T20 World Cup టీమిండియా జ‌ట్టులోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ... బీసీసీఐ మంతనాలు !

First Published | Jan 3, 2024, 1:02 PM IST

Virat Kohli - Rohit Sharma: భార‌త స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల‌కు ఐసీసీ టీ20 ప్రపంచకప్ భార‌త జట్టులో  చోటుద‌క్క‌నుంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్ప‌టికే బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ సౌతాఫ్రికాలో ఉన్న విరాట్, రోహిత్ శ‌ర్మ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంపై ఆసక్తి నెల‌కొంది. 
 

ICC T20 World Cup - India : టీ20 వరల్డ్ క‌ప్ లో ఆడాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీలు ఇప్ప‌టికే త‌మ కోరిక‌ను బీసీసీఐ ముందు వెల్ల‌డించారని స‌మాచారం. అయితే, ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్ల భ‌విష్య‌త్తు గురించి బీసీసీఐ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. ఇదే విష‌యం గురించి చ‌ర్చించ‌డానికి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దక్షిణాఫ్రికాకు వెళ్లి సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడనున్నారు. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాబోయే టీ20 ప్రపంచకప్ కోసం 30 మంది ప్రాబబుల్స్ ను వీక్షించనున్నారు. ఇక టీ20 వరల్డ్ క‌ప్, వన్డే వరల్డ్ క‌ప్ రెండింటిలోనూ కోహ్లీ, రోహిత్ అద్భుతంగా రాణించారు. దీంతో ఇద్ద‌రిని జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయి కానీ.. బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నే ఆస‌క్తిక‌రంగా మారింది.

జూన్ లో జరిగే 2024 టీ20 ప్రపంచకప్ లో ఆడేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ స‌భ్యుల‌ను ఎంపిక చేయ‌డంలో మ‌రో త‌ల‌నొప్పిని ఎదుర్కొంటోంది. అఫ్గానిస్థాన్ తో టీ20 సిరీస్ కు టీంను ఎంపిక చేయ‌డంతో పాటు టీ20 వరల్డ్ క‌ప్ కు జ‌ట్టును ఎంపిక చేయ‌డంపై క‌స‌ర‌త్తులు చేస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు చోటు ద‌క్క‌తుందా?  లేదా? అనేది హాట్ టాపిక్ గా మారింది. కాగా, 2022 సెమీఫైనల్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ భారత టీ20 జట్టులో ఆడలేదు.
 


virat rohit

ఇద్దరు జాతీయ సెలక్టర్లు శివసుందర్ దాస్, సలీల్ అంకోలా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నారనీ, అగార్కర్ కూడా రెండో టెస్టు స‌మ‌యంలో వారితో క‌లుస్తార‌ని స‌మాచారం. ఈ సమయంలో కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తో అగార్కర్, సెలక్టర్లు మాట్లాడి ఆ తర్వాత అఫ్గానిస్థాన్ తో సిరీస్ కు జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. 
 

వెస్టిండీస్, యూఎస్ఏ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ క‌ప్ ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్ లో సుమారు 30 మంది ఆటగాళ్ల ప్రదర్శనను వీక్షించనున్నారు. జనవరి 11 నుంచి మొహాలీలో జరిగే టీ20 సిరీస్ కు అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేస్తుందా లేక ఐపీఎల్లోనే వారి ఫామ్, ఫిట్నెస్ ను పరిశీలిస్తుందా అనేది చూడాలి.

టీ20 వరల్డ్ క‌ప్ ఆడేందుకు తాము ఇష్టపడతామని ఈ ఇద్దరు లెజెండరీ ప్లేయర్లు స్పష్టం చేశారు. 'జనవరి 25 నుంచి ఇంగ్లాండ్ తో భారత్ టెస్టు సిరీస్ ఆడాల్సి ఉండగా, ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అఫ్గానిస్థాన్ తో జ‌రిగే టీ20 సిరీస్ కు ఎంపిక చేసే అవకాశం లేదు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఫిట్ గా లేరు. అఫ్గానిస్థాన్ తో సిరీస్ ను బట్టి ఏమీ అంచనా వేయలేం. ఐపీఎల్ మొదటి నెలలో ప్రదర్శన ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
 

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. టీ20, వన్డే సిరీస్లను పూర్తి చేసుకున్న టీమిండియా ఇప్పుడు రెండు మ్యాచ్ ల‌ టెస్టు సిరీస్ లో తలపడనుంది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టెస్టు సిరీస్ లో భారత్ 0-1తో వెనుకంజలో ఉంది. రెండో టెస్టు బుధవారం కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి టెస్టు సిరీస్ ను డ్రా చేసుకోవాలని చూస్తోంది.

Latest Videos

click me!