T20 World Record : సౌతాఫ్రికా vs వెస్టిండీస్ మధ్య 2023లో జరిగిన టీ20 మ్యాచ్ లో 517 పరుగుల అద్భుత రికార్డు నమోదైంది. సౌతాఫ్రికా భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి చరిత్ర సృష్టించింది. ఆ రికార్డు మ్యాచ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో 517 పరుగులు సాధించడం అసాధ్యం అనిపించే విషయం. కేవలం 120 బంతుల మ్యాచ్ లో ఇంత భారీ స్కోరు రావడం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 2023 మార్చి 26న సెంచూరియన్ వేదికగా జరిగిన సౌతాఫ్రికా - వెస్టిండీస్ టీ20 మ్యాచ్ లో ఈ పరుగుల రికార్డు సాధ్యమైంది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్లు మొత్తం 46 ఫోర్లు, 35 భారీ సిక్సర్లు బాదారు.
25
వెస్టిండీస్ సునామీ బ్యాటింగ్ తో భారీ స్కోర్
ఈ మ్యాచ్ లో మొదట ధనాధన్ బ్యాటింగ్ తో వెస్టిండీస్ అదరగొట్టింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 258 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాన్సన్ చార్ల్స్ కేవలం 46 బంతుల్లో 118 పరుగుల సెంచరీ నాక్ ఆడాడు. ఆయన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి.
కైల్ మేయర్స్ 27 బంతుల్లో 51 పరుగులు చేసి 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. రొమారియో షెపర్డ్ సునామీ బ్యాటింగ్ తో కేవలం 18 బంతుల్లో 41 పరుగులు సాధించాడు. మొత్తం వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 22 సిక్సర్లు వచ్చాయి. దీంతో భారీ స్కోర్ చేసింది.
35
బౌలర్లను చెడుగుడు ఆడుకున్న బ్యాటర్లు
వెస్టిండీస్ బ్యాటర్లు ఒకరికి మించి ఒకరు అద్భుతంగా ఆడారు. సౌతాఫ్రికా బౌలింగ్ ను దంచికొట్టారు. వెస్టిండీస్ బ్యాటర్ల ముదు ప్రోటీస్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. జాన్సన్ చార్ల్స్ స్ట్రైక్‌రేట్ 256.52 ఉండగా, కైల్ మేయర్స్ 188.88 స్ట్రైక్‌రేట్‌తో తన ఆటను కొనసాగించారు. రొమారియో షెపర్డ్ కూడా 227 స్ట్రైక్‌రేట్‌తో అదరగొట్టాడు. ఈ బ్యాటింగ్ దాడి ముందు సౌతాఫ్రికా బౌలర్ల వ్యూహాలు ఫలించలేదు.
259 పరుగుల టార్గెట్‌ని ఏ టీమ్ కూడా అంతకుముందు ఛేజ్ చేయలేదు. అందుకే వెస్టిండీస్ ఆటగాళ్లు తమ విజయాన్ని ఖాయం చేసుకున్నట్టే భావించారు. కానీ సౌతాఫ్రికా బ్యాటర్లు రికార్డులను బద్దలు కొట్టారు. అసాధ్యం అనుకున్న రికార్డు విజయాన్ని సుసాధ్యం చేశారు. సూపర్ విక్టరీ కొట్టి సంచలనం రేపారు.
55
టీ20 క్రికెట్ లో సౌతాఫ్రికా ప్రపంచ రికార్డు
సౌతాఫ్రికా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇది టీ20 ఇంటర్నేషనల్‌లో అప్పటివరకు జరిగిన అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 29 ఫోర్లు, 13 సిక్సర్లు వచ్చాయి.
క్వింటన్ డికాక్ 100 పరుగులు, రీజా 68 పరుగులు, ఐడెన్ మార్క్రామ్ 38 పరుగుల సునామీ నాక్ లు ఆడారు. మొత్తం మ్యాచ్‌లో 517 పరుగులతో టీ20 చరిత్రలో రికార్డుల మోత మోగించింది.