AAIB ప్రాథమిక నివేదికలో, విమానం టేకాఫ్ అయిన మూడు సెకన్లలోనే ఇంధన నియంత్రణ స్విచ్‌లు ‘కట్ ఆఫ్’ స్థితిలోకి మారాయని, ఫలితంగా రెండు ఇంజిన్లు ఆగిపోయాయని తెలిపింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో ఒక పైలట్ “ఎందుకు ఆపేశాడు?” అని ప్రశ్నించగా, మరొక పైలట్ “నేను ఆపలేదు” అని సమాధానం ఇచ్చిన ఆడియో కూడా ఉందని పేర్కొంది. అయితే ఇది ఉద్దేశపూర్వకమా లేక సాంకేతిక లోపమా అన్నది నివేదిక స్పష్టంగా చెప్పలేదు.
పిటిషన్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్, విచారణ బృందం కూర్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదుగురు సభ్యుల బృందంలో ముగ్గురు డీజీసీఏ అధికారులే ఉండటంతో ప్రయోజన సంఘర్షణ ఉందని వాదించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ “ఉన్నతాధికారులు బృందంలో ఉండటమంటే పాక్షికత అని అనుకోవడం తప్పు” అని వ్యాఖ్యానించారు.
అలాగే, పూర్తి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR) రీడౌట్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) పూర్తి ట్రాన్స్క్రిప్ట్ టైమ్‌స్టాంప్‌లతో సహా, ఎలక్ట్రానిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫాల్ట్ రికార్డింగ్ (EAFR) డేటా వంటివి దాచిపెట్టారని పిటిషన్ ఆరోపించింది. బదులుగా, కాక్‌పిట్ సంభాషణల నుండి కొంతభాగాన్ని మాత్రమే నివేదికలో ఉంచడం వల్ల పైలట్ తప్పిదం వైపు దృష్టి మళ్లించినట్టు వాదనలు వినిపించారు.