకుతుంది.. విజయానికి కావాల్సిన కీ అదే...

న్యూజిలాండ్ జట్టు ఈరోజు ఎమ్మెస్ ధోనీ చెప్పిన ఆ మాటలనే ఫాలో అయ్యింది. వికెట్లు పడినా కంగారుపడకుండా, రన్‌రేట్‌ను పట్టించుకోకుండా బ్యాటింగ్ చేశారు... విజయాన్ని సొంతం చేసుకున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు సిమాన్ డౌల్...

దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కూడా ‘మిస్టర్ ఐస్’ కేన్ విలియంసన్, తన ఫెవరెట్ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గేమ్ ప్లానింగ్‌తోనే కివీస్‌ను తొలిసారి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ చేర్చాడని అంటున్నారు అభిమానులు...

అబుదాబీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇదే అత్యధిక ఛేదన. ఇంతకుముందు నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా 165 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది...

సాధారణంగా ఒక్కసారి చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన ప్లేయర్లు, ఆ తర్వాత ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ రాణించినా దానికి క్రెడిట్ మొత్తం మహేంద్ర సింగ్ ధోనీకి దక్కేది...

ఇంతకుముందు భారత క్రికెటర్లు దీపక్ చాహార్, రవీంద్ర జడేజా నుంచి ఇంగ్లాండ్ ప్లేయర్లు సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ వంటి వారి విషయంలో ఇదే జరిగింది. అయితే ఈసారి కివీస్ ప్లేయర్లలో ఎవ్వరికీ ధోనీతో, ధోనీ టీమ్ సీఎస్‌కేతో సంబంధం లేకుండా న్యూజిలాండ్ ఫైనల్ చేరిన తర్వాత ఎమ్మెస్ ధోనీ పేరు ట్రెండింగ్‌లో కనిపించడం విశేషం...

click me!